బిల్లు ఆమోదంతోనే సరిపోతుందా?

5 Oct, 2023 01:20 IST|Sakshi

విశ్లేషణ

అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళల శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా ఉపయోగించుకొనేందుకు బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్నారు. లింగ వైవిధ్యం కలిగిన రంగాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది చట్ట సభలకు సైతం వర్తిస్తుంది. ఎక్కువ మంది మహిళలు భాగస్వాములైతే – నేర, అవినీతిమయ స్వభావాల నుంచి ప్రేమ, వాత్సల్య స్వభావాలకు రాజకీయాలను మార్చడా నికి దోహదపడుతుందని సామాజికవేత్తల అంచనా. మహిళా బిల్లు ఆమోదం పొందడం ఓ చరిత్రాత్మక ఘట్టమే. కానీ, ఈ చట్టం విజయవంతం కావాలంటే పార్టీల స్వరూప స్వభావాలు మారాలి. అన్ని పార్టీలూ మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించి, వారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి.

చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్‌ ఆమోదం పొందడం దేశ చరిత్రలో మైలురాయి. పార్టీలకు అతీతంగా విస్తృత స్థాయిలో ఈ బిల్లుకు ఆమోదం లభించినందున రెండో దశలో కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లుకు అడ్డు చెప్పేందుకు ఆస్కారం లేదు. ఆ ప్రక్రియ కూడా పూర్తయితే 2026 నుంచి రిజ ర్వేషన్లు అమలులోకి వస్తాయి. ఆ లోగా కులగణన, నియోజక వర్గాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియలు ముగియాలి. ఎంతో వ్యవధి పట్టే ఈ కార్యక్రమాలు 2026 లోపు పూర్తవుతాయా? అందుకే కాబోలు,కాంగ్రెస్‌ నేత ఒకరు ఈ బిల్లును ‘పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌’తో పోల్చారు.

ప్రాంతీయ పార్టీలపై నెపాన్ని నెట్టి 2004–14 మధ్య పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ మహిళా బిల్లును అటకెక్కించింది. ఆ విధంగా చూసిన పుడు చెల్లని చెక్కు కంటే పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌ మేలు కదా? తాము అధికా రంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లును చట్టం చేసే అవకాశాన్ని జారవిడుచుకొన్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ బిల్లులో ఓబీసీ మహిళలకు ఉపకోటా ఉండాలన్న డిమాండ్‌ దాదాపుగా అన్ని రాజ కీయ పార్టీలు చేస్తున్నందున భవిష్యత్తులో అందుకు అవసరమైన సవరణలు జరుగుతాయనే ఆశించాలి.

భారతదేశంలో అనాది నుంచి మహిళల పట్ల భిన్నమైన దృక్ప థాలు చూపడం కనిపిస్తుంది. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు మహిళను మాతృమూర్తిగా చూపిస్తూ ఉన్నత స్థానాన్ని కల్పించాయి. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ సిరులు పండుతా యని భారతీయులు పవిత్రంగా భావించే వేదాలు ఘోషించాయి. అదే సమయంలో ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ అంటూ మహిళల స్వేచ్ఛను అణచివేసే అనేక దురాగతాలు భారత ఉపఖండంలో జరిగాయి.

స్వాతంత్య్రానంతరం వివిధ చట్టాల ద్వారా బాల్య వివాహాలు, సతీసహగమనం, వితంతు వివాహాల నిషేధం వంటి దురాచారాలను సరిదిద్దడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ చట్టాల కంటే సంప్రదాయాలకే మొగ్గుచూపే భారతీయ సమాజంలో చట్టాల వల్ల ఒనగూరిన ప్రయోజనం తక్కువే! చట్టాల అమలు కంటే ప్రజా చైతన్యం ద్వారా మొదలయిన సంస్కరణోద్యమాలు చక్కని ఫలితాలు అందించాయి. సావిత్రీబాయి ఫూలే మహిళా విద్య కోసం చేసిన కృషి, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు వంటి రచయితలు, సంఘసంస్కర్తలు తెలుగునాట వితంతు వివాహాలు జరగడానికి చేసిన కృషి చెప్పుకోదగ్గది. జాతీయోద్యమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడానికి గాంధీజీ కృషిచేశారు.

ఆయన తన సతీమణి కస్తూర్బాను వివిధ ఉద్యమాలలో పాల్గొనేలా ప్రోత్సహించారు. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా చేసిన సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలలో మహిళలు గణనీయ సంఖ్యలో పాలుపంచుకొన్నారు. గొప్ప కవయిత్రిగా పేరు తెచ్చుకొన్న సరోజినీ నాయుడు గాంధీజీ చొరవతోనే అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షురాలై, రాజకీయాలలో మహిళలు ప్రవేశించడానికి ప్రేరణగా నిలిచారు.

