కలిస్తే ఖబడ్దార్‌.. తైవాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చైనా

30 Mar, 2023 11:23 IST|Sakshi

బీజింగ్‌: తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్‌ ‌ అధ్యక్షురాలు  సాయ్ ఇంగ్-వెన్ ప్రస్తుతం దౌత్యపరమైన ఒప్పందాల కోసం మధ్యఅమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే.. దేశ అంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో అగ్రరాజ్యంతో చర్చిస్తే.. చూస్తూ  ఊరుకోబోమని డ్రాగన్‌ హెచ్చరించింది. అంతేకాదు.. పర్యటనకు ముందు సాయ్‌ చేసిన వ్యాఖ్యలను ధిక్కార స్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది.  

సాయ్ ఇంగ్-వెన్ పర్యటనకు ముందు మాట్లాడుతూ..  తైవాన్‌కు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు(చైనాను ఉద్దేశించి..) ఈ మేరకు ఎలాంటి ప్రభావం తమపై చూపలేదంటూ వ్యాఖ్యానించారు.  మరోవైపు ఆమె మధ్యలో కాలిఫోర్నియాను సందర్శించాల్సి ఉండగా.. యూఎస్‌ హౌజ్‌ స్పీకర్‌ కెవిన్‌ మెక్‌కార్థీతో భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అయితే.. ఈ భేటీ పరిణామంపై డ్రాగన్‌ కంట్రీ తీవ్రంగా స్పందించింది. 

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ మాట్లాడుతూ.. ఒకవేళ తైవాన్‌ అధ్యక్షురాలు గనుక అమెరికా చట్టసభ స్పీకర్‌ను కలిస్తే మాత్రం పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని, ఇది చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశంగా భావించక తప్పదని పేర్కొంది. మరోవైపు సాయ్ ఇంగ్-వెన్ వ్యాఖ్యపైనా చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను, చర్యలను బీజింగ్‌ వర్గాలను రెచ్చగొట్టడం కిందే చూడాల్సి వస్తుందని, ప్రతీకార చర్యలు తప్పవని,  తర్వాతి పరిణామాలకు తైవాన్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు