వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

14 Nov, 2023 01:02 IST|Sakshi
మండే కిషోర్‌(ఫైల్‌)

తెనాలిరూరల్‌/భట్లిప్రోలు: తెనాలి పట్టణంతోపాటు రూరల్‌ పరిధిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే భట్టిప్రోలు రైలుపేటకు చెందిన గుండాల అభిలాష్‌(21) అలియాస్‌ అభి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గుంటూరులో రైలు దిగి తన మిత్రుడైన అదే ప్రాంతానికి చెందిన గేరా ప్రేమ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి బైక్‌ తీసుకురావాలని కోరాడు. అతడు భట్టిప్రోలు దళితవాడకు చెందిన మండే కిషోర్‌(19)ను వెంట బెట్టుకుని వెళ్లాడు. తర్వాత ముగ్గురూ తెనాలి సుల్తానాబాద్‌లో ప్రేమ్‌కుమార్‌ పిన్నమ్మ ఇంటికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనం ఓవర్‌బ్రిడ్జి దిగే సమయంలో మితిమీరిన వేగం వల్ల బ్రిడ్జిపై ఫుట్‌పాత్‌ను ఢీకొట్టడంతో ముగ్గురూ కింద పడ్డారు. అభిలాష్‌ అక్కడికక్కడే మరణించగా, కిషోర్‌ను వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ప్రేమ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కిషోర్‌ గుంటూరు మిర్చి యార్డులో ముఠా పని చేస్తుంటాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. త్రీ టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భట్టిప్రోలులో విషాదఛాయలు

మృతులు అభిలాష్‌, కిషోర్‌ ఇద్దరూ భట్టిప్రోలుకు చెందిన వారే. అభిలాష్‌ మృతితో అతని తల్లిదండ్రులు శకుంతల, జాన్‌బాబు శోక సంద్రంలో మునిగిపోయారు. వీరికి అభిషేక్‌తోపాటు మరో కొడుకు ఉన్నారు. భట్టిప్రోలు దళితవాడలో ఉండే మండే సుజాత(చిన్నమ్మాయి) భర్త చనిపోవడంతో కుమార్తె, కొడుకు కిషోర్‌తో కలిసి ఉంటున్నారు. కిషోర్‌ ఇటీవలే గుంటూరు వచ్చి మిర్చి యార్డ్‌లో పనిచేస్తూ తల్లికి, చెల్లికి ఆదరువుగా ఉంటున్నాడు. ఇప్పుడు కిషోర్‌ మృతితో సుజాత తల్లడిల్లుతున్నారు. అభిలాష్‌, కిషోర్‌ మృతదేహాలకు సోమవారం మధ్యాహ్నం పోలీసులు తెనాలి ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కంచర్లపాలెం సమీపంలో..

తెనాలి మండలం కంచర్లపాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాపట్ల జిల్లా నిజాం పట్నం మండలం కూచినపూడికి చెందిన దున్న రాజేశ్వరరావు(28) ప్రస్తుతం కంచర్లపాలెంలో నివసిస్తున్నాడు. నందివెలుగు వైపు నుంచి తెనాలి వైపు తన స్కూటీపై ఆదివారం రాత్రి వస్తుండగా, ఎదురుగా వచ్చిన మరో బైక్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో రాజేశ్వరరావు మరణించారు. బైక్‌పై వస్తున్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బైక్‌ అతి వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌ వెంకటేశ్వర్లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు