నాటి సంస్కరణలే గుర్తుకొస్తున్నాయ్‌..!

24 Jul, 2021 00:17 IST|Sakshi

విశ్లేషణ

భారత ఆర్థిక వ్యవస్థను మూలమలుపు తిప్పిన తీవ్ర సంస్కరణలు దేశంలో మొదలై నేటికి 30 ఏళ్లయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రారంభించిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయి. కానీ, మూడు దశాబ్దాల తర్వాత కూడా దేశ ఆర్థికవృద్ధిపై నిరాశ అలుముకుంటోంది. 1991 నాటి తీవ్ర సంస్కరణలను పునఃసృష్టి చేయాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జీడీపీ పతనం, కోవిడ్‌–19 కలిగించిన ఉత్పాతం మళ్లీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. పీవీ, మన్మోహన్‌ల సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం.

భారతదేశంలో 1991 సంస్కరణలు మొదలై నేటికి 30 ఏళ్లు. దేశ ఆర్థిక విధానాలను మూల మలుపు తిప్పిన ఆ గొప్ప దశ గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏదైనా ఒక విశిష్ట ఘటనను తర్వాతి  కాలక్రమంలో రజిత, స్వర్ణ, ప్లాటినమ్, శతాబ్ది వార్షికోత్సవాలతో గుర్తుంచుకోవడం కద్దు. వీటితో పోల్చి చూస్తే ముప్ఫై సంవత్సరాలకు అంతగా ప్రాధాన్యత లభించకపోవచ్చు. కానీ 1991 నాటి సంస్కరణలను ఇప్పుడు ఇంత విస్తృతంగా గుర్తించు కోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణం ఆర్థికవృద్ధికి సంబంధించి ప్రస్తుతం అలుముకుంటున్న నిరాశా దృక్పథమే. దేశంలో సంస్కరణలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ అసలు పని చేస్తున్నాయా లేదా అనే అంశంపై సందేహాలు తలెత్తుతున్న సందర్భ మిది. మనకు ఆర్థికవృద్ధికి సంబంధించి ఒక వ్యూహం కానీ విధానం కానీ ఉందా అనే ప్రశ్న రేగుతోంది. 1991లో చేపట్టిన ఉదారవాద, సరళీకరణ క్రమం ఇప్పుడు వెనకపట్టు పడుతున్న సూచనలు కనిపిస్తు న్నాయి. అందుకనే 1991లో జరిగినట్లుగా ఆర్థిక స్తబ్దతను బద్దలు గొట్టడానికి ఏదైనా నాటకీయ చర్యను తప్పకుండా చేపట్టాలని ఆర్థిక రంగ నిపుణులు పిలుపునిస్తున్నారు. అప్పట్లో మారకద్రవ్య విలువను తగ్గించడం, పారిశ్రామిక లైసెన్స్‌ రాజ్‌ను ఎత్తివేయడం వంటి చర్యలు  వనరుల సమీకరణలో కీలకమైన మార్పులు తీసుకొచ్చాయి.

రెండేళ్లక్రితమే మోదీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్‌– 19 నేపథ్యంలో ఆనాటి సంస్కరణలను గుర్తుచేసుకోవడం మరింతగా పెరిగింది. 1991లో దేశం చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు తీవ్ర చర్యలు చేపట్టినట్లే, ప్రస్తుత సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. రెండేళ్లకు ముందు చమురుధరలు కుప్పగూలడంతో భారత ఆర్థిక వృద్ధికి చెందిన అడ్డం కులు తొలిగిపోయినట్లయింది. ప్రైవేట్‌ పెట్టుబడులకు డిమాండ్‌ కొరత కొనసాగింది. ఈ కొరతను ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలతో భర్తీ చేయసాగారు. దీనికి చమురుపై పన్ను ద్వారా పెరిగిన రాబడులు దేవుడిచ్చిన బహుమతిగా ఉపయోగపడ్డాయి. అదే సమయంలో అంటే 2016–17 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు సగటు ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రతికూల ప్రభావం చూపింది.

రాజకీయ ఇచ్ఛ లోపించడం కారణంగా పెండింగులో ఉండిపో యిన ఉత్పత్తి–మార్కెట్‌ సంస్కరణలకు సంబంధించిన డిమాండ్‌ ఈ సమయంలోనే వేగం పుంజుకుంది. నిజానికి మొదలుపెట్టకుండా నిలిపివేసిన సంస్కరణలకు కొత్త దారి చూపేందుకు, 2014లో బల మైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇదే రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన తొలి హయాంలో వస్తుసేవల పన్నును 2017 జూలైలో ప్రవేశపెట్టడం ద్వారా తీవ్రమైన ఆర్థిక సంస్క రణలకు దారితీసింది. 2016లో బ్యాంకింగ్, కార్పొరేట్‌ రంగాల నుంచి చాలాకాలంగా పేరుకుపోయి ఉన్న మొండిబకాయిల పరి ష్కారం కోసం దివాలా కోడ్‌ని ప్రవేశపెట్టారు. 

అయినప్పటికీ, స్థూలదేశీయోత్పత్తి తదుపరి రెండేళ్లలో పతనాన్ని చవిచూసింది. 2018–2019 సంవత్సరాల్లో మన జీడీపీ వరుసగా 6.8 శాతం, 6.5 శాతాన్ని మాత్రమే నమోదు చేసింది. దీంతో 1991 తరహా సంస్కరణలకు అనుకూలంగా ప్రైవేట్‌ రంగం గొంతు విప్పసాగింది. 2019 మధ్యనాటికి కేంద్రంలో గత ప్రభుత్వమే మళ్లీ అధికారానికి వచ్చినప్పటికీ ఆర్థిక వృద్ధి విషయంలో నిరాశాతత్వం మరింత పెర గడం కాకతాళీయమే కావచ్చు. ఆర్థిక సంస్కరణల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిందిగా పరిశ్రమ నుంచి అభ్యర్థనలు పెరి గాయి. అంతవరకు కొనసాగిన సంస్కరణలు అనుకున్నంత ప్రయో జనం కలిగించలేదని, ప్రభుత్వ మదుపు.. వాణిజ్య రంగానికి అవస రమైనంతమేరకు లభ్యం కావడం లేదని అభిప్రాయాలు బలపడ్డాయి. దీంతో ప్రైవేట్‌ మదుపును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం వేగంగా స్పందించి 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ పన్నులపై కోత పెట్టింది. ప్రతివారం అనేక ఇతర చర్యలు కూడా చేపట్టింది. కానీ జీడీపీ 5 శాతానికి దిగువకు పడిపోయింది. 2019 జూలై–సెప్టెంబర్‌లో 4.6 శాతానికి, అక్టోబర్‌–డిసెంబర్‌లో 3.3 శాతానికి 2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3 శాతానికి మన స్థూల దేశీయోత్పత్తి దిగ జారిపోయింది. గత సంవత్సరం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ వెన్నెముక విరిగినంత పనయింది. ఈ సంక్షోభాన్ని అవ కాశంగా మలచాలంటూ పిలుపులు మొదలైపోయాయి. దీంతో కార్మిక, వ్యవ సాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర మార్పులు తీసుకొచ్చింది. అలాగే ఆత్మనిర్భర్‌ సిరీస్‌లో కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చారు. కానీ, వ్యవసాయ మార్కెట్లు, సంస్థలలో తీసుకొచ్చిన కీలక మార్పులు ఎదురుతన్నడంతో ఈ రంగంలో భవిష్యత్‌ ప్రయో జనాలను ఊహించడం కష్టసాధ్యమవుతోంది.

చరిత్ర గతిని మార్చిన ఆ వందరోజులు
ముప్ఫై ఏళ్ల క్రితం పార్లమెంటు సభ్యుడు కూడా కాని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ క్రమాన్నే నాటకీయంగా మార్చివేసిన సాహ సోపేతమైన సంస్కరణలకు నాంది పలికారు. ద్రవ్య, చెల్లింపుల సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు నాటి ప్రభుత్వం తన తొలి వంద రోజుల పాలనలోనే వరుస సంస్కరణలకు తెరతీసింది. దీనికి బలమైన నేపథ్యం ఉంది. 1991 జూలై తొలి వారంలో భారత విదేశీమారక ద్రవ్య నిల్వలు కేవలం ఒక బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ప్రవాస భారతీ యులు తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం మొదలెట్టడంతో పరి స్థితి మరింత తీవ్రమైంది. దీంతో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌ తమ తొలి వందరోజుల పాలన లోనే దేశ ఆర్థికక్రమాన్ని మలుపుతిప్పిన కఠిన చర్యలకు పూనుకున్నారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తొలి పక్షం రోజుల్లోనే అంటే 1991 జూలై 2న అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు భారత కరెన్సీ విలువను 9.5 శాతానికి తగ్గించివేసింది. ఆ తర్వాత ఒక్క రోజు వ్యవధిలో రూపాయి విలువను మరో 12 శాతం మేరకు తగ్గించి షాక్‌ కలిగించింది. అదేరోజున నాటి వాణిజ్యమంత్రి పి. చిదంబరం ఎగుమతిదారులకు నగదు ప్రోత్సాహా న్నందిస్తున్న సబ్సిడీలను రద్దుచేశారు. కొన్ని రకాల సరకుల దిగుమతిపై ప్రభుత్వ రంగ సంస్థలు చలాయిస్తున్న గుత్తాధిపత్యాన్ని ఎత్తివేశారు. మార్కెట్‌కు స్వేచ్ఛకలిగించే ఎగ్జిమ్‌ చట్టాన్ని తీసుకువస్తూ సుంకం లేని దిగుమతులకు అవకాశమిచ్చే లైసెన్సులను రద్దు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించి పది కీలకరంగాల్లో ప్రైవేట్‌ సంస్థలకు అనుమతించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను క్రమంగా ఉపసంహరించుకునే విధానాన్ని ప్రకటించారు. గడిచిన ముప్ఫై ఏళ్లుగా ద్రవ్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఇతర సంస్కరణలను ఎన్నింటినో తీసుకువచ్చారు. కానీ ఆరోజు పీవీ ప్రభుత్వం చేపట్టిన సంస్క రణల నమూనా తర్వాత గత ముప్ఫై ఏళ్లుగా కేంద్రంలో ఏర్పడిన ప్రభు త్వాలు, వాటి ఆర్థిక మంత్రులు అదే రీతిలో కొనసాగిస్తూ ఉండటం గొప్ప విషయంగానే చెప్పాలి. గత రెండేళ్లకుపైగా డీజీపీ రేటు పడిపోవడం, కోవిడ్‌– 19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలవడం నేపథ్యంలో నాటి పీవీ, సింగ్‌ సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు గత కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం.


రేణు కోహ్లి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు