భారత సంతతి వ్యక్తికి ఆరుసార్లు ఆగిన గుండె.. ఆ తర్వాత ఏమైందంటే?

5 Oct, 2023 21:22 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌లో లండన్‌ నగరంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. లండన్‌ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి భారతీయ-అమెరికన్‌ విద్యార్థి ప్రాణాలు కాపాడారు. ఏకంగా ఆరుస్లార్లు ఆగిపోయిన గుండెకు ఆపరేషన్‌ చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఈ ఘటన బ్రిటన్‌ సహా భారత్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. అమెరికాలోని సీటెల్‌కు చెందిన అతుల్ రావ్, ఈ ఏడాది జూలై 27న లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదువుతున్నప్పుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అది వచ్చే వరకు సెక్యూరిటీ గార్డు సీపీఆర్‌ కొనసాగించాడు. వెంటనే అంబులెన్స్‌లో హామర్‌స్మిత్‌ హాస్పిటల్‌కు తరలించారు.కాగా, అతుల్‌ రావ్‌ ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె నుంచి రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్దారించారు. పల్మనరీ ఎంబోలిజం అని పిలిచే ఈ పరిస్థితిలో అతడి గుండె ఆరు స్లార్లు ఆగినట్లు వైద్యులు తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రి డాక్టర్లు రాత్రంగా శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు. మరుసటి రోజున సెయింట్ థామస్ హాస్పిటల్‌కు తరలించి ఎక్మోపై చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం టెక్సాస్‌లోని బేలర్ యూనివర్సిటీలో ప్రీ మెడికల్‌ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు. మరోవైపు, భారతీయ-అమెరికన్‌ విద్యార్థి అతుల్‌ రావ్‌ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి లండన్‌ వెళ్లాడు. ఈ సందర్భంగా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తులు, ఆసుపత్రిని సందర్శించాడు. తల్లిదండ్రులతో కలిసి అక్కడి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. 

మరిన్ని వార్తలు