హైదరా‘బాధలకు’ బాధ్యులెవరు?

17 Oct, 2020 01:00 IST|Sakshi

సందర్భం 

నిజాం కాలంలోనూ, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ నగరానికి ప్రపంచస్థాయి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. హైదరాబాద్‌ నగర రోడ్లపై రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారని గతమంతా ఘనకీర్తి. కానీ, నేడు రాజధాని మెయిన్‌ రోడ్లు, కాలనీలు మూసీనది మురుగు నీటితో కంపు కొడుతున్నాయి. చిన్న వానలకే హైదరాబాద్‌ చిగురుటాకుల వణుకుతున్నది. లోతట్టు ప్రాంతాలు, పేదలు నివసిస్తున్న బస్తీల బాధలు వర్ణనాతీతం. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాలకు హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ఎటుచూసినా, రోడ్లమీద నదులు ప్రవహిస్తున్నట్టు వరద ప్రవాహం కనబడుతోంది. జి.హెచ్‌.ఎం.సి ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో, హైదరాబాద్‌ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారానికి తెరలేపింది. కానీ, హైదరాబాద్‌లో కురిసిన ఒక్క గంటసేపు వర్షం, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపినట్టయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ హైదరాబాద్‌ నగరాన్ని డల్లాస్‌ నగరం కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు, సచివాలయం ఎదురుగా ఉన్న హుస్సేన్‌ సాగర్‌ను మినరల్‌ వాటర్‌తో నింపుతామన్నారు. మరీ, ఒక్కపూట వర్షానికే మనుషులు, కార్లు, లారీలు బైక్‌లు కొట్టుకుపోయే దుస్థితి ఎందుకొచ్చింది? నిన్నటి దాకా కరోనా, ఇప్పుడు వరదలు. హైదరాబాద్‌ వాసుల కష్టాలకు బాధ్యులు ఎవరు?

నీరు పల్లమెరుగు. లోతట్టు ప్రాంతాల్లో, నీటి ప్రవాహ మార్గాలకు అడ్డంగా కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టారు. జి.హెచ్‌.ఎం.సి అధికారులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనధికార కట్టడాలను, వాటి నిర్మాణ దశలోనే అడ్డుకుంటే సమస్య ఇంత తీవ్రరూపు దాల్చేది కాదు. ఇపుడు ఆ నిర్మాణాలను ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో అక్రమ నిర్మాణం రెగ్యులరైజ్‌ చేస్తామంటున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్‌ మహానగరంలో మౌలిక వసతుల కల్పన కుంటుపడింది. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణనికి, నిర్వహణకు నోచుకోలేదు. జూబ్లీహిల్స్‌లో అర కిలోమీటర్‌ దూరానికి ఒక రోడ్డు చొప్పున నాలుగు లైన్ల రోడ్లు, సైబర్‌ సిటీలో కొండలు చీల్చి, కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల చుట్టూ రోడ్లు వేయటానికి పురపాలకశాఖ చూపిన శ్రద్ధ సగటు మనిషి తిరిగే బిజీ రోడ్ల మరమ్మతులపై చూపకపోవడం శోచనీయం. 

గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌ ముందే, కార్లు మునిగే వరద ప్రవహిస్తుంది. శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక చెరువులా మారింది. ఇంత జరుగుతున్నా జి.హెచ్‌.ఎం.సి సిబ్బంది సహాయక చర్యలు అంతంత మాత్రమే. ఒకవైపు  పేదల ఇండ్లు వరదలకు మునిగిపోయి, తినటానికి తిండిలేక ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడుతుంటే, హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి వర్షం పడితే నీళ్ళు రాక నిప్పు వస్తుందా అని హేళన చేస్తూ, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.  ప్రజలు ఇబ్బందులలో ఉన్నపుడు, కేసీఆర్‌ నేనున్నాననే భరోసానూ ఇవ్వలేదు.

ఇంతవరకు 25 మందిని పొట్టన పెట్టుకుని, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన హైదరాబాద్‌ వరదలను ప్రధాని మోదీ జాతీయ విపత్తుగా ప్రకటించాలి. 150 కాలనీలలో నిరాశ్రయులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వటానికి అవసరమైన నిధులను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ద్వారా మంజూరు చేయాలి. సర్వం కోల్పోయిన చిన్న పిల్లలకు, మహిళలు, వృద్ధులకు యుద్ధప్రాతిపదికన పాలు, ఆహార పదార్థాలు అందజేయాలి. మొదటి ప్రాధాన్యతగా విద్యుత్‌ సదుపాయాల పునరుద్ధరణ కోసం స్తంభాలు, వైర్లు, ట్రాన్సా్ఫర్మర్లకు అవసరమైన బడ్జెట్‌ వెంటనే విడుదల చేయాలి. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ తరపున డిమాండ్‌ చేస్తున్నాము.


కొనగాల మహేష్‌
వ్యాసకర్త ఏఐసీసీ సభ్యులు
మొబైల్‌ : 98667 76999

మరిన్ని వార్తలు