బీజేపీ, ఆరెస్సెస్‌లతో భారత్‌కు ప్రమాదం

19 Jul, 2021 04:20 IST|Sakshi

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ విమర్శలు

ఇస్లామాబాద్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే) శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల విధానం మొత్తం భారత్‌కే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ, ఆరెస్సెస్‌ల సైద్ధాంతిక విధానంతో మొత్తం భారత్‌కే ముప్పు కలుగుతుంది. వారు ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకోరు. వారు క్రిస్టియన్లను, సిఖ్‌లను, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలను కూడా తమ వేధింపులకు లక్ష్యంగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ వర్గాలను వారు తమతో సమానులుగా భావించరు’ అని ఇమ్రాన్‌ విమర్శించారు. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్లో కశ్మీరీలపై వేధింపులు మరింత పెరిగాయన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపై తాను కశ్మీరీల తరఫున బ్రాండ్‌ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నానన్నారు. కశ్మీరీల న్యాయమైన పోరాటంలో పాకిస్తాన్‌ వారికి తోడుగా ఉంటుందన్నారు. జులై 25న పీఓకేలో ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు