నేటి ఉద్యోగుల స్పందన రద్దు

17 Nov, 2023 01:40 IST|Sakshi

గుంటూరు వెస్ట్‌ : ప్రతి నెలా మూడో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు గుంటూరు జిల్లా డీఆర్వో చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాలతో రద్దు చేశామని వచ్చే నెలలో యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

డైక్‌ సెంటర్‌లో పిల్లలకు

స్క్రీనింగ్‌ పరీక్షలు

గుంటూరు మెడికల్‌ : గుంటూరు జీజీహెచ్‌లోని జిల్లా సత్వర చికిత్సా కేంద్రం (డైక్‌సెంటర్‌)లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పిల్లలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు సమస్యలు ఉన్న పిల్లలకు పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న పిల్లలకు స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి హియరింగ్‌ ఎయిడ్‌ (వినికిడి యంత్రాలు) అందజేశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు ఆదేశాల మేరకు జరిగిన ప్రత్యేక స్క్రీనింగ్‌ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్‌ ప్రియాంక, డాక్టర్‌ కీర్తి, పలువురు పారా మెడికల్‌ సిబ్బంది, డైక్‌ మేనేజర్‌ పావులూరి నాగశిరీష తదితరులు పాల్గొన్నారు.

నేడు జెడ్పీలో స్థాయీ

సంఘాల భేటీ

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాలు శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో భేటీ కానున్నాయి. సమావేశాల్లో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జెడ్పీ బడ్జెట్‌ ప్రతిపాదనలపై చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన చర్చించనున్నారు. స్థాయీ సంఘంలో ఆమోదం పొందిన తరువాత బడ్జెట్‌ ప్రతిపాదనలను త్వరలో జరగనున్న సర్వసభ్య సమావేశానికి పంపనున్నారు. వీటిలో ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, అభివృద్ధి పనులకు సంబంధించిన 1, 2, 4, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్నాయి. అదే విధంగా వ్యవసాయంపై 3వ స్థాయి సంఘ సమావేశానికి జెడ్పీ వైస్‌ చైర్మన్‌ శొంటిరెడ్డి నర్సిరెడ్డి, సీ్త్ర–శిశు సంక్షేమంపై 5వ స్థాయీ సంఘానికి తెనాలి జెడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి, సాంఘిక సంక్షేమంపై 6వ స్థాయీ సంఘ సమావేశానికి జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బత్తుల అనురాధ అధ్యక్షత వహించనున్నారు.

స్టాఫ్‌ నర్సులకు

నియామక ఉత్తర్వులు

గుంటూరు మెడికల్‌ : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌ నర్సులుగా ఉద్యోగాలకు ఎంపికైన 42 మందికి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు గురువారం నియామక ఉత్తర్వులు అందజేశారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం డీపీఓఎం డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌, పరిపాలన అధికారి రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

యార్డులో 29,247 బస్తాల మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు గురువారం 29,055 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 29,247 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.24,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి 24,000 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.13,000 నుంచి రూ.22,500 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.12,500 నుంచి 25,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.14,000 వరకు ధర పలికింది.

మరిన్ని వార్తలు