కాన్సులేట్‌ సేవలు నిలిపేసిన కెనడా

21 Oct, 2023 06:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌ప్రీత్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయమై భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా 41 మంది దౌత్యవేత్తలను దేశం వీడాల్సిందిగా కేంద్రం ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్‌ పర్సన్‌ సేవలను నిలిపేయాలని కెనడా నిర్ణయించింది.

విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం ప్రకటించారు. 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలవాల్సి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడ్డ కారణంగా ఈ చర్యకు దిగాల్సి వచి్చందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు మాత్రమే భారత్‌లో ఉన్నట్టు వివరించారు. భారత్‌లో థర్డ్‌ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా కొనసాగుతున్న 10 వీసా దరఖాస్తు కేంద్రాలపై  తమ  నిర్ణయం  ప్రభావం పడబోదని తెలిపారు. ఇంతేకాకుండా, చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్‌ పర్సన్‌ సేవలను నిలిపేయడమే గాక, ఆ నగరాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కెనడా తాజాగా తమ పౌరులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది.  

మరిన్ని వార్తలు