ఈయూలోకి ఉక్రెయిన్‌!

18 Jun, 2022 05:32 IST|Sakshi

ఈయూ కమిషన్‌ సిఫార్సు 

వచ్చే వారం లోతుగా చర్చ

కీవ్‌: యూరోపియన్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించాలని ఈయూ కమిషన్‌ శుక్రవారం సిఫార్సు చేసింది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్‌ అధినేతలు గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్‌ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్‌ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఈయూ కమిషన్‌ సిఫార్సుపై వచ్చే వారం బ్రస్సెల్స్‌లో 27 సభ్యదేశాల నాయకులు సమావేశమై, చర్చించనున్నారు. అన్ని దేశాల నుంచి అంగీకరించే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఖరారైనట్లే. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, కార్యరూపం దాల్చడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

యూరప్‌ దేశాలకు గ్యాస్‌ సరఫరాలో కోత  
రష్యా మరోసారి యూరప్‌ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. ఇటలీ, స్లొవేకియాకు సగం, ఫ్రాన్స్‌కు పూర్తిగా కోత విధించింది. దాంతో జర్మనీ, ఆస్ట్రియా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూరప్‌లో ఇంధనం ధరలు, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది.  యూరప్‌ దేశాల్లో విద్యుత్‌ ఉత్పత్తికి రష్యా నుంచి సరఫరా అయ్యే గ్యాస్‌ చాలా కీలకం.

ఉక్రెయిన్‌లో బ్రిటిష్‌ ప్రధాని
బ్రిటిష్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ శుక్రవారం ఉక్రెయిన్‌ పర్యటన ప్రారంభించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కీవ్‌కు మరోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన తర్వాత బోరిస్‌ జాన్సన్‌ ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను జాన్సన్‌ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు. బ్రిటిన్‌ ఇప్పటికే కోట్లాది పౌండ్ల సాయాన్ని ఉక్రెయిన్‌కు అందజేసింది.

మరిన్ని వార్తలు