ప్రపంచంలోనే అతిగొప్ప ఉద్యమాలలో ఒకటిగా చెప్పుకొనే తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంత గ్రామీణ పేద మహిళలు ప్రముఖ పాత్ర పోషించారు. వీరమహిళ చాకలి ఐలమ్మ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇందిరా గాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, విజయరాజె సింథియా వంటి వారు రాజకీయాలలో మహిళలు చురుకైన భాగ స్వామ్యం వహించడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 

ఇక 1983లో నందమూరి తారక రామారావు మహిళలకు తండ్రి ఆస్తిలో సగభాగం దక్కేలా చట్టం చేయడం, స్థానిక సంస్థలలో తొలి సారిగా 9 శాతం రిజర్వేషన్లు అందించడం చారిత్రాత్మక ఘట్టాలుగానే పరిగణించాలి. ఆ తర్వాత డా. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, అభయహస్తం వంటి పథకాలు మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్ని రకాల నామినేటెడ్‌ పదవులలో పార్టీ పరంగా 40 శాతంకు పైగా అందిస్తూ, చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రిజర్వేషన్లే ఉండాలన్న నిబంధన అవసరం లేదని రుజువు చేశారు.

‘జిందా తిలిస్మాథ్‌’ కాదు!
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఒక్క ఎంఐఎం తప్ప పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం విశేషం. దీనిని బట్టి ఆయా పార్టీలలో ఉన్న పురుషాధిక్యత తొలగిపోయిందనుకుంటే పొరపాటే! ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం ద్వారా మహిళల సమస్యలన్నింటినీ పరిష్కరించేసినట్లు ప్రచారం చేసుకొంటోంది.

కాంగ్రెస్‌ పార్టీ, ఇంకా కొన్ని పార్టీలు తాము ఎక్కడ వెనకబడిపోతామో అనే భయంతో అసలు మహిళా బిల్లును ముందుకు తెచ్చింది ‘మేమంటే మేము’ అని తమను తామే అభినందించుకోవడం విడ్డూరం.  చట్టసభలలో మహిళల సంఖ్య పెరిగినంత మాత్రాన వారికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కాజాలవు. అదే నిజమైతే స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు పొందుతున్న మహిళలు తమ ప్రాంతాలలో ఏవైనా అద్భుతాలు సాధించారా? వారికి ఆ అవకాశం లభించకపోవడానికి కావడమేమిటి? జిల్లా పరిషత్‌ల పరిధిలో బాలికల విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించి ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు అమలు జరుగుతున్నాయా? ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు తగినన్ని మరుగుదొడ్లు లేనందున ‘డ్రాపవుట్లు’ ఎక్కువగా ఉంటున్నాయి.

స్థానిక ప్రభుత్వాలలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగినప్పటికీ ఎందువల్ల మహిళలకు సముచిత న్యాయం జరగడం లేదు? కొన్ని ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను మహిళల పేరిట అందజేస్తున్న మాట నిజమేగానీ, మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, గృహæహింస, మహిళల అదృశ్యం (ఉమెన్‌ ట్రాఫికింగ్‌) మొదలైన కేసుల్లో ఎంతో వెనుకబడి ఉన్నాం.

మహిళా బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడం ఓ చారిత్రాత్మక ఘట్టమే. కానీ, ఈ చట్టం విజయవంతం కావాలంటే రాజకీయ పార్టీల స్వరూప స్వభావాలు మారాలి. సమ సమాజమే ధ్యేయం అని చెప్పుకొంటూ మహిళల సమస్యలపై ఉద్యమించడానికి ప్రత్యేక అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకొన్న కమ్యూనిస్టు పార్టీల పొలిట్‌ బ్యూరోలలో, సెంట్రల్‌ కమిటీలలో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రం. మహిళా బిల్లు ఘనత తమదేనని చాటుకొంటున్న బీజేపీ కార్యవర్గంలోకి 33 శాతం మంది మహిళల్ని ఎప్పుడు నియమిస్తారు? రాజకీయ పార్టీలలో ముందుగా భాగస్వామ్యం లేకుండా వారిని చట్టసభలకు పంపడం ఏ విధంగా సాధ్యపడుతుంది? మహిళా బిల్లు అమలు కావడానికి ఇంకా సమయం ఉంది కనుక, ఈలోపే అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు సముచిత భాగ స్వామ్యం కల్పించి వారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి.

కీలకమైన పదవులలో వారికి స్థానం కల్పించాలి. ప్రతి నిర్ణయంలో వారికి భాగ స్వామ్యం ఉండాలి. ఇదంతా ఓ సుదీర్ఘ ప్రక్రియ. ఇందుకు భారతీయ జనతా పార్టీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు తగిన కార్యాచరణ చేపడితేనే, మహిళా సాధికారత పట్ల వారికున్న చిత్తశుద్ధి తేటతెల్లం అవుతుంది. ఈ రాజకీయ ప్రక్రియ లేకుండా మహిళా బిల్లును కేవలం ఓ ‘స్కీమ్‌’లా అమలు చేయాలని చూస్తే ఫలితాలు అందవు. లేకుంటే, ఆపరేషన్‌ విజయవంతమేగానీ రోగి బతకలేదన్నట్టు ఇదొక ప్రహస నంలా మిగిలిపోతుంది.

సి. రామచంద్రయ్య 
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు

మరిన్ని వార్తలు