విమాన ప్రమాదాలకు కేంద్ర బిందువుగా ఆ దేశం?

17 Jan, 2021 10:48 IST|Sakshi

ఆసియాలోనే అత్యధిక విమాన ప్రమాదాలు ఇక్కడే

జకార్తా : ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే 62 మంది ప్రయాణీకులతో నట్టనడి సంద్రంలో మునిగిపోయిన ఇండోనేషియా విమాన ప్రమాద ఘటన మరో మారు ఆ దేశ వైమానిక పరిశ్రమ భద్రతను చర్చనీయాంశంగా మార్చింది. నిజానికి అసలెందుకు ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయనే ప్రశ్నను ఈ ప్రమాదం లేవనెత్తింది. ఆసియాలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇండోనేషియా రికార్డులు అత్యంత దారుణంగా ఉన్నాయి. 1945 నుంచి ఏ ఇతర దేశాల్లో జరగనన్ని పౌర విమాన ప్రమాదాలు ఇండోనేషియాలోనే జరిగాయి. గతంలో జరిగిన ప్రమాదాలన్నీ పైలెట్‌ శిక్షణా లోపంతో జరిగాయి. లేదా సాంకేతిక లోపం, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సమస్యలు, లేదంటే విమానాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల జరిగాయి. ఇటీవలి కాలంలో ఇండోనేషియా పౌర విమానయాన సంస్థ పరిస్థితి మెరుగైందని నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ తాజా ఘటన ఇండోనేషియా వైమానిక సంస్థ పర్యవేక్షణ, నియంత్రణలోని లోపాలను పట్టిచూపుతోంది.  

ఇక్కడి ప్రమాదాలకు కారణమేమిటి? 
ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణమేమిటి అనేదే ఇప్పుడు సర్వత్రా వినపడుతోన్న ప్రశ్న. అయితే దీనికి ఆర్థిక, సామాజిక, భౌగోళిక సమస్యలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 1990 చివర్లో దశాబ్దాల నిరంకుశత్వం తరువాత సుహార్తో ప్రభుత్వం పడిపోయిన తరువాత ప్రారంభంలో విమానయాన సంస్థ బాగా అభివృద్ధిపథంలో నడిచింది. అయితే ఆ తరువాత ఈ రంగంలో శ్రద్ధ లోపించింది. ఇండోనేషియాలోని చాలా ప్రాంతాలు నాణ్యమైన, విమానయానానికి అనుకూలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేనప్పటికీ, తక్కువ ధరల్లోనే ప్రయాణీకులను తీసుకెళ్ళే వైమానిక వ్యవస్థ దేశంలో సర్వసాధారణ రవాణా వ్యవస్థగా మారింది.  వైమానిక భద్రతా నెట్‌వర్క్‌ గణాంకాలను బట్టి ఇండోనేషియాలో 104 పౌర విమానయాన ప్రమాదాలు జరిగాయి. 1945 నుంచి ఇప్పటి వరకు 13,00 మంది పౌరులు మరణించారు. ఏషియాలోనే విమానయానాల్లో అత్యంత ప్రమాదకర దేశంగా ఇండోనేషియాని భావిస్తున్నారు.

 పరిస్థితులు మెరుగుపడ్డాయా? 
చాలా వరకు పరిస్థితులు మెరుగుపడ్డాయని, పర్యవేక్షణ సైతం కఠినతరం చేసినట్టు ఏవియేషన్‌ నిపుణులు ఎయిర్‌లైన్స్‌ రేటింగ్స్‌.కామ్‌ జియోఫ్రే థామస్‌ మీడియాకి వెల్లడించారు. కచ్చితమైన నియంత్రణా పద్ధతులూ, తరచూ విమానాల పనితీరుని పర్యవేక్షించడం, పైలెట్‌ శిక్షణలను మెరుగుపర్చడం లాంటి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.  
అమరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ సంస్థ, ఇండోనేషియాకి 2016లో ఏ కాటగిరీ రేటింగ్‌ ఇచ్చింది. దీనర్థం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల ప్రమాణాలతో సరితూగే ప్రమాణాలను ఇండోనేషియా వైమానిక పరిశ్రమలు పాటిస్తున్నాయని భావన.

తాజా ప్రమాదం ఎందుకు జరిగినట్టు? 
దీన్ని ఇప్పుడే చెప్పడం కష్టం. విమానం జకార్తా నుంచి భారీ వర్షంలో టేకాఫ్‌ అయ్యింది. అయితే ఫ్లైట్‌ కండిషన్, మానవ లోపంతో పాటు అనేక కారణాల్లో వాతావరణ పరిస్థితులు ఒక కారణం మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం, తమ పడవల చుట్టూ చమురు వెదజల్లినట్టు పడిందని స్థానిక మత్స్య కారులు తెలిపారు. శ్రీవిజయ ఎయిర్‌లైన్స్‌లో ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా జరిగాయని తెలుస్తోంది. 2008లో ఒకసారి హైడ్రాలిక్‌ సమస్య కారణంగా ల్యాండ్‌ అవుతున్న సమయంలో రన్‌వైప్‌ ఒక రైతుని ఢీకొనడంతో అతను మరణించారు. ప్రమాదం జరిగిన బోయింగ్‌ 737–500 విమానం 26 ఏళ్ళనాటిదని, గతంలో అమెరికా నుంచి కూడా దీన్ని నడిపారని, ఇది నాణ్యమైనదని ఎయిర్‌లైన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ జెఫర్సన్‌ ఇర్విన్‌ జౌవేనా తెలిపారు. అయితే ఫ్లైట్‌ నడపడానికి అర్హమైనదేనా కాదా అనే విషయంలో దర్యాప్తు చేయాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.  

అమెరికా బ్యాన్‌
2007 నుంచి 2016 వరకు అమెరికాలోనూ, 2007 నుంచి 2018 వరకు యూరోపియన్‌ యూనియన్‌లోనూ ఆయా దేశాల నుంచి ఇండోనేషియా విమానాలను రద్దు చేశారు. సాంకేతిక నైపుణ్యలోపం, సుశిక్షుతులైన పైలెట్లు లేకపోవడం, పర్యవేక్షణాలోపాలే ఈ దేశాల్లో ఇండోనేషియా విమానాల నిషేధానికి కారణమని తెలిపారు. 

ఎప్పుడు తెలుస్తుంది? 
నీటి నుంచి వెలికితీసిన విమాన శిథాలాల్లో నుంచి కొంత సమాచారం తెలుస్తుంది. సముద్రగర్భంలోని బురదలో బ్లాక్‌బాక్స్‌లను గుర్తించారు. ఫ్లైట్‌ డేటా రికార్డర్, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ నుంచి సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దర్యాప్తునకు కొన్ని వారాలు పడుతుంది. కొన్ని నెలలు కూడా పట్టొచ్చునని ఇండోనేషియా ఏవియేషన్‌ కన్సల్టెంట్‌ జెర్రీ సోజెత్‌మాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు