టెలిఫోన్లలో ఎన్ని రకాలో తెలుసా?

3 Mar, 2021 16:05 IST|Sakshi

తమ యొక్క పరిశోధనలతో మానవ జాతికి మహోపకారం చేసిన మహనీయులలో అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ ఒకరు. టెలిఫోన్‌ను రూపొందించి సమాచార రంగంలో గొప్ప విప్లవానికి గ్రహంబెల్‌ నాంది పలికారు. ఈయన 1847వ సంవత్సరం మార్చి 3న ఇంగ్లాండులో జన్మించారు. ఇంగ్లాండ్‌, జర్మనీ దేశాలలో గ్రహంబెల్‌ విద్యాభ్యాసం జరిగింది. ఒకేసారి అనేక సందేశాలను శబ్దరూపంలో పంపడానికి నిర్విరామంగా కృషి చేశారు. టెలిఫోన్‌ కనుగొనడమే తన యొక్క జీవిత ఆశయంగా నిర్ణయించుకొని, తన ఆరోగ్యాన్నికూడా లెక్క చేయకుండా పరిశోధనలు జరిపాడు. చివరికి 1876వ సంవత్సరంలో తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడారు. 

ఈ విధంగా మానవుని జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన ఒక అద్భుతమైన పరికరం రూపొందించబడింది. ఈ పరికరం నేడు మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ ఫోన్ల రూపంలో అనేక విషయాలు, సమాచారాన్ని నిమిషాలలో మనకు అందిస్తోంది. ఇప్పడు అయితే అరచేతిలో పట్టే స్మార్ట్ మొబైల్స్ వచ్చాయి గానీ కిందటి మొబైల్స్ చరిత్ర తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోతాం. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్ జయంతి సందర్బంగా వాటి గురుంచి తెలుసుకుందాం.

హ్యాండ్ క్రాన్క్ టెలిఫోన్: 1880ల్లో ఈ హ్యాండ్ క్రాంక్ టెలిఫోన్లు వాడేవారు. ఇది చాలా పెద్దగా ఉండటమే కాదు దీనితో కాల్స్ చేయడం కూడా కష్టంగానే ఉండేది. 

కాండిల్ స్టిక్ టెలిఫోన్: పదేళ్లు తర్వాత 1890లోకి వచ్చేసరికి సౌకర్యవంతమైన ఫోన్ వచ్చింది. ఈ క్యాండిల్ స్టిక్ ఫోన్ అప్పట్లో బాగా ఆదరణ పొందింది.

డెస్క్ టాప్ రోటరీ టెలిఫోన్: కొంత కాలం తర్వాత 1920లోకి వచ్చేసరికి అనుకూలమైన డెస్క్‌టాప్ రోటరీ టెలిఫోన్‌ను తయారుచేశారు. పాత సినిమాల్లో ఇది బాగా కనిపిస్తుంది.

టచ్ టోన్: డెస్క్ టాప్ రోటరీ ఫోన్ చాలా కాలం నిలబడింది. అయితే, నంబర్ల కోసం మధ్యలోని రింగ్ అదే పనిగా తిప్పడం కష్టమవుతుంటే చాలా పరిశోధనల అనంతరం 1960లో టచ్ టోన్ ఫోన్లను తెచ్చారు. దింతో కాల్ చేయడం తేలికైపోయింది. 

వాల్ టచ్ టోన్: ఎప్పుడైతే టచ్ టోన్ ఫోన్ వచ్చిందో అది మరో సంచలన ఆవిష్కరణగా మారింది. ఆ తర్వాత పదేళ్లకే అంటే 1970ల్లో గోడకు తగిలించే వాల్ టచ్ టోన్ ఫోన్ వచ్చేసింది. ఇది టెలిఫోన్ రంగాన్ని మరో ముందు అడుగు వేయించింది.

కార్డ్‌లెస్  ఫోన్: 1980ల్లో అంటే టెలిఫోన్ కనిపెట్టిన వందేళ్లకు టెలిఫోన్ చరిత్రలో మరో అద్భుత ఆవిష్కరణ వచ్చింది. అదే కార్డ్‌లెస్ ఫోన్. అప్పటివరకూ ఫోన్‌కి కార్డ్(వైర్) తప్పని సరి అయ్యేది. ఇవి వచ్చాక ఇక ఇల్లంతా తిరుగుతూ మాట్లాడే అవకాశం రావడంతో ప్రజలు ఎంతో సంతోష పడ్డారు. 

మొబైల్ ఫోన్: కార్డ్ లెస్ ఫోన్ వచ్చిన మూడేళ్లకే మొదటి మొబైల్ ఫోన్ 1983లో వచ్చేసింది. ఇక ఆ తర్వాత మొబైల్ ఫోన్ల రూపు రేఖలు చాలా వేగంగా మారిపోతూ వచ్చాయి. 

స్మార్ట్ మొబైల్స్: గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రాకతో మొబైల్స్‌లో మరో సంచలనంగా మారిపోయింది. ఇప్పడు వాటిలోనూ చాలా మార్పులొస్తున్నాయి. నాలుగైదు కెమెరాలతో రెవల్యూషన్ సృష్టిస్తున్నాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు