విశాఖను వరించిన పెట్టుబడులు

7 Mar, 2023 00:50 IST|Sakshi

రెండో మాట 

కేవలం 1 శాతం సంపన్నవంతులను మాత్రమే పట్టించుకుంటూ, ప్రపంచంలోని మిగతా 99 శాతం భవిష్యత్తును గాలికి వదిలేయకూడదు. కొద్దిమంది చేతుల్లో ద్రవ్య అధికార కేంద్రీకరణ జరిగి అది మిగతా ప్రపంచ భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వం. వీటిని పూర్తిగా గుర్తెరిగి, ప్రపంచ పెట్టు బడులను పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మలుస్తూ సాగింది విశాఖపట్నంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌.

విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్ర స్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ముందుకు సాగిన ఫలితమే – ఈ సదస్సు.

‘‘20వ శతాబ్దపు పెట్టుబడిదారీ వ్యవస్థ 21వ శతాబ్దపు సమాజాన్ని తీర్చిదిద్దడంలో విఫలమైందా? గత 30 సంవత్సరాల వ్యవ ధిలో సంపన్న వర్గాలకూ, పేద వర్గాలకూ మధ్య ఆదాయ వనరులలో వ్యత్యాసం దారుణంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు నూతన వ్యవస్థ అవసరమని చెప్పినంత మాత్రాన పరిస్థితులు మారవు.

ఉన్న వ్యవస్థ ఎందుకు ప్రజాబాహుళ్యం అవసరాలను తీర్చలేకపోతోంది? కొలది మందిలో పేరుకుపోయిన అవధులు లేని కోరికలు; పేద, కార్మిక వర్గాల హక్కులపై సాగుతున్న దాడులు– ఈ పరిస్థితులు వెరసి ఉత్పత్తి అవుతున్న సంపద పంపిణీలో వాటాను పేద సాదలు అనుభవించనివ్వకుండా చేస్తున్నాయి.

ఇలా పేద సాదల న్యాయమైన డిమాండ్‌ కుంచించుకు పోతూ, వ్యాపార సరళి దెబ్బతింటూపోతే వ్యాపార వర్గాల వ్యాపారమూ బతికి బట్ట కట్టలేదని గుర్తించాలి. కను కనే, అమెరికా అధ్యక్ష కార్యాలయ సలహాదారుగా పనిచేసిన లారీ సమ్మర్స్‌ 40 శాతం అమెరికన్లలో పెట్టుబడిదారీ విధానమంటే సాను కూల అభిప్రాయం లేదని బాహాటంగా చాటాడు’’.
– షరాన్‌ బ్రూనో, అంతర్జాతీయ ట్రేడ్‌ యూనియన్‌ సమాఖ్య ప్రధాన కార్యదర్శి
‘‘నానాటికీ పెరిగిపోతున్న సామాజిక అసమానతలు ప్రపంచ ప్రజల భావి భాగ్యోదయానికీ, భద్రతకూ కాచుకు కూర్చున్న పెద్ద ప్రమాదం’’.
– ప్రపంచ ఆర్థిక, సహకారాభివృద్ధి సమాఖ్య

ప్రపంచ పెట్టుబడులకు దావోస్‌ కేంద్ర స్థానంగా ఉండి, వర్ధమాన బతుకుల్ని శాసిస్తూ వచ్చిన దశ నుంచి కొత్త మార్పు మొదలైంది.  కేవలం 1 శాతం సంపన్నవంతుల గొంతును వినిపిస్తూ ప్రపంచంలోని మిగతా 99 శాతం ప్రజాబాహుళ్యం భవిష్యత్తును దావోస్‌ గాలికి వదిలేస్తూ వచ్చింది. కనుకనే స్విట్జర్లాండ్‌ యువజన సమాఖ్య అధిపతి డేవిడ్‌ రాత్, కొద్దిమంది చేతుల్లో ఈ ఆర్థిక, ద్రవ్య అధికార కేంద్రీకరణ మిగతా ప్రపంచ ప్రజాబాహుళ్యం భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వంగా అభివర్ణించాడు. అలాంటి దావోస్‌ సభలలో చర్చలను, ఫలితాలను అవగతం చేసుకొని వచ్చిన అనుభవం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సమగ్రా భివృద్ధి కోసం పథక రచన చేశారు. 

