వారం రోజులు.. 14 గంటలపాటు డెలివరీలు.. కూర్చున్న చోటే కుప్పకూలి కన్నుమూశాడు

25 Nov, 2022 21:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పండుగ సీజన్‌లను క్యాష్‌ చేసుకోవడం ఈ-కామర్స్‌ సంస్థలకు అలవాటైన పనే. అదే సమయంలో డెలివరీ ఏజెంట్‌లకు కూడా చేతి నిండా పని ఉంటుంది కూడా. అయితే ఆ పని హద్దులు దాటిపోతే. కంపెనీ ఇచ్చే టార్గెట్‌ను రీచ్‌ కావాలనే ఆత్రుతతో హక్కులు లేని గిగ్‌ సెక్టార్‌ ఉద్యోగులు తీవ్రంగా పని చేస్తుంటారు. సరిగా ఇలాంటి ఘటనే ఓ డెలివరీ ఏజెంట్‌ ప్రాణం తీసింది.  

ఆ డెలివరీ ఏజెంట్‌.. ఆర్డర్‌లను కస్టమర్లకు అందించడానికి యత్నించాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేశాడు. రోజుకు 14 గంటలపాటు ఒక వారం రోజులు పని చేశాడు. విరామం లేకుండా పని చేసే సరికి బాడీ అలిసిపోయింది. చివరకు ఆ వ్యాన్‌లోనే హ్యాండిల్‌పై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 

యూకేలో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న వారెన్ నోర్టన్ (49).. డైనమిక్ పార్సిల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్‌ల డెలివరీ చేస్తున్నాడు. ఇందుకోసం రెండేళ్లుగా తన వ్యాన్‌ను ఉపయోగించుకుంటున్నాడు. అయితే.. బ్లాక్ ఫ్రైడే తరుణంలో విపరీతమైన ఆర్డర్‌లు రావడంతో విరామం ఎరుగకుండా పని చేశాడు. రోజులో 14 గంటలు ఆర్డర్‌లు డెలివరీ చేస్తూనే ఉన్నట్టు తెలుస్తున్నది. అలా ఓ వారంపాటు డెలివరీ చేస్తూనే ఉన్నాడు.

ఈ క్రమంలో.. బుధవారం ఉదయం వ్యానులో డెలివరీకి వెళ్లిన ఆయన.. అలాగే స్టీరింగ్‌పై కుప్పకూలి పోయాడు. అది గమనించిన ఓ కస్టమర్‌.. డోర్‌ తెరవడంతో సరాసరి రోడ్డు మీదకు పడిపోయాడు. వెంటనే సీపీఆర్‌ ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. సదరు కంపెనీకి సమాచారం అందించడంతో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. 

పని ఒత్తిడితోనే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పరిమితికి మించి పని చేయడంతోనే అతను చనిపోయినట్లు ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిలర్లు చెప్తున్నారు. అయితే.. ఆ కంపెనీ మాత్రం పని ఒత్తిడి ఆరోపణలను కొట్టేసింది. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటామని చెబుతూ.. వారెన్‌ నోర్టన్‌ మృతిపై మొక్కుబడిగా ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు