కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!

25 Nov, 2021 12:59 IST|Sakshi

పంచభూతాలపైన అందరికీ సమాన హక్కు, సమాన బాధ్యత ఉండాలి. మనిషి మనుగడకు కీలకమైన గాలి కలుషితమైనాక జీవి మనుగడ ప్రశ్నార్థకమే కదా. శీతాకాలంలో భారతీయ నగరాల్లో జీవించడం ప్రమాదకరం. ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది.  ఇది ఏ ఒక్క నగరానికో సంబంధించిన సమస్య కాదు.

గ్లాస్గోలో జరిగిన కాప్‌ 26 శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో, విషపూరిత వాయు కాలుష్య స్థాయులను నియంత్రించడంలో భారత్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఉంది. చైనా, అమెరికా, ఐరోపా కూటమి తర్వాత భారత్‌ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారకం. 2070 నాటికి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను నికర సున్నాకి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నికర సున్నా ఉద్గారాలు అంటే మానవ నిర్మిత గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలన్నీ వాతా వరణం నుండి తొలగించబడి, తద్వారా భూమి సహజ వాతావరణ సమతుల్యతను తిరిగిపొందడం. యూకే ఆధారిత నాన్‌–ప్రాఫిట్‌ క్లీన్‌ ఎయిర్‌ ఫండ్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ప్రకారం, వాయు కాలుష్యం భారతీయ వ్యాపారాలకు సాలీనా తొంభై ఐదు బిలియన్‌ డాలర్ల నష్టం చేకూరుస్తోంది. దేశ జీడీపీలో దాదాపు మూడు శాతం వాయు కాలుష్య పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి ఖర్చవుతుందని బ్లూమ్‌బెర్గ్‌ నివేదించింది. 2024 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందాలనే భారతదేశ ఆకాంక్షను ఈ పరిణామాలు అడ్డుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సమయం ఇదే!)

మానవుల శ్రేయస్సు, తద్వారా ఆర్థికవ్యవస్థపై వాయుకాలుష్య ప్రతికూల ప్రభావాల దృష్ట్యా, వాయు కాలుష్య నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్‌ క్వాలిటీ సూచిక రెండు వందల ఒకటి నుంచి మూడువందల పాయింట్ల మధ్య ఉంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ వ్యాధీలేని సాధారణ మానవులు సైతం అనారోగ్య సమస్యలుఎదుర్కొనే అవ కాశం ఉంటుంది. మూడువందల పాయింట్లు మించితే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సుమారు ఐదు వందలు పాయింట్లు తాకడం గమనార్హం. ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీలో ధూళి నియంత్రణ, పూసా బయో– డికంపోజర్‌ను ఉపయోగించడం, స్మోగ్‌ టవర్‌లను ఏర్పాటు చేయడం, గ్రీన్‌ వార్‌ రూమ్‌లను బలోపేతం చేయడం, వాహనాల ఉద్గారాలను తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ఢిల్లీ పరిసర  ప్రాంతాల్లో రైతులు కొయ్యకాళ్ళు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిల మైంది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అక్టో బర్‌ 24 నుంచి నవంబర్‌ 8 వరకు ఢిల్లీ కాలుష్య కారకాల్లో సగం వాహనాలే ఉన్నాయని పేర్కొంది. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం)

ఈ సంవత్సరం కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘఢ్, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు దీపావళి బాణసంచా పేల్చడంపై ఆంక్షలు విధించాయి. దేశంలోని అన్ని నగరాలు నవంబర్‌ మాసంలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకొని నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మారుతున్నాయి. పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం వున్న నగరాలు మొత్తం ఆసియాలోనే ఉండటం గమనార్హం. వరదలతో సతమతమవుతున్న జకార్తా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జైపూర్, లక్నో, ముంబై వాయు కాలుష్య పరంగా అత్యంత కలుషితమైన నగరాలు. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం

పంటవ్యర్థాలతో వాయుకాలుష్యానికి ఆస్కారం లేకుండా ‘టకాచార్‌’ వంటి యంత్రాల ద్వారా ఉపయో గకరమైన ఇంధనంగా మలచవచ్చు. దీంతో వాయు నాణ్యత, రైతుల ఆదాయం పెరగటమేకాక నిరుద్యో గులకు ఉపాధి దొరకుతుంది. కాలుష్య నియంత్రణ ప్రణాళికకు తోడ్పడే వ్యవస్థీకృత జ్ఞానం అభివృద్ధి చెంద వల్సి వుంది.

నాన్‌–బయోడీగ్రేడబుల్‌ వ్యర్థాల రీసైక్లింగ్, అప్‌ సైక్లింగ్‌ను ప్రోత్సహించాలి. బయోడీగ్రేడబుల్‌ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడానికి బలమైన కార్యాచరణ కావాలి. కాప్‌ 26లో ఉద్ఘాటించిన విధంగా 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకోగలిగితే తప్పకుండా వాయు ఉద్గారాలను గణనీయంగా నియంత్రించ గలుగుతుంది. వాయు కాలుష్య నియంత్రణ అనేది ఒక వ్యయం కాదు, దేశ భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడి.

– డా. సృజన కత్తి
ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చర్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం 

మరిన్ని వార్తలు