-

మనుషులు కాదోయ్‌ మాటలోయ్‌!

1 May, 2023 03:26 IST|Sakshi

కామెంట్‌

దేశమంటే ఏమిటి? సరిహద్దులతో ఉండేదా? మనసులలో అడ్డుగోడలు లేని మనుషులతో నిండి ఉండేదా? లేక... జాతులు, మతాలు, భాషలు,సంప్రదాయాలు వేర్వేరుగా వేటికవిగా ఉండేదా? కలివిడిగా, కలబోతగా కట్టుబడి ఉండేదా? లేక ఒకే గతం, ఒకే వర్తమానం కలిగి ఉండి ఒకే విధమైన భవిష్యత్తును నిర్మించుకుంటూ ఉండేదా? దేశానికి ఎన్నో నిర్వచనాలు! భౌగోళికమైనవి, చారిత్రకమైనవి, సాంస్కృతికమైనవి.

ఇవేవీ కాని ఒక వినూత్నమైన నిర్వచనాన్ని ‘బిట్వీన్‌ హోప్‌ అండ్‌ డెస్పైర్‌’ పుస్తక రచయిత రాజీవ్‌ భార్గవ ఇచ్చారు. ‘‘దేశమంటే, సంభాషణలో ఉన్న మనుషులు’’ అన్నారు భార్గవ ఈ పుస్తకంలో. మరి ఈ నిర్వచనం భారతదేశానికి కూడా వర్తిస్తుందా? తప్పకుండా వర్తిస్తుంది. అది మన దేశాన్ని గురించిన కచ్చితమైన అవగాహన!

ఇప్పటికే చదివి ఉండనందుకు చింతిస్తూ నేనొక పుస్తకం చదువుతూ ఉన్నాను. ‘బిట్వీన్‌ హోప్‌ అండ్‌ డెస్పైర్‌’ అనే పుస్తకం సమకాలీన భారతదేశంపై రాజీవ్‌ భార్గవ ప్రతిఫలింపజేసిన నైతికతల సమాహారం. వాటిలో కొన్ని నిస్సందేహంగా నిస్తేజమైనవి. అరకొరగా కొన్ని బహుశా అర్థంలేనివి. చాలావరకు మాత్రం లోతైనవీ, ఆలోచన రేకెత్తించేవీ. ముఖ్యంగా ఒకటైతే తన నవ్యత వల్ల నా ధ్యాసను తనపైకి మర ల్చుకున్నది. ఇంకా చెప్పాలంటే, అది మన దేశం గురించి కచ్చితమైన అవగాహన.   

పుస్తకంలో ‘ఎ నేషన్‌ ఈజ్‌ ఎ పీపుల్‌ ఇన్‌ కాన్వర్సేషన్‌’ అనే శీర్షికతో ఉన్న ఒక వ్యాసంలో... ‘‘దేశం అంటే ఏమిటి?’’ అనే ప్రశ్నకు సమాధానంగా, ‘దేశమంటే సంభాషణలో ఉన్న ప్రజలు’ అంటారు భార్గవ. మీరసలు ఊహించనే లేని భిన్నమైన జవాబు అది. దేశమంటే ఏమిటి అన్న ప్రశ్నకు స్కూల్లో మనకు నేర్పించిన జవాబు కచ్చితంగా ఇది మాత్రమైతే కాదు.  

దేశాలను మనం జాతులు, భాషలు, మతాల వారీగా, ఇంకా... చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఏర్పడిన మనుషుల సమూహంగా అవగాహన పరచుకున్నాం. కొన్నిసార్లు ఈ భిన్నత్వాల జోడీకి కూడా దేశం అనే ఏక రూపత స్థిరపడుతుంది. ఇందుకు స్ఫురించే ఉదాహరణలు... ఇజ్రాయిల్, కుర్దిస్తాన్, పాలస్తీనా, లిక్టన్‌స్టయిన్‌; జులు, బెర్బెర్‌ జాతులు, ఎస్కిమోలు, రెడ్‌ ఇండియన్‌లు, మావోరీలు. దేశాలన్నీ కూడా వీటిల్లో ఒకటీ లేదా అంతకంటే ఎక్కువగా వైవిధ్యాల కలబోత స్వభావాన్ని కలిగి ఉంటాయి. 

భార్గవ ఒక దేశాన్ని చాలా భిన్నమైన కోణంలో చూస్తారు. ‘‘అన్నిటì కంటే వారి గతం, వర్తమానం, భవిష్యత్తులను గురించిన సాధారణ, లేదా అతివ్యాప్త ఆందోళనల వల్ల స్వీయ స్పృహతో జట్టు కట్టిన ప్రజాసమూహమే దేశం. ఆ ఏకతలోని చేతన జన్యుపరమైనది కాదు. ఆకాశం నుండి ఊడి పడినదీ కాదు. నోటితో, రాతలతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరు చెప్పింది ఒకరు వినడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల వృద్ధి చెందినది’’ అంటారు. అందుకే భార్గవ, దేశమంటే సంభాషణలో ఉన్న ప్రజలు అన్నారు.  

అయితే భారతదేశాన్ని అర్థం చేసుకోడానికి అది కచ్చితమైన ఉత్తమ నిర్వచనం అవుతుందా? లొడలొడమని కబుర్లు చెప్పడం, మాట్లాడటం, మాట్లాడేవాళ్లకు అంతరాయం కలిగించడం, కేకలు వేయడం, పెద్దగా అరవడం, విని వదిలేయడం, వినాలని పట్టుపట్టడం... ఇవేగా మనం ఎప్పుడూ చేసేది. ఇవన్నీ చేస్తున్నందుకు ఇంకెవరైనా అయితే మనల్ని ‘టవర్‌ ఆఫ్‌ బాబెల్‌’ అనేవారు. కానీ భార్గవ మన ఎడతెగని ఈ సంభాషణను మన జాతీయతలోని ప్రధానాంశంగా గుర్తించారు.

