కంచె తీసినా కష్టాలేనా!

9 Dec, 2023 05:06 IST|Sakshi
మా మొర వినండి అంటూ.. అర్జీలను చూపిస్తూ..
ఎక్స్‌‘టెన్షన్‌’

ప్రజా భవన్‌కు భారీగా తరలి వచ్చిన ప్రజలు

ఒత్తిడి ఎక్కువ కావడంతో బారికేడ్లు ఏర్పాటు

సరైన ప్రణాళిక లేకుంటే నిత్యం ఇబ్బందులే

అధ్యయనం చేయాలని అధికారుల నిర్ణయం

ప్రముఖుల భద్రత కూడా సవాలే..

ప్రాథమిక సూచనల ప్రకారం ప్రతి వారం రెండు రోజుల పాటు ప్రజా దర్భార్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలిసింది. ఒక రోజు ప్రత్యక్షంగా తానే పాల్గొనడం, మరో రోజే రొటేషన్‌ విధానంలో ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మాత్రమే ప్రజా దర్బార్‌ జరగాల్సి ఉంది. భారీ స్థాయిలో వచ్చిన ప్రజలతో ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత మరో మంత్రి ఉండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ భారీ స్థాయిలో ప్రజలు రావడంతో రహదారి వద్దే బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రించాల్సి వచ్చింది. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, అదే జరిగితే సీఎం, మంత్రులు సహా అత్యంత ప్రముఖుల భద్రతకు అది సవాల్‌ అని భావిస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజా భవన్‌గా మారిన ప్రగతి భవన్‌ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప గ్రిల్స్‌ గురువారం తొలగించినప్పటికీ.. శుక్రవారం వాహన చోదకుల తిప్పలు తప్పలేదు. రద్దీ రోడ్డు కావడంతో పాటు ప్రజా దర్బార్‌ తొలి రోజు రావడంతో భారీ ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రజా దర్భార్‌ నిర్వహణపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. లేని పక్షంలో భవిష్యత్‌లో మరిన్ని ట్రాఫిక్‌ తిప్పలు తప్పవని భావిస్తున్నారు.

అత్యంత కీలకమైన మార్గం, ప్రదేశం..

ప్రజా భవన్‌ ఉన్న పంజగుట్ట, బేగంపేట మార్గం అత్యంత కీలకమైంది. పీక్‌ అవర్స్‌గా పిలిచే ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో మాత్రమే కాకుండా ఈ రహదారి అనునిత్యం రద్దీగానే ఉంటుంది. మొనప్ప ఐలాండ్‌ నుంచి గ్రీన్‌లాండ్స్‌ జంక్షన్‌ మధ్య ఉన్న దాదాపు 500 మీటర్ల దూరాన్ని దాటడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగానే గతంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం డైనమిక్‌ వన్‌ వే కూడా అమలు చేశారు. ప్రజా భవన్‌గా మారిన ముఖ్యమంత్రి అధికార నివాసం ఉన్న ప్రాంతం కూడా సున్నితమైనదిగా అధికారులు చెబుతున్నారు. బేగంపేట ఫ్లైఓవర్‌ ప్రారంభమయ్యే చోట ఇది ఉండటం, ఆ వంతెన పక్క నుంచే ప్రధాన రహదారి కొనసాగడమే దీనికి కారణమని వివరిస్తున్నారు.

వివిధ కోణాల్లో సాగుతున్న అధ్యయనం...

ప్రజా భవన్‌లో జరిగే ప్రజా దర్భార్‌తో అటు తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలు, ఇటు వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన వాళ్ళు ఒకేసారి రావడంతో పరిస్థితి అదుపు చేయడం కష్టసాధ్యమైంది. ఈ అనుభవంతో అధికారులు ప్రధానంగా రెండు ప్రతిపాదనలు చేయాలని యోచిస్తున్నారు. జిల్లాల వారీగా లేదా సమస్యల వారిగా ప్రజా దర్భార్‌ నిర్వహణ కోణంలో ఆలోచిస్తున్నారు. జిల్లాల వారీగా చేయాలంటే బాధితులు ఏ జిల్లాకు చెందిన వాళ్ళే గుర్తించడం కష్టం. దీంతో రెవెన్యూ, వైద్యం, పోలీసు ఇలా విభాగాల వారీగా నిర్వహిస్తేనే ఉత్తమమని భావిస్తున్నారు. దీని ప్రకారం ఒక రోజు రెవెన్యూ సమస్యలపై జరిగితే.. మరో రోజు పోలీసు సంబంధిత సమస్యలతో ఉన్న వారికి, ఇంకో రోజు వైద్యానికి సంబంధించిన బాధితులకు నిర్వహించేలా ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది.

సెక్యూరిటీ వెట్టింగ్‌ చేయనున్న ఇంటెలిజెన్స్‌...

● ప్రజా దర్భార్‌కు శుక్రవారం వచ్చిన స్పందన పరిగణలోకి తీసుకున్న ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు ప్రజా భవన్‌కు సెక్యూరిటీ వెట్టింగ్‌ చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే చీఫ్‌ మినిస్టర్స్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (సీఎంఎస్‌జీ) నేతృత్వంలో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ), సిటీ సెక్యూరిటీ వింగ్‌ (సీఎస్‌డబ్ల్యూ), శాంతిభద్రతల విభాగాలతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు ప్రజా భవన్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ఆపై భద్రతాంశాల్లో కీలక ప్రతిపాదనలు తయారవుతాయి.

● ప్రజలకు ముఖ్యమంత్రి ఎక్కడ కలవాలి? ఎలా కలవాలి? ఆయన రాకపోకలు, ప్రజలు వచ్చి వెళ్ళాల్సిన మార్గాలు, యాక్సస్‌ కంట్రోల్‌ తదితరాలను ఖరారు చేయనున్నారు. తాము అధ్యయనం చేసి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని, ఆయన నిర్ణయమే ఫైనల్‌ అని ఓ ఉన్నతాధికారి శ్రీసాక్షిశ్రీతో అన్నారు. దాని ఆధారంగానే ప్రజా దర్భార్‌ నిర్వహణకు అవసరమైన బందోబస్తు, భద్రత ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. అక్కడ అవసరమైన సంఖ్యలో సాధారణ, సాయుధ బలగాలను మోహరించనున్నామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు