వాటర్‌ బాటిల్‌ అనుకుని శానిటైజర్‌ని తాగిన అథ్లెట్లు...ఆ తర్వాత..

10 May, 2022 15:56 IST|Sakshi

School athletes drink sanitiser: నిజానికి దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందింప చేసేందుకు దోహదపడేవి క్రీడలు. అంతేకాదు ఐక్యతను చాటి చెప్పేందుకే ప్రపంచ దేశాలన్నీ క్రీడలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఆయ దేశాలు తమ క్రీడాకారులకు కావల్సిన సౌకర్యాలను కల్పించి మరి దేశ విదేశాల్లో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది కూడా.

కానీ కొన్నిచోట్ల అరకొర సౌకర్యాలతో సమస్యలను ఎదుర్కొంటున్న క్రీడాకారులు ఉన్నారు. అంతేకాదు స్పోర్ట్స్‌ ట్రైయినింగ్‌ సెంటర్లలో క్రీడాకారులకు సంబంధించిన డైట్‌ విషయంలో నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో ఆడుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలానే ఒక పాఠశాలలోని అథ్లెట్లు స్పోర్ట్స్‌ నిర్వాహకులు నిర్లక్ష్య వైఖరితో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.

వివరాల్లోకెళ్తే...జపాన్‌లోని ఒక పాఠశాలలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్‌ జపాన్‌లోని యమనాషి ప్రిఫెక్చర్‌లో నిర్వాహకులు గత వారాంతంలో బాలికల  5 వేల మీటర్ల మారథాన్‌ రేసును నిర్వహించారు. ఐతే పొరపాటున నిర్వాహకులు వాటర్‌ బాటిల్‌ అనుకుని శానిటైజర్‌ని కప్పుల్లో వేసి సర్వ్‌ చేశారు. దీంతో ఒక అథ్లెట్‌ వాంతులు చేసుకుని రేసు నుంచి నిష్క్రమించగా, మరో ఇద్దరు మాత్రం ఉమ్మివేసి రేసుని తిరిగి కొనసాగించినట్లు జపాన్‌ అధికారులు తెలిపారు.

ఈ మేరకు మొత్తం ముగ్గురు అథ్లెట్లు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. తాగునీటి వాటర్‌ బాటిల్‌ తోపాటు శానిటైజర్‌ కూడా అదే ప్లాస్టిక్‌ బాటిల్‌తో ఉందని హైస్కూల్ యమనాషి స్పోర్ట్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని యమనాషి గవర్నర్ కొటారో నాగసాకి తెలిపారు. అంతేకాదు ఆయన అథ్లెట్లకు వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక క్షమాపణలు చెప్పారు కూడా.

(చదవండి: శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు)

మరిన్ని వార్తలు