2050 నాటికి ఏ దేశాల్లో హిందువులు అధికం?

12 Oct, 2023 10:12 IST|Sakshi

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగుచూశాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2015లో ఈ పరిశోధన నిర్వహించింది. రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన, పెను మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడయ్యింది. 

హిందూ మతంతో పాటు క్రైస్తవం, ఇస్లాం, అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి. ఈ పరిశోధన ద్వారా రాబోయే 40 ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2050 నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో 15 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికీ అధికంగానే ఉంటుంది. 

అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా 2050 నాటికి 1.297 (ఒక బిలియన్‌.. 100 కోట్లు) బిలియన్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించేవారు ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 79 శాతానికి పైగా ఉంది. హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది. నేపాల్‌లో హిందువుల జనాభా 3.812 కోట్లు. 2006కి ముందు నేపాల్‌ హిందూ దేశంగా ఉండేది. ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది. 

ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2050నాటికి అమెరికాలో 47.8 లక్షల మంది హిందువులు ఉంటారు. 2015లో అమెరికాలో హిందువుల జనాభా 22.3 లక్షలు. ఇండోనేషియాలో వచ్చే 27 ఏళ్లలో హిందువుల జనాభా 41.5 లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది. శ్రీలంక, మలేషియా, బ్రిటన్, కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది.
ఇది కూడా చదవండి:  టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది?

మరిన్ని వార్తలు