తైవాన్‌ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ

30 Aug, 2023 01:40 IST|Sakshi

ఫాక్స్‌కాన్‌ ఫౌండర్‌ రాకతో అధికార పార్టీ కి ముక్కోణపు పోటీ

చివరికి దానికే లాభిస్తుందని అంచనాలు

ఐ ఫోన్‌ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్‌ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ...

తైవాన్‌కు చెందిన 72 ఏళ్ల టెర్రీ
అపర కుబేరుడు. ఐ ఫోన్‌ తయారీ సంస్థ ఫాక్స్‌ కాన్‌ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు.  

బరిలో ఆ ముగ్గురు...
అధ్యక్షుడు సై ఇంగ్‌ వెన్‌కు ఇది రెండో టర్మ్‌. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్‌ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార  డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్‌ తే బరిలో దిగుతున్నారు.

ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్‌ టాంగ్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్‌ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్‌ యూ ఇయ్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది.  

మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్‌ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్‌ పీ సిటీ మేయర్‌గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్‌ దూసుకుపోతున్నారు.

ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ
నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్‌ డెస్క్, సాక్షి

  • తైవాన్‌ ఇంజనీరింగ్‌ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్‌ కాన్‌ (హాన్‌ హై ఇండస్ట్రీస్‌)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్‌ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు.
  • ఈ మోడల్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. ఎంతగా అంటే, యాపిల్‌ తన మాక్‌ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్‌ కాన్‌కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ.
  • దాంతో ఫాక్స్‌ కాన్‌ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది.
  • తైవాన్‌ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్‌ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్‌ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే  
  • పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్‌ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి.
  • ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది.
  • కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు