శ్రీలంక కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు.. భారత్‌ మద్దతుకు హామీ!

1 Aug, 2022 21:08 IST|Sakshi

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు దినేశ్‌ గుణవర్దెన. ఈ క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు భారత్‌ నుంచి మద్దతు కొనసాగుతుందని భరోసా కల్పించారు. ఆ దేశం ఆర్థికంగా పుంజుకుంటుందని, ప్రజల జీవనం సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు. ఈ మేరకు కొలంబోలోని భారత్‌ హైకమిషన్‌ ట్వీట్‌ చేసింది. 

‘ప్రధాని గుణవర్ధెనకు భారత ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. తమ పొరుగు దేశమైనందున శ్రీలంక ప్రజలకు భారత్‌ నుంచి మద్దతు కొనసాగుతుందని భరోసా కల్పించారు. అలాగే.. ఆర్థికంగా త్వరగా పుంజుకుంటుందని, సుసపన్నత, ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందని ఆకాంక్షించారు.’ అని పేర్కొంది హైకమిషన్‌. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకకు సాయం చేయటంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. అవసరమైన సమయంలో సాయం చేసే దేశాల జాబితాలో కచ్చితంగా ఉంటుంది. 2022 ప్రారంభం నుంచి శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రజలకు నిత్యావసరాలు సైతం దొరకనంత దుర్భర పరిస్థితి నెలకొంది. ప్రజాగ్రహంతో గొటబయ రాజపక్స రాజీనామా చేయగా.. రణీల్‌ విక్రమ సింఘే ఆ పదవిని చేపట్టారు. ప్రధానిగా దినేశ్‌ గుణవర్ధెనను నియమించారు.

ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: సింగపూర్‌లో ‘గొటబయ’కు ఊహించని షాక్‌.. క్రిమినల్‌ కేసు నమోదు!

మరిన్ని వార్తలు