Crying Child Playing The Violin: ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా?

20 Dec, 2021 19:21 IST|Sakshi

ఈ జిందగీలో ఎన్నో హృదయవిదారక సంఘటనలు, మనసును మెలితిప్పే ఉదంతాలు రోజూ ఎన్నెన్నో చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పేదరికం, హింస ప్రస్తుత సమాజంలో తారాస్థాయికి చేరుతుంది. పేదరికమే హింసకు కారణమౌతుందనేది అనేకమంది వాదన. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే లోపాల కారణంగా కొన్ని సందర్భాల్లో వారే నేరస్తులౌతున్నారు. ఐతే ప్రస్తుతం కొన్ని రకాల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పిల్లలకు సహాయం చేయడం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అటువంటి ఓ బాలుడికి సంబంధించిన ఓ పిక్చర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ బాలుడి కథ వింటే మీ కళ్లు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి.

వయొలిన్‌ వాయిస్తున్న ఇద్దరుముగ్గరు పిల్లలు కనిపించే ఈ ఫొటో వెనుక కథ ఏంటంటే... వీరిలో ఏడుస్తూ కనిపిస్తున్న పిల్లవాడు బ్రెజిల్‌కు చెందిన వాడు. మృతిచెందిన తమ టీచర్‌ అంత్యక్రియల్లో వయొలిన్‌ వాయిస్తున్నాడు. అవ్నీష్‌ షరన్‌ అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ ట్విటర్‌లో హృదయాన్ని మెలిపెట్టేలా ఏడుస్తూ వయొలిన్‌ వాయిస్తున్న బాలుడి ఫొటోను షేర్‌ చేశాడు. అంతేకాదు అతని కన్నీళ్లకు కారణం కూడా తెలుపుతూ.. నేర జీవితం నుంచి బయటకు తెచ్చిన గురువు అంత్యక్రియల్లో వయొలిన్‌ వాయిస్తూ ఏడుస్తున్న బ్రెజిలియన్‌ బాలుడు (డీగో ఫ్రాజో టర్కటో) అనే క్యప్షన్‌తో షేర్‌ చేశాడు. 

ఈ ఫొటోలో మానవత్వం ప్రపంచంలోనే గట్టిగొంతుకతో మాట్లాడుతోందని కూడా రాశాడు. ఐతే అనతికాలంలో ఈ బాలుడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాల్లో వైరలయ్యింది. అనేక మంది తమ ఉన్నతమైన అభిప్రాయాలను తెలుపుతూ ఈ ఫొటోకు కామెంట్ల రూపంలో పంపుతున్నారు కూడా. వాళ్లలో ఒకరు ‘మరణించిన తన ఉపాధ్యాయుడి అంత్యక్రియల్లో బ్రెజిల్‌ చైల్డ్‌కు చెందిన ఈ చిత్రం మన జీవితాల్లో అత్యంత భావోద్వేగ చిత్రాల్లో ఒకట'ని అభివర్ణించారు. మరొకరేమో ‘నిజానికి ఈ భూప్రపంచంలో కేవలం టీచర్లు మాత్రమే మానవత్వాన్ని కాపాడే సామర్ధ్యం కలిగినవారని, తన హృదయం పూర్తిగా బద్ధలైనట్లు అతని కళ్లు చెబుతున్నాయ'ని ఇంకొకరు కామెంట్‌ చేశారు.

చదవండి: ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

మరిన్ని వార్తలు