గూగుల్‌ను వీడిన ఏఐ గాడ్‌ఫాదర్‌

3 May, 2023 03:31 IST|Sakshi

వాషింగ్టన్‌: గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గా పేరొందిన జెఫ్రీ హింటన్‌(75) టెక్‌ దిగ్గజం గూగుల్‌కు రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీబీసీతో మాట్లాడారు. కృత్రిమ మేధతో కలిగే ముప్పుపై ఇకపై స్వేచ్ఛగా మాట్లాడుతానన్నారు.

‘‘ప్రస్తుతానికి కృత్రిమ మేధ మనుషుల కంటే తెలివైందేమీ కాదు. కానీ, త్వరలోనే వారిని మించిపోవచ్చునన్నారు. అదే పెద్ద ప్రమాదం’’ అని హెచ్చరించారు. ‘‘సాధారణ పరిజ్ఞానం విషయంలో అవిప్పటికే మనుషులను దాటేశాయి. తార్కిక జ్ఞానం విషయంలోనూ త్వరలోనే మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగాల తొలగింపునకు కారణమవుతుంది. ఏది నిజమో తెలుసుకోలేని ప్రపంచాన్ని సృష్టించే సామర్థ్యం ఏఐకి ఉంది’అని హింటన్‌ హెచ్చరించారు.

ఫేక్‌ ఫొటోలు, నకిలీ సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఈ సాంకేతికత దుర్వినియోగాన్ని అడ్డుకోవడం కూడా చాలా కష్టమని చెప్పారు. గూగుల్‌ ఏఐ పరిశోధనల్లో హింటన్‌ ఏళ్లుగా పాలుపంచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు