Anti Hijab Protests: ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ నటి అరెస్ట్‌

18 Dec, 2022 10:44 IST|Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్న వారితో పాటు వారికి మద్దతు తెలుపుతున్న వారిపైనా ఉక్కుపాదం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే వందల మందిని అరెస్ట్‌ చేసి జైళ్లలో వేసింది. పలువురిని బహిరంగంగానే ఉరి తీసిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలినందుకు ప్రముఖ సినీ నటి, ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38)ను అరెస్ట్‌ చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు కారణమవుతున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తస్నిమ్‌ న్యూస్‌ నివేదించింది. 

2016లో ఆస్కార్‌ అవార్డు అందుకున్న ‘ద సేల్స్‌మ్యాన్‌’ ద్వారా నటి తరనేహ్‌ అలిదూస్తి అందరి దృష్టిని ఆకర్షించారు. డిసెంబర్‌ 8న హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు అలిదూస్తి. అదే రోజు మొహ్‌సెన్‌ షేకారి(23) అనే యువకుడిని ఇరాన్‌ బహిరంగంగానే ఉరి తీయటం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదిగా ఓ పోస్ట్‌ చేశారు.‘మీరు మౌనంగా ఉండడం అంటే అణచివేత, అణచివేతదారులకు మద్దతుగా నిలిచినట్లే. ఇలాంటి రక్తపాతాన్ని చూసి ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు ఉండడం మానవత్వానికి అవమానకరం’అని రాసుకొచ్చారు నటి తరనేహ్‌ అలిదూస్తి.

టీనేజ్‌ నుంచి ఇరాన్‌ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నటి తరనేహ్‌ అలిదూస్తి. ఇటీవల విడుదలైన ‘లైలా బ్రదర్స్‌’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 

ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్‌ పోటాపోటీ 

>
మరిన్ని వార్తలు