చైనా వార్నింగ్‌తో అలర్ట్‌.. తైవాన్‌ చుట్టూ అమెరికా యుద్ధ నౌకల మోహరింపు

2 Aug, 2022 15:14 IST|Sakshi

తైపీ: అమెరికా, చైనాల మధ్య ‘తైవాన్‌’ రగడ తారస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ నాలుగు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్‌లో పర్యటిస్తారన్న వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది. తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, తమ సైన్యం చూస్తూ కూర్చోదని ఇప్పటికే హెచ్చరించింది చైనా. డ్రాగన్‌ హెచ్చరికలతో అప్రమత్తమైంది అమెరికా. స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది. అందులో యుద్ధ విమానాలను మోసుకెళ్లే నౌక సైతం ఉంది.

తైవాన్‌, ఫిలిప్పీన్స్‌కు తూర్పున, జపాన్‌కు దక్షిణాన ఫిలిప్పీన్స్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌ను మోహరించినట్లు అగ్రరాజ్య నౌకాదళ అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఈ రీగన్‌ నౌక.. గైడెడ్‌ మిసైల్స్‌, యూఎస్‌ఎస్‌ రాకెట్లు, నౌకా విధ్వంసక మిసైల్స్‌ వంటివి కలిగి ఉన్నట్లు చెప్పారు. ఈ మోహరింపు సాదారణ ప్రక్రియలో భాగమేనని, అయితే.. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందన్నారు. మరోవైపు.. యూఎస్‌ఎస్‌ త్రిపోలీ నౌక సైతం గత మే నెలలోనే సాన్‌డియాగో నుంచి బయలుదేరిందని, తైవాన్‌ సమీపంలోకి చేరుకున్నట్లు చెప్పారు.

చైనాపై మొదటి నుంచే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు స్పీకర్‌ నాన్సీ పెలోసీ. మంగళవారం రాత్రికి తైవాన్‌లోని తైపీకి చేరుకుంటారని సమాచారం. పెలాసీ పర్యటనపై చైనా చేస్తున్న హెచ్చరికలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది అమెరికా. అయితే.. పెలోసీ పర్యటన నేపథ్యంలోనే తైవాన్‌కు ఇరువైపులా యుద్ధ నౌకలను మోహరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు.. తైవాన్‌కు అతి సమీపంలోకి చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు మోహరించటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాతో స్నేహం చేసి తైవాన్‌ యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్‌ తకరారు.. ఏమిటీ వివాదం?

మరిన్ని వార్తలు