ఇదేం రూల్‌ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్‌!

27 Apr, 2022 20:23 IST|Sakshi

మన ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్‌పైన ఉతికిన దుస్తులను ఆరబెట్టడం సహజమే.  అయితే ఓ ప్రాంతంలో మాత్రం అలా బాల్కనీలో బట్టలు ఆరబెడితే ఫైన్‌ కట్టాల్సివస్తుంది. ఎక్కడనుకుంటున్నారా.. ఈ వింత రూల్‌ యూఏఈలోనిది. అయితే ఇలాంటి నిబంధన తీసుకురావడానికి కారణం ఉందని ఆ ప్రాంత అధికారులు చెప్తున్నారు. అసలు ఆ కథేంటని తెలుసుకుందాం!

వివరాల్లోకి వెళితే.. అబుదాబిలోని మున్సిపాలిటీ అధికారులు అపార్ట్‌మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టవద్దని ఆ ప్రాంత నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 20,000) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు అక్కడి మున్సిపల్‌ అధికారులు. బాల్కనీలో దుస్తులు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుందని, అందుకే బాల్కనీలో, కిటికీలకు బట్టలు వేలాడదీయవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే  ఆరబెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

చదవండి: ‘ఇది కరెక్ట్‌ కాదు.. రష్యా వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది’

మరిన్ని వార్తలు