భారతదేశంలో విశిష్ట సహజ సాగర వనరులకు కేంద్రంగా, సహజ సంపదలకు ఆలవాలంగా ఉండి, దేశీయ పారిశ్రామిక స్థావరా లలో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు కోస్తాలో ప్రభవిల్లుతూ వచ్చిన నగరం– విశాఖపట్నం. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రస్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో జగన్‌ ముందుకు సాగిన ఫలితమే – గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023. భారీ పారిశ్రామిక, ఉపాధి అవకాశాల కేంద్రంగా ఈ విశాఖ సదస్సును జయప్రదం చేయగలగడం అతని వయస్సుకు మించిన గౌరవాన్ని తెచ్చి పెట్టింది.

ఎందుకంటే, బహు కొలది మందిగా ఉన్న సంపన్నుల చేతుల్లో ఆర్థిక, ద్రవ్య వనరుల కేంద్రీకరణ వల్ల ఆ వర్గాలే మిగతా అసంఖ్యాక ప్రజా బాహుళ్యంపై నియంతృత్వం చలాయించే ప్రమాదం ఇప్పటికే బలంగా పొంచి ఉంది. అందుకే జగన్‌ తన ‘నవరత్నాల’ పథకం ద్వారా ఆదిలోనే ప్రజా ప్రయోజనాల రక్షణకు ‘ఏడుగడ’గా నిలిచారు. అందుకే విశాఖ పెట్టుబడుల సదస్సు వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయో జనాలకు రాగల నష్టం ఏమీ ఉండదు. పైగా ప్రపంచ వ్యాపిత పెట్టు బడులు రాష్ట్రానికి రాగల అవకాశాలు మరింతగా పెరిగాయి.

రాష్ట్రానికి కేంద్రమూ, బీజేపీ పాలకులూ రాష్ట్ర విభజన సమయంలో హామీ పడిన ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న ‘రాజకీయ తాత్సారం’ వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అపారమైన నష్టం వాటి ల్లింది. దీనికితోడు క్రియాశీల పాత్ర నిర్వహించవలసిన అతుకుల బొంత ‘తెలుగుదేశం’, ‘గాలివాటు’ రాజకీయాలకు పేరుమోసిన ‘సినీ వంగడం’ పవన్‌ కల్యాణ్‌ ‘వారాహి’ అబద్ధాలకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని దుఃస్థితిలో ఉన్నారు.

ఈ రాజకీయ ‘విచిత్ర వేషధారణ’ తంతు పసికట్టిన ప్రధాని మోదీ తన బీజేపీ (ఆరెస్సెస్‌)కి ఏపీలో రాజకీయ అవకాశాల్ని పెంచుకోవడం కోసం ‘దేశం’తో పవ న్‌కు ఉన్న చెట్టాపట్టాల్ని తెగ్గొట్టగలిగారేగానీ, వారి మధ్య అక్కరకు రాని రహస్య సమావేశాల్ని ఆపలేకపోయారు. అయితే ఏపీ సీఎం జగన్‌ ప్రగతి మార్గాన్నీ, ‘నవరత్నాల’ బలమైన ప్రభావాన్నీ వీళ్లెవరూ అడ్డుకోలేక పోయారు. పైగా ఆయనకు అవాంతరాలు కల్పిస్తూ రోజు రోజుకీ ప్రజల ముందు అభాసుపాలవుతున్నారు. ఈ దశలో రాష్ట్రానికి దూసుకువచ్చిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ శిఖరాగ్ర సమావేశం జగన్‌ చొరవ ఫలితంగా జయప్రదం కాగల్గింది. 

అందుకే జగన్‌ ‘‘మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథ కాలు కావు. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిపైన పెట్టు బడిగా భావిస్తున్నాం. మా విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం విద్యాప్రమాణాలు పెంపొందిస్తున్నాం.

అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేస్తున్నాం’’ అనగలిగారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 62 శాతం పదవులు ఇచ్చి దేశ చరిత్రలో నూతన ఒరవడిని సుస్థిరపరిచి దేశ చరిత్రలోనే మొదటి స్థానంలో జగన్‌ నిలబడటానికి ‘దమ్ము’ అందించినవీ, అధికారానికి రావడానికి ముందే సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా గడించిన ప్రజాస్పర్శతో ప్రకటించినవీ అనుల్లంఘనీయమైన ‘నవరత్నాల’ని మరచిపోరాదు. తద్వారా దేశంలోని రాజకీయ పార్టీలకూ, ముఖ్యమంత్రులకూ తండ్రి రాజశేఖరరెడ్డి తర్వాత అంత ఆదర్శంగా నిలిచినవాడు జగన్‌!

ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు