10 నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు

13 Jun, 2021 15:46 IST|Sakshi

మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలను మరింత సులువు చేయడం కోసం స్పేస్‌ ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్న విషయం అందరికి తెలిసిందే. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి మానవ సహిత అంతరిక్ష యాత్రలను దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. కేవలం అంతటితో ఆగకుండా అంగారక గ్రహంపై కాలనీలు ఏర్పాటు చేయాలని కూడా చూస్తుంది. ఎలన్‌ మస్క్ కంపెనీ స్పేస్‌ ఎక్స్ ఇప్పటికే ఆ దిశగా అంతరిక్షనౌక ప్రయోగాలపై దృష్టిసారించింది.

ఇది ఇలా ఉంటే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో జెఫ్‌ బెజోస్‌ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ సంస్థ కూడా కీలక ఘట్టానికి చేరుకుంది. బ్లూ ఆరిజిన్‌ తన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి సిద్థమైంది. ఈ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఆస్ట్రోనాట్స్‌తో పాటు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, అతని సోదరుడు మార్క్‌ బెజోస్‌తో కలిసి ప్రయాణించనున్నాడు. అయితే తాజాగా జెఫ్‌ బెజోస్‌ కలిసి అంతరిక్ష యాత్ర చేయడానికి మరో సీట్ కోసం శనివారం ఒక ప్రత్యక్ష వేలం జరిగింది. 

ఈ ప్రత్యక్ష వేలం ప్రారంభమైన నాలుగు నిమిషాల్లో బిడ్లు 20 మిలియన్ల డాలర్లకు పైగా కోట్ చేశారు. చివరకి వేలం ప్రారంభమైన 7 నిమిషాల తర్వాత 28 మిలియన్ డాలర్ల(రూ.205 కోట్లు)తో బిడ్డింగ్ ముగిసింది. అయితే, అంత మొత్తం వేలం వేసిన అతని పేరు బయటకి సంస్థ బయటకి వెల్లడించలేదు. జూలై 20న వెస్ట్ టెక్సాస్ నుంచి బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ బూస్టర్ అంతరిక్ష కక్ష్యలోకి వెళ్తుంది. కాగా ఈ ప్రయోగం కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తి కానుంది. ఈ బిడ్డింగ్ లో 143 దేశాల నుంచి 6,000 మందికి పైగా ఎంట్రీలు వచ్చినట్లు బ్లూ ఆరిజిన్ తెలిపింది.

చదవండి: పాన్‌ - ఆధార్‌ లింకు గడువు కొద్ది రోజులే!

మరిన్ని వార్తలు