ఆందోళన వద్దు, మంకీపాక్స్-చికెన్‌పాక్స్‌ తేడాలు తెలుసుకోండి ఇలా..

1 Aug, 2022 20:53 IST|Sakshi

కరోనా కథ తగ్గుముఖం పడుతుందనుకున్న టైంలో..  మంకీపాక్స్ వైరస్ కలకలం మొదలైంది. కేవలం ఆఫ్రికాకు మాత్రమే పరిమితం అయ్యిందనుకున్న ఈ వైరస్‌.. యూరప్‌, అమెరికా ఖండాల్లో కేసులతో కలకలం రేపుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ కేసులు వెలుగు చూస్తుండడం, తాజాగా కేరళలో ఒక మరణం నమోదు కావడంతో ఆందోళన మొదలైంది.

మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలతో కలకలం.. అంటూ నిత్యం ఏదో మూల దేశంలో ఇప్పుడు ఇది వినిపిస్తోంది. దీనికి తోడు వ్యాధి లక్షణాలు కనిపించిన వాళ్లకు.. మంకీపాక్స్‌ సోకిందేమో అని అధికారులు హడలిపోతుండడం, వైరస్‌ నిర్ధారణకు శాంపిల్స్‌ను పంపిస్తుండడం.. చూస్తున్నాం. అయితే నెగెటివ్‌గా తేలిన కేసులన్నీ చాలావరకు చికెన్‌పాక్స్‌ కావడం ఇక్కడ అసలు విషయం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్‌, యూపీ.. ఇలా చాలా చోట్ల వైరస్‌ భయంతో పరీక్షించగా.. నెగెటివ్‌గా తేలడం, అవన్నీ చికెన్‌పాక్స్‌ కేసులు కావడం గమనార్హం. అయితే.. 

మంకీపాక్స్ లక్షణాలు చాలా వరకు చికెన్ పాక్స్ తరహాలోనే ఉండటంతో గందరగోళం నెలకొంటోంది. వర్షాల నేపథ్యంలో చికెన్ పాక్స్ విస్తరిస్తుండడంతోనే ఇదంతా. పైగా లక్షణాలు కూడా ఒకేలా ఉండడంతో కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. చికెన్ పాక్స్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుండడమే అందుకు కారణం. రెండింటి తేడా తెలుసుకుంటే.. కొంతవరకు ఆందోళన తగ్గవచ్చు.


చికెన్ పాక్స్‌ లక్షణాలు

► ముందుగా చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. 

► ఆ తర్వాత జ్వరం లక్షణం కనిపిస్తుంది.

► చికెన్ పాక్స్ లో దద్దుర్లు కాస్త చిన్నగా ఉంటాయి. విపరీతంగా దురద ఉంటుంది.

► అరచేతులు, పాదాల దిగువన దద్దుర్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ.

► చికెన్ పాక్స్ వల్ల ఏర్పడే దద్దుర్లు..పొక్కులు ఏడెనిమిది రోజుల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి.


మంకీపాక్స్ లో ..

► మంకీపాక్స్ సోకిన వారిలో ముందుగా జ్వరం, తలనొప్పి, కొందరిలో దగ్గు, గొంతు నొప్పి, లింఫ్ నాళాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

► సుమారు నాలుగు రోజుల తేడాలో చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. 

► మంకీపాక్స్‌లో దద్దుర్లు పెద్దగా ఉంటాయి. దురద ఎక్కువగా ఉండదు.

► పొక్కులు ముందుగా చేతులు, కళ్ల వద్ద ఏర్పడి.. తర్వాత శరీరమంతా విస్తరిస్తాయి. 

► మంకీ పాక్స్ లో అర చేతులు, పాదాలపైనా దద్దర్లు వస్తాయి.

► చాలా మందిలో 21 రోజుల వరకు కూడా అవి ఏర్పడుతూనే ఉంటాయి.

► జ్వరం కూడా ఎక్కువ రోజుల పాటు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఇక.. 

ఆందోళన వద్దు, కానీ..
మంకీ పాక్స్, చికెన్ పాక్స్ రెండూ కూడా ప్రమాదకరం కాదని, మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండింటిలో దేని లక్షణాలు గుర్తించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఒక్కోసారి వ్యక్తుల రోగ నిరోధక శక్తిని(ఇమ్యూనిటీ) బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఏ అనారోగ్యమైనా సరే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు