ముసుగులో వచ్చి ఇంట్లోకి చొరబడి.. ఈ-సెలబ్రిటీపై ఘాతుకం

20 Oct, 2022 10:05 IST|Sakshi

ముసుగులో వచ్చిన దుండగులు.. ఓ సోషల్‌ మీడియా స్టార్‌పై ఘాతుకానికి పాల్పడ్డారు. బ్రెజిల్‌ ప్రముఖ మోడల్‌, ఇంటర్నెట్‌ సెలబ్రిటీ నూబియా క్రిస్టియానా బ్రగ దారుణ హత్యకు గురైంది. 23 ఏళ్ల ఈ ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు ఇంట్లోనే కాల్చి చంపేసి పారిపోయారు. 

సెర్గిపే రాష్ట్రంలో అరకాజు శాంటా మరియా ప్రాంతంలోని ఆమె ఇంట్లో.. అక్టోబర్‌ 14వ తేదీనే ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. హత్య ఘటనకు కొద్దిగంటల ముందు ఆమె హెయిర్‌ సెలూన్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తున్న క్రమంలో.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో రక్తపు మడుగులో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం దుండగలు అక్కడి నుంచి పారిపోయారు అని పోలీసులు తెలిపారు. 

23 ఏళ్ల వయసున్న నూబియా క్రిస్టియానా బ్రగ.. ట్రావెల్‌, బ్యూటీ, ఫ్యాషన్‌, తన సొంత దుస్తుల కంపెనీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకంటూ పేరు దక్కించుకుంది. ఆమె మరణ వార్తతో అభిమానులు.. సోషల్‌ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు దుండగులు ఎవరు? ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారు? అనేది తెలియాల్సి ఉంది. ఆమెకు శత్రువులు ఎవరూ లేరని.. బెదిరింపులు కూడా ఏం రాలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

కిందటి నెలలో మెక్సికోలోనూ పాపులర్‌ టిక్‌టాక్‌ సెలబ్రిటీ కార్లా పార్దిని.. దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురైంది.

ఇదీ చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉంటే ఫసక్‌

మరిన్ని వార్తలు