సాహితీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ భారీ మోసం

26 Nov, 2023 06:30 IST|Sakshi

ప్లాట్లు, విల్లాల పేరుతో భారీ మొత్తంలో వసూలు 

కొనుగోలుదారులకు  అప్పగించకుండా అజ్ఞాతంలోకి.. 

మంగళగిరి పోలీసులను ఆశ్రయించిన బాధితులు 

హైదరాబాద్‌లోనూ 15 వందల మందికి పైగా శఠగోపం

మంగళగిరి: సినీ నటులతో బ్రోచర్లు ప్రారంభం.. కార్పొరేట్‌ తరహాలో ప్రకటనలు.. సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు.. ఇంధ్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్‌ తదితర ప్రచారా్రస్తాలతో హోరెత్తించిన ఓ సంస్థ కొనుగోలుదారులకు భారీ ఎత్తున  శఠగోపం పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 వందల మంది కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ.. గుంటూరు జిల్లా కాజా వద్ద కూడా వెంచర్‌ వేసి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగుజూచింది.

వివరాల్లోకి వెళితే.. సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బూదాటి లక్ష్మీ నారాయణ హైదరాబాద్‌లోనూ, మంగళగిరి మండలం కాజా వద్ద వెంచర్‌ వేశారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొన్నట్లుగా చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్‌ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. 

రిజిస్ట్రేషన్‌ చేయకుండా ముప్పు తిప్పలు.. 
హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీధర్‌ అనే వ్యక్తి తన కుమార్తెల కోసం రెండు విల్లాలు కొనుగోలు చేసేందుకు రూ.కోటీ 80 లక్షలు చెల్లించారు. త్వరలోనే విల్లాలు పూర్తి చేసి అప్పగిస్తామని డబ్బులు తీసుకునేటప్పుడు చెప్పిన లక్ష్మీనారాయణ కనీసం స్థలాలను కూడా కొనుగోలు దారుల పేరిట రిజిస్టర్‌ చేయలేదు. 2020జూన్‌లో బాధితులు లక్ష్మీనారాయణను కలిసి రిజి్రస్టేషన్‌ అన్నా చేయాలని.. లేనిపక్షంలో డబ్బులు తిరిగి చెల్లించాలని కోరగా.. రెండు ప్రామిసరీ నోట్లు, రూ.90 లక్షల చొప్పున రెండు యూనియన్‌ బ్యాంకు చెక్కులను ఇచ్చి 2022 అక్టోబర్‌లో బ్యాంకులో వేసుకోమని చెప్పారు.

అయితే ఆ రెండు చెక్కులు బౌన్స్‌ కావడంతో  బాధితులు లక్ష్మీనారాయణ కోసం హైదరాబాద్‌ వెళ్లారు. అయితే ఇలానే పలువురిని మోసగించిన కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అప్పటికే లక్ష్మీనారాయణను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

ఇదిలా ఉండగా.. సాహితీ  సంస్థకు చెందిన వెంచర్‌ను ఆయన బంధువు బుచ్చిబాబు హాలాయుధా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో నడుపుతున్నట్లు తెలుసుకున్న బాధితులు అతనిని సంప్రదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వడంతో బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు.  కాగా, ఈ సంస్థ ప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలకు వాటాలు ఇవ్వడంతో పాటు 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేశ్‌ ఎన్నికలకు సైతం భారీ మొత్తంలో చందాలిచ్చినట్లు తెలుస్తున్నది.  

మరిన్ని వార్తలు