శాంతి స్థాపనలో భారత్‌ ముఖ్యపాత్ర?

10 Jun, 2023 00:43 IST|Sakshi

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. శాశ్వత కాల్పుల విరమణను, స్థిరమైన శాంతిని సాధించడానికి దీర్ఘకాలిక అంకితభావం, పట్టుదలతో పాటు అంతర్జాతీయ ఒత్తిడి అవసరం. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాంతి భద్రతలను నిర్వహించడంలో భారత్‌ ముఖ్యమైన పాత్రను పోషించింది. పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ భారత్‌ నాయకత్వం సన్నిహితంగా ఉండటంతో శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని మధ్యవర్తిత్వం వహించవచ్చని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. సమస్యను పరిష్కరించడంలో అగ్రదేశాలు విఫలమవుతున్న నేపథ్యంలో భారత్‌ గురుతర బాధ్యత పోషించాల్సి ఉంది.

మెజారిటీ దేశాల ఆర్థిక వ్యవస్థలను అధమ స్థాయికి చేర్చిన 15 నెలల రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం గురించి ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇంధనం, ఆహార మార్కెట్లకు భారీ షాక్‌ ఇచ్చింది. సరఫరాను తగ్గించి, నిత్యావసరాల ధరలను మునుపెన్నడూ లేని స్థాయికి పెంచింది. ఇతర ఆర్థిక ప్రాంతా లతో పోలిస్తే, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రేపే ఆర్థిక పరిణామా లకు యూరో ప్రాంతానికి ప్రత్యేకించి హాని కలుగుతుంది. అణ్వాయుధాలను ఆశ్రయించవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ పదేపదే హెచ్చరించినప్పటికీ, అణుయుద్ధం జరిగే అవకాశాలు పెద్దగా లేవు. తనను బెదిరించినట్లయితే రష్యా ‘ప్రాదేశిక సమగ్రతను’ రక్షించడానికి ‘అందుబాటులో ఉన్న అన్ని ఆయుధ వ్యవస్థలను’ ఉపయోగిస్తానని పుతిన్‌ 2022 సెప్టెంబరు 21న తేల్చిచెప్పారు.

భారత్‌ స్పందనేమిటి?
భారతదేశం సాంప్రదాయకంగా అంతర్జాతీయ సంఘర్షణలలో అలీన విధానాన్ని, తటస్థ విధానాన్ని అనుసరిస్తోంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ, సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చింది. పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహితంగా ఉండటంతో శాంతి నెల కొల్పేందుకు ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించవచ్చని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని భారత్‌ నిల కడగా సమర్థిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో ‘సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతి’ ఆవశ్యకతను నొక్కిచెప్పే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఓటింగుకు మాత్రం భారత్‌ దూరంగా ఉండి పోయింది.

2015లో, క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ చేసిన తీర్మానానికి... ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే విధానాన్ని పేర్కొంటూ భారతదేశం దూరంగా ఉంది. అయితే దౌత్య మార్గాల ద్వారా వివా దానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం పిలుపునిచ్చింది. అలాగే మిన్స్క్‌ ఒప్పందం అమలు జరగాలని సూచించింది. భారత్‌ వైఖరిని ఉక్రెయిన్‌తో సహా కొన్ని దేశాలు విమర్శించాయి, రష్యా చర్యలపై న్యూఢిల్లీ మరింత బలమైన వైఖరిని తీసుకోవాలని ఉక్రెయిన్‌ వాదించింది. అంతర్జాతీయ శాంతి పరిరక్షక ప్రయత్నాలలో, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి మిషన్లలో పాల్గొనడం ద్వారా భారత దేశం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఐరాస శాంతి పరిరక్షక కార్యకలాపాలకు దళాలను స్థిరంగా అందించిన సుదీర్ఘ చరిత్ర భార త్‌కు ఉంది. పైగా ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రభావిత
ప్రాంతాలలో శాంతి భద్రతలను నిర్వహించడంలో భారత్‌ ముఖ్య పాత్రను పోషించింది.

విశ్వసనీయ దేశం
దేశాల సఖ్యత విషయంలో భారతదేశం విశ్వసనీయతను పొందు తోంది. ఇండో–పసిఫిక్‌ ఫోరమ్‌ దేశాలు భారత టీకా దౌత్యం, అవస రమైన సమయంలో మానవతా సహాయం తర్వాత భారతదేశంతో సహకారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఆస్ట్రేలి యాతో ద్వైపాక్షిక సంబంధాలు కూడా గణనీయమైన పురోగతిని చూపుతున్నాయి. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బ నీస్‌ మధ్య సమావేశాలు పరస్పర విశ్వాసంతో గౌరవంతో జరిగాయి. సంబంధాలను మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేసిన తర్వాత, ఎలక్ట్రిక్‌ కార్‌ బ్యాటరీల కోసం భారత్‌కు లిథియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉండటంతో ఇరుపక్షాల సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. 

హిరోషిమాలో ఇటీవల జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ జెలెన్‌స్కీ రష్యాతో యుద్ధాన్ని ముగించే శాంతి ప్రణాళికను ప్రధాని మోదీకి అందించారు. దానికి భారతదేశం ఆమోదం కోరారు. ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా మోదీని ఆహ్వానించారు కూడా. అధికారిక సోర్సుల ప్రకారం, అనేక దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌ వైపు చూస్తున్నాయని భావించినందున, తన శాంతి ప్రతిపాదనకు మద్దతు కోరడం మినహా జెలెన్‌స్కీ భారతదేశంపై ఎటువంటి డిమాండ్‌ మోపలేదు. ఈ ప్రతి పాదనను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

శాంతి స్థాపన చర్యలు
ఉక్రెయిన్‌ యుద్ధంలో కాల్పుల విరమణను అమలు చేయడం అనేది బహుళ పార్టీలతో, భౌగోళిక రాజకీయ పరిగణనలతో కూడిన సంక్లిష్ట సమస్య. కాల్పుల విరమణ కోసం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు: ఉక్రెయిన్, రష్యా, తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద సమూహాలతో సహా వివాదాస్పద పక్షాల మధ్య చర్చలను సులభ తరం చేయడానికిగానూ దౌత్య ప్రయత్నాలను ప్రోత్సహించడం; సంభాషణను, శాంతి చర్చలను సులభతరం చేయడానికి ఐక్యరాజ్య సమితి లేదా ఐరోపాలో భద్రత, సహకార సంస్థ (ఓఎస్‌సీఈ) వంటి అంతర్జాతీయ మధ్యవర్తులు లేదా సంస్థలను నిమగ్నం చేయడం;

విరుద్ధమైన పార్టీలు శత్రుత్వాలను విరమించుకోవడానికి తగిన దౌత్య పరమైన ఒత్తిడి తీసుకురావాలని యూఎస్, యూరోపియన్‌ యూని యన్, పొరుగుదేశాల వంటి అంతర్జాతీయ పాత్రధారులను కోరడం; కాల్పుల విరమణకు అనుగుణంగా ఆర్థిక ఆంక్షలు విధించడం; దౌత్య పరంగా ఒంటరయ్యేట్టు చూడటం; ఇంకా ఇతర రాజకీయ చర్యలను ఉపయోగించవచ్చు. ప్రమేయం ఉన్న పక్షాల మధ్య సంభాషణ, నమ్మ కాన్ని పెంపొందించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేలా పరస్పర విశ్వాసాన్ని పాదుగొలిపే చర్యలు తప్పనిసరి. ఇందులో ఖైదీల మార్పిడి, భారీ ఆయుధాల ఉపసంహరణ, నిర్దిష్ట స్థానికప్రాంతాల్లో కాల్పుల విరమణల అమలు వంటివి ఉంటాయి.

అంతేకాకుండా, సంఘర్షణలో చిక్కుకున్న పౌరులకు వైద్య సామగ్రి, ఆహారం, ఆశ్రయంతో సహా ప్రభావిత ప్రాంతాల్లో మాన వతా సహాయానికి, తోడ్పాటుకు అనియంత్రిత ప్రాప్యతను ఏర్పరచా ల్సిన అవసరం ఉంది.  జనాల బాధలను తగ్గించడానికి, సద్భావనను పెంపొందించడానికి రెండు వైపులా మానవతా సాయాన్ని అందించాలి. దీనితో పాటు కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించడానికి, ధృవీకరించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో అంతర్జాతీయ పరిశీలకులు, శాంతి పరిరక్షక దళాలకు ప్రమేయం ఉండాలి. ఈ సంస్థలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను నివేదించడంలో సహాయపడతాయి.

అలాగే అంగీకరించిన నిబంధ నలకు అనుగుణంగా ఉండేలా చూడటం ద్వారా పార్టీల మధ్య విశ్వా సాన్ని పెంపొందించవచ్చు. రాజకీయ, ఆర్థిక, జాతిపరమైన మనోవేద నలతో సహా సంఘర్షణ మూల కారణాలను పరిష్కరించడానికి రాజ కీయ సంభాషణలను, సయోధ్యను ప్రోత్సహించాలి. సంఘర్షణ– ప్రభావిత ప్రాంతాల ప్రతినిధులతో సహా మొత్తం వాటాదారులను నిమగ్నం చేయడం అనేది, అంతర్లీన సమస్యలను పరిష్కరించడంలో, స్థిరమైన శాంతి ఒప్పందం కోసం పని చేయడంలో సహాయపడుతుంది. ఈ పరిమాణంలో ఉన్న సంఘర్షణను పరిష్కరించడానికి అన్ని పార్టీల నిబద్ధత, సహకారం అవసరం. శాశ్వత కాల్పుల విరమణను, సుస్థిరమైన శాంతిని సాధించడానికి దీర్ఘకాలిక అంకితభావం, పట్టుదల, అంతర్జాతీయ ఒత్తిడి అవసరం.

వ్యాసకర్త అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
 

మరిన్ని వార్తలు