వి.హనుమంతరావు (కాంగ్రెస్‌).. రాయని డైరీ

27 Dec, 2020 00:00 IST|Sakshi

రేవంత్‌రెడ్డిని ప్రెసిడెంట్‌ని చేస్తారని మళ్లీ ఓ బ్రేకింగ్‌. రెండు రోజులుగా టీవీల్లో ఆ బ్రేకింగ్‌ వినిపిస్తూనే ఉంది. బ్రేకే రావడం లేదు. మీరుండగా, కోమటిరెడ్డి ఉండగా, భట్టి విక్రమార్క ఉండగా, శ్రీధర్‌బాబు ఉండగా, జీవన్‌రెడ్డి ఉండగా, పొన్నం ప్రభాకర్‌ ఉండగా, మధు యాష్కీ ఉండగా.. టీడీపీని ముంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌ని చెయ్యడం ఏమిటని టీవీ చానెళ్ల వాళ్లు మైకులు, వ్యాన్లు వేసుకొచ్చి బాధగా మా ఇంటి బయట అరుగు మీద కూర్చున్నారు. నేనూ బయటికే కనిపించేలా ఇంటి లోపల కూర్చొని ఉన్నాను. కొద్దిసేపు అలా కూర్చున్నాక.. దారిన పోయేవాళ్లు నన్ను, మీడియాను కలిపి చూసుకుంటూ వెళ్తున్నట్లు అనిపించి పడక్కుర్చీలోంచి కుర్చీలోకి మారాను.

‘‘హనుమంతరావు గారూ.. మీకేం వయసైపోయిందని.. మీరుండగా, కోమటి రెడ్డి ఉండగా, భట్టి విక్రమార్క ఉండగా..’’ అని మళ్లీ మొదలు పెట్టారు! ‘‘ఇదిగో బాబూ.. నేనేమీ అనుకోను గానీ, ‘మీరుండగా..’ అని అనడానికి మీరేమీ కష్టపడకండి. నేను కాకుండా మిగతావాళ్లలో ఎవరు ప్రెసిడెంట్‌ అయినా నేనేమీ అనుకోను. రేవంత్‌రెడ్డిని మాత్రం కానివ్వను’’ అన్నాను. 

‘‘ఒకవేళ అయితే?’’ అని గుంపులోంచి ఎవరో అన్నారు. అతడి వైపు చూశాను. ‘కానివ్వను’ అని నేను అంటుంటే, ‘ఒకవేళ అయితే’ అని అంటున్నాడు!
‘‘నువ్వుగానీ సోనియాజీతో మాట్లాడి రేవంత్‌రెడ్డిని ప్రెసిడెంట్‌ని చేయబోతున్నావా?’’ అని అడిగాను. అతడు మళ్లీ మాట్లాడలేదు.

సమర్థుడు కాని వారెవరినీ కాంగ్రెస్‌ చేరనివ్వదు. సమర్థులైనవారిని చేరదీసేందుకు తొందరపడదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  తొందరపడి వెళ్లిపోయాడు కానీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం అని ఉత్తమ్‌ని గానీ, నన్ను గానీ, తక్కిన సీనియర్‌లను గానీ కాంగ్రెస్‌ అడిగిందా?! రాహుల్‌ అడిగాడా, సోనియా అడిగారా, గులామ్‌ నబీ ఆజాద్‌ అడిగారా? నిజానికి వీళ్లంతా అడగవలసిన బాధ్యత ఉన్నవాళ్లు. మోదీని అడుగుతారు. మోదీని అడగమని రాష్ట్రపతిని అడుగుతారు. సొంత పార్టీలోని వాళ్లను మాత్రం ఒక్క మాటా అడగరు. కాంగ్రెస్‌లో ఉండే పద్ధతీ పెద్దరికమే ఇది. నిలబడి నీళ్లు తాగడం మేలనుకుంటుంది. అప్పటికీ తాగదు. పరుగెత్తడం లేదు కదా, తాగడం ఎందుకు అనుకుంటుంది! 

నాకైతే నమ్మకం. టీపీసీసీ పోస్టును ఇప్పట్లో కాంగ్రెస్‌ ఎవరికీ ఇవ్వదు. ప్రధాని కొన్ని కేబినెట్‌ పోస్టుల్ని దగ్గర పెట్టుకున్నట్లుగా కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీ ప్రెసిడెంట్‌ పోస్టులను బూజు పట్టేవరకు తన దగ్గరే ఉంచుకుంటుంది. పార్టీ ఓడిపోడానికి, పార్టీ ప్రెసిడెంటుకు సంబంధం లేదని కాంగ్రెస్‌ నమ్ముతుంది కనుక పార్టీని గెలిపించడం కోసమైతే మాత్రం పార్టీ ప్రెసిడెంటును నియమించదు. పార్టీ ఓడిపోయిందని పార్టీ అధ్యక్షుల్ని తొలగించదు. రాహుల్‌ అయినా, ఉత్తమ్‌ అయినా ఓటమి బాధ్యతను వాళ్ల భుజాన వాళ్లు వేసుకుని వెళ్లిపోవడమే. 

కాంగ్రెస్‌ ఏం చేస్తుందో ఏం చెయ్యదో ఊహించడం కూడా కష్టమే. పార్టీని గెలిపించలేకపోయిన వాళ్లను ఎంపిక చేసుకుని మరీ అధ్యక్షుడిని చేసినా చేస్తుంది! జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి నలభై ఎనిమిది డివిజన్‌లకు ఇన్‌చార్జిగా ఉన్నాడు. బీజేపీకీ సరిగ్గా నలభై ఎనిమిది సీట్లొచ్చాయి. కాంగ్రెస్‌కు రెండంటే రెండే. పెరగలేదు. తగ్గలేదు. అందుకు రేవంత్‌రెడ్డి కారణం కాదనుకుంటే కనుక రేవంత్‌ని ప్రెసిడెంట్‌ని చెయ్యడానికి కాంగ్రెస్‌కి కారణం ఉండదు. మీడియా వాళ్లకు బ్రేకింగ్‌ ఏదో వచ్చినట్లుంది! సరంజామా సర్దుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి దగ్గరకే కావచ్చు. వర్క్‌ లేకున్నా ప్రెసిడెంట్‌లు అయ్యే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు కాంగ్రెస్‌లోనే ఉంటారు. మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు