ఏక వ్యక్తి సైన్యంలా పనిచేశారు!

6 Apr, 2023 01:07 IST|Sakshi

చాలామంది అంబేడ్కర్‌ను మేధావిగా, న్యాయకోవిదుడిగా కొనియాడతారు. కానీ దేశభక్తుడిగా అంగీకరించరు. బ్రిటిష్‌ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి తేనే దేశభక్తుడనే భ్రమలో చాలామంది ఉన్నారు. కానీ అందులో ప్రజలు, దేశ సమైక్యత, దేశాభివృద్ధి అనే మాటలు కనపడవు. రాజ్యాంగ సభలో అంబే డ్కర్‌ వినిపించిన వాణి రాజ్యాంగ రూపకల్పనకే ఒక మార్గాన్ని వేసింది.

అనంతరం ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా సంఘానికి ఛైర్మన్‌ అయ్యారు. వివిధ కారణాల వల్ల దాదాపు ఒంటరిగా శ్రమించాల్సి వచ్చింది. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఈ యజ్ఞాన్ని కొనసాగించారు. ఆ నాలుగేళ్లలో రోజుకు 20 గంటలు పనిచేసిన సందర్భాలున్నట్టు ఆయన సహాయకులుగా పని చేసినవాళ్ళు తమ జ్ఞాపకాలలో రాసుకున్నారు.

‘నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించడం’ అని ఒక సామెత! బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని చోట్ల పార్టీలు ఆయన్ని ప్రశంసిస్తున్నాయి. కానీ ఆ పార్టీల నాయకులే నిరాధార ఆరోపణలతో పుస్తకాలు రచిస్తున్నారు. గతంలో జర్నలిస్టు, బీజేపీ నాయకుడు అరుణ్‌ శౌరి విద్వేషపూరితంగా రాసిన పుస్తక ఉదాహరణ ఉండనే ఉన్నది. ఇటీవల కాంగ్రెస్‌ నాయకుడు శశి థరూర్‌ కూడా అంబేడ్కర్‌పై రాసిన పుస్తకంలో కొన్ని అసత్య వ్యాఖ్యలు చేశారు.

చాలామంది అంబేడ్కర్‌ను మేధావిగా, విద్యావేత్తగా, న్యాయ కోవిదుడిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా కొనియాడతారు. కానీ దేశభక్తుడిగా అంగీకరించరు. ఆనాటి కమ్యూనిస్టులు సైతం ఆయనకు బ్రిటిష్‌ ఏజెంట్‌ అన్న ముద్రవేసి దుష్ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. కానీ అంబే డ్కర్‌ అటువంటి మాటలకు ఏనాడూ చలించలేదు. బ్రిటిష్‌ వాళ్ళకు వ్యతిరేకంగా, లేదంటే విదేశీయులకు వ్యతిరేకంగా మాట్లాడి తేనో, పోరాడితేనో దేశభక్తుడనే భ్రమలో చాలామంది ఉన్నారు.

ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే పాట. కానీ అందులో ప్రజలు, దేశ సమై క్యత, దేశాభివృద్ధి, మానవాభివృద్ధి అనే మాటలు కనపడవు. వారం రోజుల్లో మనం బాబాసాహెబ్‌ జయంతి ఉత్సవాలను జరుపు కోబోతున్నాం. ఈ సందర్భంగా చాలామంది దృష్టికి రాని రెండు విషయాలను మీ ముందుంచాలనుకుంటున్నాను.

అందులో మొదటిది, భారత స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రూపకల్పన కోసం ఏర్పడిన రాజ్యాంగ సభలో అంబేడ్కర్‌ నిర్వహించిన పాత్ర. రాజ్యాంగ సభ సమావేశాలు 1946 డిసెంబర్‌ 9న ప్రారంభమయ్యాయి. అయితే డిసెంబరు 13వ తేదీన పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

14న శనివారం, 15న ఆదివారం అయినందుకు మళ్ళీ సమావేశాలు డిసెంబరు 16న మొదలయ్యాయి. కేవలం ఒకరోజు తర్వాత అంటే డిసెంబరు 17న జరిగిన సమావేశంలో అంబేడ్కర్‌కు అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన అంబేడ్కర్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంత తొందరగా తనకు అవకాశం వస్తుందని భావించలేదని కూడా తెలిపారు. 

రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తెలియజేస్తూనే, దేశ భవిష్యత్తు గురించి ఆయన అన్న మాటలు అక్కడ కూర్చున్న వందలాది మంది విజ్ఞులను, మేధా వులను ఆలోచింపజేశాయంటే అతిశయోక్తి కాదు. ‘‘ఈ రాజ్యాంగ సభ ద్వారా మన గొప్పదేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దుకుంటామనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.

మనం ఈ రోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా విభజింపబడి ఉన్నామనే విషయం నాకు తెలుసు. మనం వివిధ శిబిరాలకు చెందినవాళ్ళం. ఇవి శత్రు శిబిరాలుగా కూడా ఉన్నాయి. నేను కూడా అటువంటి శిబిరానికి చెందిన వాడనని ఒప్పుకొంటున్నాను. ఇన్ని రకాల సమస్యలున్నప్పటికీ ఈ దేశం సమైక్యంగా నిలబడడంలో ప్రపంచంలోని ఏ శక్తులూ మనల్ని అడ్డుకోలేవనే విశ్వాసం నాకు న్నది.’’అంతేకాకుండా, ముస్లిం లీగ్‌ విషయం, ముస్లింల విషయాన్ని ప్రస్తావిస్తూ...‘‘హిందూ–ముస్లిం సమస్యను సంఘర్షణ లతో, బల ప్రయోగంతో పరిష్కరించుకోలేం. వివేకం ద్వారా, సామరస్య పూర్వ కంగా పరిష్కరించుకోవాలి. బ్రిటిష్‌ రాజనీతివేత్త బర్క్‌ చెప్పినట్టుగా, మనం బలవంతంగా ఎవరినీ లొంగదీసుకోలేం, వారిని మనం మనతో కలుపుకోవాలి’’ అంటూ తన ఉపన్యాసాన్ని ముగించారు. 

ఇటువంటి దార్శనికతను కలిగిన అంబేడ్కర్‌ను రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఓడించారు. అప్పటి తూర్పు బెంగాల్‌ నుంచి ఎన్నికైన షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ నాయ కులు జోగేంద్రనాథ్‌ మండల్‌ రాజీనామా చేసి, అంబేడ్కర్‌ను జైసూర్‌ కుల్నా నియోజకవర్గం నుంచి రాజ్యాంగ సభకు ఎంపిక చేశారు. అయితే కొద్ది కాలంలోనే తూర్పు బెంగాల్‌ పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోవడంతో అంబేడ్కర్‌ రాజీనామా చేశారు. 

రాజ్యాంగ సభలో అంబేడ్కర్‌ సభ్యుడిగా ఉండాలనే ప్రతిపాద నను రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కాంగ్రెస్‌ ముందుంచారు. 1947 జూన్‌ 30న నాటి బొంబాయి ప్రధాన మంత్రి బి.జి. ఖేర్‌కు ఉత్తరం రాస్తూ, ‘‘డాక్టర్‌ అంబేడ్కర్‌ విషయంలో ఎవరికి ఎన్ని అభిప్రాయ బేధాలున్నప్పటికీ ఆయనను తిరిగి రాజ్యాంగ సభ లోకి తీసుకోవాలి. గత సమావేశాల్లో డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్రదర్శించిన వివేకం, మార్గదర్శనం చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వస్తున్నాను’’ అంటూ కరాఖండీగా చెప్పారు. ఆ విధంగా మళ్లీ బొంబాయి నుంచి అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో అడుగుపెట్టారు. 

1947 ఆగస్టు 27న రాజ్యాంగ రచనాసభ ఏడుగురు సభ్యులతో రచనాసంఘాన్ని నియమించింది. ఏడుగురిలో అంబేడ్కర్‌ను ఛైర్మ న్‌గా ఎంపిక చేశారు. రాజ్యాంగాన్ని పూర్తి చేసి సమర్పించిన రోజున కమిటీ సభ్యులలో ఒకరైన కృష్ణమాచారి మాట్లాడుతూ, ‘‘ఈ కమిటీలో ఏడుగురు సభ్యులున్నప్పటికీ, డాక్టర్‌ అంబేడ్కర్‌ మాత్రమే పూర్తికాలం పనిచేసిన ఏకైక వ్యక్తి. ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు.

మరొక సభ్యుడు మరణించారు. వారి స్థానాల్లో ఎవరినీ తీసుకోలేదు. మరొక సభ్యుడు ప్రభుత్వ పనులలో తీరిక లేకుండా ఉన్నారు. ఇంకొక ఇద్దరు సభ్యులు అనారోగ్య కారణాల వల్ల ఢిల్లీకి దూరంగా ఉన్నారు’’అంటూ అత్యంత స్పష్టంగా రాజ్యాంగ రచన వెనుక అంబేడ్కర్‌ కృషినీ, నిబద్ధతనీ వెల్లడించిన విషయాన్ని ఎవరైనా కాదనగలరా? 

డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, ‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్క ర్‌ను రాజ్యాంగ రచనా సంఘానికి ఛైర్మన్‌గా ఎన్నుకోవడం ఎంత సరై నదో అందరికన్నా నేను ఎక్కువగా గుర్తించగలిగాను. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఈ రచనా కార్యాన్ని యజ్ఞంలా కొనసాగించాడు’’ అంటూ ప్రశంసించారు. రాజ్యాంగ రచన సాగించిన ఆ నాలుగేళ్ల కాలంలో అంబేడ్కర్‌ చాలా దెబ్బ తిన్నారు.

దాదాపు రోజుకు 20 గంటలు పనిచేసిన సందర్భాలున్నట్టు ఆయన సహా యకులుగా పని చేసినవాళ్ళు తమ జ్ఞాపకాలలో రాసుకున్నారు. అంటే ఒక వ్యక్తి దేశం కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడితే, ఆయన సమాజంలోని కులతత్వ వాదులకు దేశద్రోహిగా, అంటరానివాడిగా కనిపించడం మన భావదారిద్య్రానికి నిదర్శనం కాదా?

రెండవ విషయం, 1932 తర్వాత అంబేడ్కర్‌ హిందూ మతంతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించడం. అప్పటి వరకు జరిగిన రాజకీయ, సామాజిక కుట్రలు ఆయనను చలింపజేశాయి. ఎప్పుడైతే, తాను హిందూమతంలో ఇక ఉండలేనని ప్రకంటించారో... ముస్లిం, క్రైస్తవ, సిక్కు మత పెద్దలు ఆయన్ని తమ తమ మతాల వైపు తిప్పు కోవడానికి ప్రయత్నాలు చేశారు.

మిత్రుల ద్వారా, ప్రత్యక్షంగా కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ అంబేడ్కర్‌ ఆ మూడు మతా లను వివిధ కారణాల వలన తిరస్కరించారు. చివరకు 1950 తర్వాత బౌద్ధం వైపు వెళుతున్నట్టు ప్రకటించి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒకవేళ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బౌద్ధం కాకుండా ఇంకో మతం  పుచ్చుకున్నట్లయితే, పరిణామాలు ఇంకోలా ఉండేవి.

తాను, తన జాతి ఎన్నో అవమానాలు, వివక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజాస్వామ్యయుతంగా, శాంతిగా తన ఉద్యమాలు కొనసాగించిన వారు అంబేడ్కర్‌! అలాంటి బాబాసాహెబ్‌ను నిరాధార ఆరోపణ లతో, అనవసర విషయాలతో విమర్శల పాలుచేయాలా?

మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌: 81063 22077
(ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి) 

మరిన్ని వార్తలు