రైతు ఉసురు తీసిన అప్పులు

25 May, 2023 01:28 IST|Sakshi

పెద్దవంగర : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. మండలంలోని గంట్లకుంట గ్రామ పరిధిలోని అమర్‌సింగ్‌ తండాకు చెందిన జాటోతు శ్రీను (45) తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేయడంతోపాటు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా వ్యవసాయం, కుటుంబ పోషణ కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పు చేశారు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పు తీర్చలేని, కుటుంబాన్ని పోషించలేని దుస్థితిలో కొంత కాలంగా శ్రీను కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయాన్ని పలువురికి చెప్పి బాధపడ్డాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో వారికి చెల్లించే దారి లేక బుధవారం ఉదయం 6 గంటలకు తన వ్యవసాయ భూమిలోని చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సరోజ, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి కొడుకు అనిల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేపుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు.

పురుగుల మందు తాగి కౌలు రైతు..

మామునూరు : వడగళ్ల వర్షంతో పంట నష్టపోయి పెట్టుబడుల కోసం చేసిన ఆప్పులు తీర్చలేననే మనోవేదనతో ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌ జిల్లాలోని ఖిలా వరంగల్‌ మండల పరిధిలోని బొల్లికుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని రామన్నకుంట తండకు చెందిన మాలోతు బాలు (40) భార్య యాకలక్ష్మి, పిల్లలను తీసుకుని ఐదేళ్ల క్రితం బొల్లికుంట గ్రామానికి వలస వచ్చారు. బొల్లికుంటకు చెందిన దొంతి సత్యనారాయణరెడ్డికి చెందిన నాలుగెకరాల వ్యవసాయ భూమిని మాలోతు యాకలక్ష్మీ, బాలు దంపతులు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వరి, మొక్కజోన్న పంట వేయగా కోతకు వచ్చిన పంట ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో బాలు భారీగా నష్టపోయాడు. ఆప్పులు తీర్చే పరిస్థితి లేక ఆ దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయమే మాలోతు బాలు భార్య యాకలక్ష్మి ఇద్దరు పిల్లలను తీసుకుని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లగా ఇంట్లో బాలు ఒక్కడే ఉన్నాడు. ఆర్ధిక ఇబ్బందుల గురై మనోవేదనతో బాలు మంగళవారం ఆర్ధరాత్రి పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేములవాడ నుంచి గ్రామానికి మంగళవారం రాత్రి చేరుకున్న యాకలక్ష్మి భర్త ఇంట్లో లేకపోవడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అప్పటికే బాలు స్పృహ తప్పి పడిపోయి ఉండగా ఆటోలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా ఆప్పటికే బాలు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఎస్సై రాజేష్‌రెడ్డి, సీఐ క్రాంతికుమార్‌ ఘటన స్థలాన్ని, ఎంజీఎంను చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య యాకలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ క్రాంతికుమార్‌ మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు