-

Florida Woman Rescued: పిజ్జా యాప్‌ సాయంతో ప్రియుడి అరెస్ట్‌.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు!

26 Aug, 2023 07:31 IST|Sakshi

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన చెరిల్ ట్రెడ్‌వే అనే మహిళను ఆమె ప్రియుడు కొంతకాలంగా బంధించి ఉంచాడు. అయితే ఆమె తాజాగా పిజ్జా హట్ యాప్‌ని ఉపయోగించి పిజ్జా ఆర్డర్ చేసేందుకు అతనిని బెదిరించి ఒప్పించింది. ఆర్డర్‌లోని ప్రత్యేక అభ్యర్థన కోసం కేటాయించిన స్థలంలో ‘దయచేసి సహాయం చేయండి. పోలీసులకు విషయం తెలియజేయిండి’ అని రాసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను బంధవిముక్తురాలిని చేశారు. 

ఫ్లోరిడాకు చెందిన ఆమె తన ప్రియుడిని కత్తితో బెదిరించి, ఫోను తన చేతిలోకి తీసుకుని, పిజ్జా డెలివరీ యాప్‌లో ఆర్డర్‌ ప్లేస్‌ చేస్తూ, తనకు సహాయం చేయాలని కోరిందని పోలీసులు తెలిపారు. పిజ్జా హట్ నుండి ఆర్డర్ చేయడానికి చెరిల్ ట్రెడ్‌వే అనే మహిళ ఈ ‍ప్రయత్నం చేసిందని ఫ్లోరిడా పోలీసులు తెలిపారు. పెప్పరోనితో పాటు స్మాల్‌ క్లాసిక్ పిజ్జాను ఆర్డర్‌ చేసిన ఆమె పిజ్జా హట్‌ సిబ్బందికి.. పోలీసు అధికారుల సహాయం కావాలని మెసేజ్‌ చేసింది. 

సమాచారం అందుకున్న పోలీసులు హైలాండ్స్ కౌంటీలోని ట్రెడ్‌వే ఇంటికి చేరుకున్నారు. పోలీసుల రాకతో ఆమె ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని బయటికి పరిగెత్తింది. ట్రెడ్‌వే బాయ్‌ఫ్రెండ్, 26 ఏళ్ల ఈతాన్ ఎర్ల్ నికెర్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.  కాగా తాము ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఉదంతం  చూడలేదని ఆర్డర్ తీసుకున్న రెస్టారెంట్ మేనేజర్ క్యాండీ హామిల్టన్  మీడియాకు తెలిపారు. తాను ఈ సంస్థలో 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, ఇలాంటి విచిత్ర ఉదంతం ఎ‍న్నడూ చూడలేదని అన్నారు. కాగా పోలీసులు నికెర్సన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ట్విట్టర్‌లో షేర్‌ అయిన ఈ ఉదంతాన్ని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు యూజర్లు పిజ్జా యాప్‌ ద్వారా ఇలా కూడా చేయచ్చా? అని అంటుండగా మరికొందరు దీనికి బిల్లు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరో యూజర్‌ ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలని రాయగా, ఇంకొకరు పోలీసులే ఆ పిజ్జాను డెలివరీ చేస్తే ఇంకా బాగుండేదని అంటున్నారు. అలాగే.. ‘డెలివరీ బాయ్‌కు టిప్‌ ఇచ్చారా?’.. ‘ఇంతకీ ఆమె పిజ్జా అందుకుందా?’ ‘పెప్పరోనీ పిజ్జా నా ఫేవరెట్‌’.. అంటూ రకరకాలుగా యూజర్లు కామెంట్‌ చేస్తున్నారు.  
ఇది  కూడా చదవండి: ‘హలాల్‌ హాలిడే’ అంటే ఏమిటి? ముస్లిం యువతులకు ఎందుకంత ఇష్టం?
 

మరిన్ని వార్తలు