రాజ్యాంగ పరిరక్షణతో ప్రజాస్వామ్యానికి మేలు

11 Dec, 2023 06:30 IST|Sakshi
మాట్లాడుతున్న జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి

విజయనగర్‌కాలనీ: ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైన మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యావేత్తలు పేర్కొన్నారు. ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం మాసబ్‌ట్యాంక్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ ఆండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్శిటీ ప్రాంగణంలోని ఆడిటోరియం హాల్‌లో 3వ జాతీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ..అధికార, ప్రతిపక్ష హోదాలలో ఎవరున్నా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. వివిధ సామాజిక వర్గాల జనాభా ప్రాతిపదికన జాతి సంపద, రిజర్వేషన్లు అందేలా ఉండాలన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయకోవిధులు మాట్లాడుతూ అట్టడుగున ఉన్న ప్రజల సామాజిక, ఆర్థిక సమస్య లు పరిష్కరించి వారి జనాభా దామాషా ప్రకారం అన్నిరంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్రాంత చీఫ్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు