Cancer : క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న పెంచేందుకు "గ్లోబ‌ల్ గ్రేస్ క్యాన్స‌ర్ ర‌న్"

20 Sep, 2023 17:20 IST|Sakshi

హైదరాబాద్‌ :

ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవేర్‌నెస్ రన్ "గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023" కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర టీ షర్ట్‌ను విడుదల చేశారు. ఫిజికల్, వర్చువల్ మోడ్‌ల ద్వారా 130 దేశాల నుండి లక్ష మంది పాల్గొనే ఈ రన్ అక్టోబర్ 8న జరగనుంది. ఈ ప్రయత్నంలో సైబరాబాద్ పోలీసులు రన్ నిర్వాహకులకు అండగా ఉంటారు.

ఎప్పుడు : సెప్టెంబర్ 12, 2023

ఎక్కడ : క్షేత్ర స్థాయిలో గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్‌, దీంతో పాటు వర్చువల్‌

ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్ "క్వాంబియంట్ డెవలపర్స్ - గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023" అక్టోబర్ 8న గచ్చిబౌలి స్టేడియంలో, నగరంలో జరగనుంది. ఈ నేప‌థ్యంలో, గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన సంక్షిప్త ఆవిష్కరణ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్  స్టీఫెన్ రవీంద్ర మంగళవారం దీనికి సంబంధించిన టీ-షర్ట్‌ను విడుదల చేశారు.

గ్లోబల్‌ రన్‌ - నోబుల్‌ కాజ్‌

స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, "ఇది ఒక వైవిధ్యంతో నడిచే గొప్ప పరుగు" అని అన్నారు. "సైబరాబాద్ పోలీసులు గత సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా దీంట్లో పాల్గొనడం  సంతోషంగా ఉంది. ఇది స్పోర్ట్స్ ఈవెంట్ కాదు, ఇది గ్లోబల్ ఈవెంట్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 130 దేశాల నుంచి రన్నర్లు పాల్గొనే అవకాశం ఉంది.  ఈ ఈవెంట్‌కు సహకరిండాన్ని సైబరాబాద్ పోలీసులు బాధ్యతగా భావిస్తున్నారు.  ఇది మాకు గర్వకారణం. సైబరాబాద్ పోలీసులు నిర్వాహకులకు అన్ని విషయాల్లో సహకరిస్తారు" అని తెలిపారు.

"'బీ లైట్' అనే థీమ్‌తో 6వ ఎడిషన్ రన్‌లో 130కి పైగా దేశాల నుండి లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొంటారు" అని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గ్రేస్ (గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్) క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి వెల్లడించారు.

ర‌న్ నిర్వ‌హించబోయిన విధానం:

రన్ మూడు వేర్వేరు విభాగాలలో జరుగుతుంది. 5K, 10K, 21.1K (హాఫ్ మారథాన్). గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో 25 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. ఇది  హైబ్రిడ్ పద్దతిలో భౌతిక పద్దతిలో, వర్చువల్ పద్దతిలో జరగనుంది. భారతదేశంలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో జరిగే ఏకైక రన్ బహుశా ఇదే.

ఎడ్యుకేషన్, ఎర్లీ డిటెక్షన్, ట్రీట్‌మెంట్, రీహాబిలిటేషన్, అత్యాధునిక పరిశోధనల ద్వారా క్యాన్సర్ భారాన్ని తగ్గించే సదుద్దేశంతో లాభాపేక్షలేని సంస్థగా "గ్రేస్" క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పడింది. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన దూరాన్ని పరిగెత్తడమే కాకుండా, తమ రిజిస్ట్రేషన్ ఫీజులో కొంత భాగాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన కోసం విరాళంగా ఇవ్వడం ద్వారా మంచి కార్యక్రమంలో పాలుపంచుకున్నట్టవుతారు” అని డాక్టర్ చినబాబు తెలిపారు.

క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు మరింత మేలు చేయడం, సమాజంలో క్యాన్సర్‌ను నిరోధించడానికి, ఎదుర్కోవడానికి శారీరక శ్రమను ప్రోత్సహించడం, ప్రజలు చురుకైన జీవనశైలిని అనుసరించడంలో సహాయపడటం, నిరుపేదలను వారి ఇంటి వద్దే ఉచితంగా పరీక్షించడానికి నిధులను సేకరించడానికి ఈ రన్‌ను నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ చినబాబు తెలిపారు.

ఈ ర‌న్ గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న‌:

"గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అట్టడుగు వర్గాలకు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయం చేస్తుంది. చాలా కణితులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే న‌యం చేయవచ్చు. అయితే, ప్రపంచవ్యాప్తంగా మారుమూల, మురికివాడల్లో నివసించే చాలా మందికి ఈ వాస్తవం గురించి తెలియదు. దురదృష్టవశాత్తు, వారు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. కాబట్టి, ఈ ర‌న్ ద్వారా వారిని చేరదీసి, ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలనేది మా ప్రగాఢ కోరిక" అని ఆయన అన్నారు

ప్రపంచవ్యాప్తంగా ఏటా 9.5 మిలియన్ల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారనేది విస్మయం కలిగిస్తోంది. కాబట్టి, ఎక్కువ మంది దీని బారిన పడకుండా నిరోధించడానికి, ఫౌండేషన్ ఇప్పటివరకు 4 ఖండాలను కవర్ చేస్తూ 10 దేశాలలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు, క్యాన్సర్ అవగాహన చర్చలు ఇంకా క్యాన్సర్ రన్‌లను నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు