కార్మికులను కాపాడాం... గుణపాఠాలో!

2 Dec, 2023 00:43 IST|Sakshi

ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిరక్షణ చర్య విజయవంతంగా ముగిసింది. పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో దాదాపు 17 రోజులపాటు చిక్కుకున్న కార్మికులందరినీ భారతీయ, విదేశీ నిపుణులు ఉమ్మడిగా సురక్షితంగా బయటికి తీయగలిగారు. హిమాలయ ప్రాంతంలో ఒక పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. సిల్‌క్యారా సొరంగంలో జరిగిన విపత్తు... పెళుసైన కొండ ప్రాంతాలలో చేపట్టే భారీ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కఠినతరమైన భూభాగంలో కార్యకలాపాల భద్రతపైనా, అలాంటి ప్రాజెక్టులకు అవసరమైన విపత్తు సంసిద్ధతపైనా కూడా ప్రశ్నలను లేవనెత్తింది. హిమాలయ పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని నష్టం నుండి రక్షించడానికి ఈ సొరంగ ప్రమాద ఘటన మరో మేల్కొలుపు కావాలి.

బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ వంటి ముఖ్యమైన మతపరమైన పుణ్యక్షేత్రాలను కలుపుతూ, అన్ని వాతావరణాల్లో పనిచేసే నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలనే లక్ష్యంతో, ప్రతిష్టా త్మకమైన చార్‌ ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా సిల్‌క్యారా సొరంగాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును పర్యావరణ సంఘాలు విమర్శించాయి. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాయి. అనేక ప్రభుత్వ కమిటీలు ప్రాజెక్టును వివిధ కోణాల్లో పరిశీలించి, దానికి అనుమతిని ఇచ్చాయి. అయితే ప్రస్తుత సొరంగ ప్రమాద ఘటన హిమాలయ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడంపై అన్ని సందేహాలను, భయాలను పునరుద్ధరించింది. 
 

సొరంగాలు ఉత్తమ మార్గమే అయినా...
అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, పర్యావరణ హానిని తగ్గించడానికి సొరంగ నిర్మాణం ఒక మంచి ఎంపికగా కనిపి స్తున్నప్పటికీ, సొరంగం పరిమాణం చాలా ముఖ్యమైనది. పొడవాటి సొరంగాల వల్ల కలిగే నష్టాన్ని కొండలు తట్టుకోగలవా? చిన్న సొరంగాలను నిర్మించడంపై ప్రాజెక్ట్‌ బృందాలు ఆలోచించాలి. రహదారులు లేదా జల విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం పొడవైన నిర్మాణాలను నిర్మించే ముందు సొరంగ తవ్వకం కలిగించే పర్యావరణ ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయాలి. అనాలోచితంగా చేసే సొరంగ నిర్మాణం భూగర్భ జల వనరులను ప్రభావితం చేస్తుంది.

అదే సమయంలో కొండచరియలు విరిగిపడతాయి కూడా. విశాలమైన సొరంగాల తయారీ కోసం చేసే పేలుళ్లు ప్రమాదకరమైన పర్యావరణ పరిణామాలకు కారణమవుతాయి. విపత్తు సంసిద్ధతతోపాటు, నిర్మాణ సంస్థలు తీసుకునే భద్రతా జాగ్రత్తలు మరొక సమాధానం లేని ప్రశ్నగా ఉంటున్నాయి. సిల్‌క్యారా ప్రాజెక్ట్‌లో ప్రమేయం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థల వైపు నుండి లోపాలు ఉంటే వాటిని పూర్తి స్థాయి విచారణ మాత్రమే వెల్లడిస్తుంది. కొండల్లో భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, హైవేలు, పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దాదాపు రెండు దశాబ్దాలుగా చర్చలు సాగుతున్నాయి.

నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ హయాంలో పర్యావరణ సంఘాల సుదీర్ఘ ఆందోళన తర్వాత, రెండు భారీ ప్రాజెక్టులను నిలిపివేశారు. పైగా కొత్త, పెద్ద ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదు. అయితే గత దశాబ్దంలో, కొండలపై నిర్మాణ కార్యకలాపాలను పునరుద్ధరించారు. భద్రతా సమస్యలు, పర్యావరణ సమీక్షల కోసం పిలుపులను విస్మరించారు. తప్పనిసరి పర్యావరణ ప్రభావ అంచనా వంటి వివిధ చట్టాలు, నిబంధనలను సంబంధిత ఏజెన్సీలు, ప్రభుత్వాలు తీవ్రంగా పలుచన చేసిపడేశాయి లేదా దాటవేశాయి. ఈలోగా, వాతావరణ మార్పుల కారణంగా పర్యా వరణ ప్రమాదాలు పెరిగాయి. దీని ఫలితంగా తీవ్రమైన వాతావరణ ఘటనలు, విపత్తులు సంభవిస్తాయి. 

సంసిద్ధత ఉందా?
కొండల్లోని ప్రాజెక్టుల భద్రత, విపత్తులను ఎదుర్కొనే సంసి ద్ధతను పూర్తిగా పరిష్కరించడం అనేది మరొక ప్రధాన సమస్య. సొరంగ ప్రమాదాలకు గల కారణాలపై శ్రద్ధ చూపడం, నిర్మాణ స్థలాల వద్ద భద్రతను నిర్ధారించడం చాలా కీలకం. గతంలో ఉత్తరా ఖండ్‌లో జరిగిన సంఘటనలతో పాటు, ఇటీవల సిక్కింలో జరిగిన హిమనీనద సరస్సు ఉప్పెన వరద సంబంధిత విపత్తు ద్వారా కూడా ఇది బాగా నిరూపితమైంది. తక్కువ సాంకేతిక, భద్రతాపరమైన నిర్వహణ, అలాగే వర్ష మేఘాల విస్ఫోటనం, కొండ చరియలు విరిగి పడటం మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి.

అన్ని స్థాయిలలో శిక్షణ, భద్రతా నిర్వహణపై తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక సాంకేతిక, శాస్త్రీయ సమస్యలను ప్రణాళికా దశలోనే అధ్యయనం చేసి పరిష్కరించాలి. సిల్‌క్యారా–బడ్‌కోట్‌ సొరంగం కోసం నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీకి ప్లానింగ్, కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్న యూరప్‌కు చెందిన బెర్నార్డ్‌ గ్రుప్పే సంస్థ, ‘‘సొరంగాన్ని తవ్వడం ప్రారంభమైనప్పటి నుండి, టెండర్‌ డాక్యుమెంట్‌లలో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాలా సవాలుగా ఉన్నా యని నిరూపితమయ్యాయి. ఆ విధంగా అమలు దశ ప్రారంభంలో చేపట్టిన తదుపరి అన్వేషణే దాని చర్యల ఫలితాలను నిర్ధారిస్తుంది’’ అని వెల్లడించింది. అటువంటి ప్రాజెక్టులను ఆమోదించే ముందు సమగ్రమైన భౌగోళిక అధ్యయనాల అవసరాన్ని ఇది సూచిస్తుంది.

కేవలం ప్రమాదమా?
కార్మికుల రక్షణ కోసం సొరంగం లభ్యత వంటి భద్రతా నియ మాలను, నిబంధనలను నిర్మాణ సంస్థలు అనుసరించి ఉంటే, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చాలా ముందుగానే రక్షించి ఉండ వచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవించినందున, ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రం అనేక విపత్తులను ఎదుర్కొన్న వాస్తవాన్ని బట్టి త్వరితగతిన కార్మికుల పరిరక్షణ కార్యకలాపాలకు వ్యవస్థలు ఉండాలి. సంబంధిత అన్ని ఏజెన్సీలు పరిస్థితిని ఎలా నిర్వహించాలనే అంశంపై తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవాలి.

సిల్‌క్యారా సొరంగ విపత్తును కేవలం ప్రమాదంగా పరిగణించి హిమాలయాల్లో యధావిధిగా వ్యవహారాలను కొనసాగించడం తప్పు. కోలుకోలేని నష్టం నుండి హిమాలయ పర్యావరణాన్ని కాపాడ టానికి ఇది మరో మేల్కొలుపు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు అని పేర్కొంటున్న వాటి గురించి మనం అసౌకర్యమైన ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. 900 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు (కనీసం ఒక డజను సొరంగాల నిర్మాణంతో కూడి ఉంటాయి), పర్యాటకాన్ని నిస్సంకోచంగా ప్రోత్సహించడం (ఇది కొండలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని మించి ఉంటోంది), జల విద్యుత్‌ ప్రాజెక్టుల భారీ స్థాయి అభివృద్ధి... ఇలా అన్నింటిపై ఒక పునరాలోచన అవసరం.

కొండల్లోని ప్రజలకు విద్యుత్తు, ఉపాధి లేదా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆనందించే లేదా అందుబాటులో ఉండే ఇతర సౌకర్యాలు లేకుండా చేయాలని దీని అర్థం కాదు. పర్యా వరణా నికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇవన్నీ ఎలా సాధిస్తామన్నదే కీలక ప్రశ్న. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాల్‌కు తగ్గట్టుగా దీన్ని ఎలా సాధిస్తాం? సిల్‌క్యారాలో జరిగినటువంటి విషాద సంఘ టనల పట్ల మనకు ఒక సమగ్ర దృక్పథం లేకుండా ఎంతమాత్రమూ ముందడుగు వెయ్యలేం. 
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత,దినేష్‌ సి. శర్మ
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు