Sri Lanka: లంక ఘోర ఆర్థికసంక్షోభం.. అర్ధరాత్రి అధ్యక్ష భవనం ముందు హింస!

1 Apr, 2022 07:47 IST|Sakshi

శ్రీ లంక పెను ఆర్థిక సంక్షోభం హింసాత్మకంగా మారుతోంది. అధ్యక్ష భవనం ప్రజా ముట్టడిలో  రణరంగాన్ని తలపించింది. గురువారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో ఓ పోలీస్‌ వాహానానికి నిప్పు అంటించడంతో పాటు పలు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ప్రతిగా పోలీసులు జరిపిన దాడిలో పలువురు పౌరులు గాయపడినట్లు తెలుస్తోంది. 

శ్రీ లంకను ప్రస్తుతం పెను ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. కరోనా నుంచి మొదలైన ఈ పరిస్థితి.. ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. టూరిజానికి భారీ దెబ్బ పడడం, అప్పుల ఊబిలో చిక్కుకుపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీటికి తోడు మార్చి 2020లో దిగుమతుల్ని నిషేధిస్తూ.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లంక పాలిట శాపంగా మారింది. ఫారిన్‌కరెన్సీని పొదుపు చేసి.. 51 బిలియన్‌ డాలర్ల అప్పుల్ని తీర్చాలన్న ప్రభుత్వ ఆలోచన బెడిసి కొట్టింది.

నిత్యావసరాల కొరత, నిజంగానే ఆకాశాన్ని అంటిన ధరలు.. ఆఖరికి మంచి నీళ్లు కూడా బ్లాక్‌లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. పేపర్లు లేక పిల్లల పరీక్షలను సైతం వాయిదా వేశారంటే.. లంక సంక్షోభాన్ని అంచనా వేసుకోవచ్చు. మరోవైపు సరుకుల కోసం దొపిడీలకు పాల్పడుతున్నారు పలువురు పౌరులు. పరిస్థితులు తట్టుకోలేక దేశం దాటి పోతున్నారు మరికొందరు. అయితే ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడినా కూడా అధ్యక్షుడు గోటబయ రాజపక్స Gotabaya Rajapaksa పట్టన్నట్లు ఉండడంపై ప్రజాగ్రహాం పెల్లుబిక్కింది. 

గురువారం అర్ధరాత్రి ర్యాలీగా వెళ్లిన వేల మంది.. కొలంబోలోని అధ్యక్ష భవనం ముందు చేరి నిరసనలు చేపట్టారు. రాజీనామా డిమాండ్‌ నినాదాలతో హోరెత్తించారు. ఒకానొక తరుణంలో ఐదు వేలమందికి పైగా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు నిరసనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేయగా.. హింస చెలరేగింది. పోలీసుల మీదకు రాళ్లు, బాటిళ్లు రువ్వారు నిరసనకారులు. దీంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యానన్‌లు ప్రయోగించారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. 

పోలీసులను ప్రతిఘటిస్తూ.. రాత్రంతా అధ్యక్ష భవనం ముందే నిరసన వ్యక్తం చేస్తూ ఉండిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల ప్రతిదాడిలో పలువురు పౌరులు గాయాలపాలయ్యారు. అయితే నిరసన సమయంలో అధ్యక్షుడు ఇంట్లో లేడని తెలుస్తోంది. ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణకు సంబంధించి 45 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరిస్థితిని అడ్డుకుని ఉండకపోతే అధ్యక్ష భవనంపై దాడి చేసేవాళ్లని తెలిపారు. 

కుటుంబ పాలనతో సర్వనాశనం చేస్తున్నాడంటూ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడు కాగా, అతని సోదరుడు మహీంద రాజపక్సా ప్రధానిగా ఉన్నాడు.  మరో సోదరుడు బసిల్‌ రాజపక్సా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నాడు. పెద్దన్న చామల్‌ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరో బంధువు నమల్‌ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా ఉన్నాడు. 

డీజిల్‌ కొరతతో 22 మిలియన్ల మంది 13 గంటలపాటు చీకట్లో ఉండిపోయారు. వేల కొద్దీ వాహనాలు రోడ్ల మీదే నిలిచిపోయాయి.  మందులు లేక ఆపరేషన్లను సైతం ఆపేశారు. గత కొన్ని రోజులుగా లంక దుర్భేద్యమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అయితే బయటి దేశాల నుంచి అప్పులు తెచ్చి అయినా సరే పరిస్థితిని అదుపులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేస్తోంది.

మరిన్ని వార్తలు