ఈ వినూత్న నిర్వచనాన్ని దాటి చూస్తే, ఆ వెనుక... నేడు మన దేశంలో ఏం జరుగుతోంది అనే విషయమై కలవరం కలిగించే ముఖ్యాంశాలు ఉండటం కనిపిస్తుంది. ‘‘వార్తాపత్రికలు, ఆ తర్వాత టీవీ ఛానళ్లు ప్రేరేపించనిదే ప్రజల మధ్య సంభాషణలు ఉండటం లేదు. సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు వృద్ధి చెందడం అన్నది కనిపించడం లేదు. కనుక దేశం అన్నదే లేదు’’ అంటారు భార్గవ.

అంటే, మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం లేదు. మీడియా ద్వారా మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కనుక మన మీడియా ఆరోగ్యం – పారదర్శకత, నిష్పాక్షికత, వాక్‌స్వేచ్ఛా నిబద్ధత –  మన జాతీయతకు ఎంతో కీలకమైనది. భార్గవ అడగని ఒక ప్రశ్న, ఆవేశాన్ని రేకెత్తించే ప్రశ్న... మనం వార్తాపత్రికను చేతిలోకి తీసుకున్న ప్రతి సారీ, లేదంటే వార్తా చానెల్‌ను పెట్టగానే తలెత్తు తుంది... భారతీయ మీడియా భారతదేశాన్ని అణగదొక్కుతోందా అని! 

ఈ పుస్తకం మరొక ప్రశ్నను కూడా లేవనెత్తింది, బహుశా అది మరింతగా కలవరపెట్టే ప్రశ్న. మళ్లీ కూడా భార్గవ నేరుగా ప్రశ్నించడం లేదు. ప్రశ్న వైపుగా మనల్ని మళ్లిస్తున్నారు. ‘‘ఒక దేశం అన్నది సంభాషించుకునే ప్రజా సమూహం అయినప్పుడు ఆ సంభాషణను ఎవరైనా అడ్డుకుంటే దేశాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది’’ అంటారు. ఈ వేలు ఎటువైపు చూపిస్తోందో నాకు తెలుసు. మీకూ తెలుసు. ఆ వేలు ఎవరి వైపు అయితే తిరిగి ఉందో వారికీ తెలుసు. ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన పని లేదని దీని అర్థం.

భార్గవ మరింత ముందుకు వెళ్లారు. సంభా షణను ఆపేయడం మాత్రమే మన దేశానికి ప్రమాదకరం కాదు. ‘‘ఎట్టి పరిస్థితిలోనూ ప్రజల సంభాషణను ప్రభుత్వం లాగేసుకోకూడదు. ప్రజా సంభాషణను నిర్దేశించకూడదు. నియంత్రించ కూడదు. సంభాషణలో ప్రభుత్వం కూడా ఒక భాగమే తప్ప తనే శాశ్వతంగా సంభాషణను నడపాలని చూడకూడదు.

వాస్తవానికి సంభాషణకు అంతరాయం కలిగించే వారిని, నిరోధించే వారిని నియంత్రించడం ప్రభుత్వ విధి. దానినే దేశం ఆశిస్తోంది’’ అంటారు భార్గవ. ఈ చివరి వాక్యం నాకు నచ్చింది. మన టెలివిజన్‌ యాంకర్లు చెప్పేది గుర్తొచ్చింది, వాళ్లు వేరే అర్థంలో చెప్పి నప్పటికీ. భార్గవ వాళ్ల మాటల్ని వాళ్ల నెత్తిపైనే కుమ్మరించారు.   

దేశం అంటే ఏమిటో భార్గవ ఇచ్చిన నిర్వచనంలోని అందం... వేర్వేరు జాతులు, మతాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఆహార సంప్రదాయాలు, భౌగోళికతలు, చారిత్రక నేపథ్యాలు కలిగివున్న వాళ్లంతా కలిసి ఉండటంలో ఉన్న ప్పటికీ... ఈ వ్యత్యాసాలు కేవలం వివరణా త్మకమైనవి. అసలైనది ఏమంటే... కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, రాన్‌ ఆఫ్‌ కచ్‌ నుంచి అగర్తల వరకు మనం ఒకరితో ఒకరం సంభాషించుకుంటున్నాం.

తగాదాలు ఉంటే ఉండొచ్చు. అంత రాయం కలిగించుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఒక సుదీర్ఘ ప్రసంగానికి, పాండిత్యానికి, అజ్ఞానానికి, వట్టి సమాచారానికి, నీరసం కలిగించే మాటలకు చెవి ఒగ్గుతూ ఉండొచ్చు. ఇవేవీ కాదు, మనమైతే మాటల్లో ఉన్నాం. అదీ ముఖ్యం. ఈ సంభాషణ ఆగిపోతే ఏం జరుగుతుందన్నది ఆలోచించాల్సిన విషయం. భార్గవ చెప్పడం, దేశం ‘విడివడడానికి’ దారి ఏర్పడుతుందని! మన దేశం గురించే ఆయన చెబుతున్నారు.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

మరిన్ని వార్తలు