50 లక్షల మంది బలి

2 Nov, 2021 06:12 IST|Sakshi

రెండేళ్లలోపే భారీ స్థాయిలో నమోదైన కోవిడ్‌ మరణాలు

వాషింగ్టన్‌: ప్రపంచంలో తొలిసారిగా వెలుగు చూసిన నాటి నుంచి కేవలం రెండేళ్లలోపే కరోనా మహమ్మారి తన కరాళ నృత్య విశ్వరూపాన్ని చూపించింది. కరోనా రక్కసి కోరలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 50లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య అమెరికాలోనే శాన్‌ ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజిలెస్‌ నగరాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. 1950 ఏడాది నుంచి ప్రపంచంలో వేర్వేరు చోట్ల పలు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో కారణంగా నమోదైన మరణాల కంటే కూడా కోవిడ్‌ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఓస్లోలోని శాంతి అధ్యయన సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

భూమండలంపై హృద్రోగం, గుండెపోటుతర్వాత కోవిడ్‌ ఊహకందని స్థాయిలో ప్రాణాలను హరిస్తూ మూడో అతిపెద్ద ప్రాణాంతక వ్యాధిగా అవతరించిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. నిజానికి ఈ అరకోటి మరణాల సంఖ్య అనేది చాలా తక్కువ అని ఒక వాస్తవిక వాదన ప్రపంచమంతటా వినిపిస్తోంది. అత్యల్ప స్థాయిలో జరుగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కోవిడ్‌ తొలినాళ్లలో సమాజం వెలివేస్తుందనే భయంతో ఇంట్లో కరోనాకు సొంత వైద్యం ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు లక్షల్లో ఉంటారనే అభిప్రాయం జనాల్లో ఉంది.

ప్రజారోగ్య వ్యవస్థ అధ్వాన్నంగా ఉండే పేద దేశాలనే కాదు పౌరుల ఆరోగ్యంపై లక్షల కోట్లు ఖర్చుచేసే సంపన్న దేశాలనూ కోవిడ్‌ కుదిపేసింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌ వంటి సంపన్న దేశాలు కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఒక్క అమెరికాలోనే 7.40లక్షలకు పైగా కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. ‘ మన జీవన మార్గాన్ని నిర్ణయించే కాలమిది. 50లక్షల మంది బలైపోయారనేది ఇకపై గతం. మరో అరకోటి మందిని కోవిడ్‌కు బలికాకుండా ఎలా ఆపాలి? అనేదే మన ముందున్న అసలు సవాలు’ అని అమెరికాలో యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆల్బర్ట్‌ కో హెచ్చరించారు. కోవిడ్‌పై అపోహలు, అపనమ్మకాలు, తప్పుడు సమాచారం సమాజంలో రాజ్యమేలుతుండటంతో కొన్ని దేశాల్లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నత్తనడకన సాగుతోంది.

మరిన్ని వార్తలు