ఏ నిమిషానికి ఏ పార్టీనో.. | Sakshi
Sakshi News home page

ఏ నిమిషానికి ఏ పార్టీనో..

Published Tue, Nov 14 2023 1:02 AM

- - Sakshi

ఎల్లారెడ్డి: ‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ’’ అని ఓ సినీ గేయ రచయిత రాసిన ట్లుగా ప్రస్తుత రాజకీయాలు సాగుతున్నాయి. నేతలు జంపింగ్‌లను ప్రోత్సహిస్తుండడంతో ఎవరు ఏ పూటకు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం వేసుకున్న కండువా రంగు మధ్యాహ్నానికి మారిపోతోంది. సాయంత్రానికి ఇంకో రంగు వచ్చేస్తోంది.

ఓవైపు ఎన్నికల గడువు సమీపిస్తుండగా.. మరోవైపు కండువాలు మార్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ బలాన్ని చూపించడానికి అభ్యర్థు లు చేరికలనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు తమను కలవడానికి వచ్చినవారికల్లా పార్టీ కండువా కప్పేస్తున్నారు. ఇంకోవైపు తమ పార్టీ అభ్యర్థి పట్టించుకోవడం లేదని నారాజవుతున్న కార్యకర్తలు, నేతలు.. పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తాము ఉన్న పార్టీలో పరిస్థితులు, తమ నేతల నుంచి లభిస్తున్న ఆదరణ, విజయావకాశాలు తదితర అంశాలను బేరీజు వేసుకుంటున్న వారు పార్టీలు మారుస్తున్నారు. అభ్యర్థి వద్ద సత్తా చాటేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పెద్ద సంఖ్యలో జనాలను తీసుకువచ్చి పార్టీల్లో చేర్చుతున్నారు. ఇతర పార్టీల్లోని ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలను తమ పార్టీలో చేర్చుకునేందుకు మంచిమంచి ప్యాకేజీలూ ఇస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. దీంతో ఇటునుంచి అటు.. అటు నుంచి ఇటు జంపింగ్‌లు కామన్‌ అయ్యాయి. అయితే తమ పార్టీ కార్యకర్తలు వేరే కండువా కప్పకున్నారని తెలియగానే అభ్యర్థితోపాటు సీనియర్‌ నేతలు ఆగమవుతున్నారు. ఆగమేఘాల మీద వారి ని కలిసి హామీలిస్తూ తిరిగి సొంత గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలూ చేస్తున్నారు. పార్టీలన్నీ జంపింగ్‌లను ప్రోత్సహిస్తుండడంతో ఏ సమయానికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

చేరికలను ప్రోత్సహిస్తున్న లీడర్లు

కండువాలు మార్చేస్తున్న కార్యకర్తలు

జోరుగా సాగుతున్న జంపింగ్‌ ప్రక్రియ

Advertisement
Advertisement