బాలల్లో సృజనాత్మకతను పెంచాలి | Sakshi
Sakshi News home page

బాలల్లో సృజనాత్మకతను పెంచాలి

Published Mon, Dec 11 2023 6:30 AM

గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ఎల్లూరి శివారెడ్డి తదితరులు   - Sakshi

సుల్తాన్‌బజార్‌ : ఉత్తమ సమాజ నిర్మాణానికి బాలల ద్వారా పునాది వేయాలని, ఇందుకు పెద్దలు కూడా సహకరించి వారిలో సృజనాత్మకతను పెంచాలని శాంతా వసంత ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్‌ కే ఐ.వరప్రసాద్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాతృమూర్తి శాంతమ్మ స్మృత్యర్థం వెలువరించిన ‘పిల్లల పాటల పరిమళం, విజ్ఞానం–వికాసం’ గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలల్లో రచనాపరమైన ప్రావీణ్యం కల్పించేందుకు తెలంగాణ సారస్వత పరిషత్తు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ పిల్లల పాటల పరిమళం, విజ్ఞానం– వికాసం గ్రంథాలకు ప్రముఖ రచయిత్రి శాంతి ప్రభోద సంపాదకత్వం వహించారు. ఈ సందర్భంగా పరిషత్తు తరపున వారితో పాటు రచయితలు, చిత్రకారులను సత్కరించారు. పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. ప్రముఖ పత్రికా రచయిత చీకోలు సుందరయ్య 123 ఉత్తమ గ్రంథాలపై రాసిన వ్యాసాలతో కూడిన పుస్తకాన్ని డాక్టర్‌ కేఐ వరప్రసాద్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్‌, పరిషత్‌ కోశాధికారి మంత్రి రామారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement