23 నుంచి భవానీ మండల దీక్షలు

21 Nov, 2023 02:08 IST|Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ఈనెల 23వ తేదీ గురువారం నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే ఉత్సవాలలో రెండో అతి పెద్ద ఉత్సవమైన భవానీ దీక్షలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. 23 నుంచి ఐదు రోజుల పాటు భక్తులు అమ్మవారి మండల దీక్షలను స్వీకరిస్తారు. దీక్ష స్వీకరణ కార్యక్రమాన్ని దేవస్థానం ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. గురువారం ఉదయం అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌కు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి పగడాలతో చేసిన దండను అలంకరిస్తారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రధాన ఆలయం నుంచి మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ ప్రత్కేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం లాంఛనంగా ప్రారంభమవుతుంది. అమ్మవారి ఆలయంతో పాటు ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద, గురు భవానీల పీఠంలోనూ భక్తులు అమ్మవారి దీక్షలను స్వీకరిస్తారు.

26న కోటి దీపోత్సవం

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 26వ తేదీ ఆదివారం సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం వెలిగిస్తారు. 27వ తేదీ ఉదయం 5:55 గంటలకు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ జరుగుతుంది.

13 నుంచి అర్థమండల దీక్షలు

డిసెంబర్‌ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు భక్తులు అమ్మవారి అర్థమండల దీక్షలను స్వీకరిస్తారు. ఇక డిసెంబర్‌ 26వ తేదీ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుంది. దీక్ష విరమణలు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ప్రారంభమై జనవరి 7వ తేదీ వరకు కొనసాగుతాయి. 3వ తేదీ ఉదయం మహామండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసే హోమగుండాలలో అగ్నిప్రతిష్టాపనతో దీక్ష విరమణలు ప్రారంభమవుతాయి. జనవరి 7వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించే పూర్ణాహుతితో దీక్ష విరమణలు పరిసమాప్తమవుతాయి.

26న కోటి దీపోత్సవం

డిసెంబర్‌ 13 నుంచి అర్ధమండల దీక్షలు

మరిన్ని వార్తలు