Israel-Hamas War: ఆ కిరాతకం మీదే..

19 Oct, 2023 05:23 IST|Sakshi
అహ్లీ ఆసుపత్రిలో పేలుడులో బలైన పాలస్తీనియన్ల మృతదేహాలు

అల్‌–అహ్లీ ఆసుపత్రిలో పేలుడుపై ఇజ్రాయెల్‌–హమాస్‌ పరస్పర నిందలు 

మిలిటెంట్ల రాకెట్‌ గురితప్పడం వల్లే ఈ దారుణం  

ఇజ్రాయెల్‌ సైన్యం స్పషీ్టకరణ.. ఖండించిన హమాస్‌ 

ముమ్మాటికీ ఇజ్రాయెల్‌ బాధ్యత వహించాలని స్పషీ్టకరణ

ఆసుపత్రిలో పేలుడు ఘటనలో 471 మంది మృతి 

ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పర్యటన    

గాజా స్ట్రిప్‌/టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ:  గాజా సిటీలోని అల్‌–అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఘటనపై ఇజ్రాయెల్, హమాస్‌ పరస్పరం నిందలు మోపుకుంటున్నాయి. దాదాపు 500 మందిని బలిగొన్న కిరాతకులు మీరంటే మీరేనని వాదులాటకు దిగాయి. ఇస్లామిక్‌ జిహాద్‌ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్‌ గురితప్పడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఇజ్రాయెల్‌ చెబుతోంది. కానీ, ముమ్మాటికీ ఇజ్రాయెల్‌ సైన్యమే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని హమాస్‌ ఆరోపించింది.

అల్‌–అహ్లీ ఆసుపత్రి ప్రాంగణంలో హృదయవిదారక వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను ఎక్కడికి తరలించాలో తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే గాజాలో ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయానని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ వైద్య సదుపాయాలు లేకపోవడంతో మృతుల సంఖ్య  మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య యుద్ధం బుధవారం 12వ రోజుకు చేరింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 3,478 మంది మరణించారని, 12,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మరో 1,300 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నామని, వారు ప్రాణాలతో బయటపడతారన్న నమ్మకం లేదని వెల్లడించింది. హమాస్‌ రాకెట్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. దాదాపు 200 మంది బందీలు ఇప్పటికీ హమాస్‌ అ«దీనంలోనే ఉన్నారు. వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్‌ సాగిస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇరుపక్షాలు మెట్టు దిగిరావడం లేదు. దాంతో బందీల పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. గత 12 రోజుల్లో హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై 450 రాకెట్లు ప్రయోగించారని అంచనా. ఇజ్రాయెల్‌ సైన్యం దక్షిణ గాజాపై  వైమానిక దాడులు కొనసాగించింది.  

భయంకరమైన ఊచకోత: హమాస్‌  
అల్‌–అహ్లీ హాస్పిటల్‌లో పేలుడుకు తాము కారణం కాదని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి డేనియల్‌ హగారీ చెప్పారు. ఆ పేలుడుతో తమకు సంబంధం లేదన్నారు. పేలుడు జరిగిన సమయంలో తాము ఆ ప్రాంతంపై అసలు ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం 6.59 గంటల సమయంలో సమీపంలోని ఓ శ్మశాన వాటిక నుంచి పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ అయిన ఇస్లామిక్‌ జిహాద్‌ సభ్యులు రాకెట్‌ను ప్రయోగించినట్లు తమ రాడార్‌ గుర్తించిందని తెలిపారు.

ఈ రాకెట్‌ గురితప్పి, ఆసుపత్రి బయట పార్కింగ్‌ ప్రాంతంలో పేలిందని వెల్లడించారు. ఆసుపత్రిలో పేలుడు ఘటనను ‘భయంకరమైన ఊచకోత’గా హమాస్‌ అభివర్ణించింది. ఈ దురాగతానికి ఇజ్రాయెల్‌ సైన్యమే కారణమని పే ర్కొంది. ఈ మారణకాండకు బాధ్యత వహించకుండా ఇజ్రాయెల్‌ తప్పించుకోవాలని కుట్ర పన్నుతోందని ఆరోపించింది. అల్‌– అహ్లీ ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ కొన్ని రోజుల క్రితమే ఆదేశించిందని గుర్తుచేసింది.  ఆసుపత్రిలో పేలుడులో 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆ సంఖ్యను 471గా సవరించింది.  

బైడెన్‌తో సమావేశాలు రద్దు  
గాజా ఆసుపత్రిలో పేలుడు ఘటనకు నిరసనగా జోర్డాన్‌ కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరగాల్సిన సమవేశాన్ని జోర్డాన్‌ రాజు అబ్దుల్లా–2 రద్దు చేసుకున్నారు. పాలస్తీనా నేత మొహమ్మద్‌ అబ్బాస్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సిసీ కూడా ఇదే బాటలో నడిచారు. బైడెన్‌తో తాము భేటీ కావడం లేదని తేలి్చచెప్పారు. దాంతో బైడెన్‌ తన పర్యటనను కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని జోర్డాన్‌ విదేశాంగ మంత్రి సపాధీ చెప్పారు.   

హమాస్‌ లావాదేవీలపై ఆంక్షలు
ఇజ్రాయెల్‌పై దాడికి దిగి, వెయ్యి మందికిపైగా జనాన్ని బలి తీసుకున్న మిలిటెంట్‌ సంస్థ హమాస్‌పై అగ్రరాజ్యం అమెరికా కఠిన చర్యలు ప్రారంభించింది. 10 మంది హమాస్‌ మిలిటెంట్ల బృందం ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం అమెరికా ప్రకటించింది. అలాగే హమాస్‌ ఆర్థిక నెట్‌వర్క్‌పైనా ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. గాజా, సూడాన్, తుర్కియే, అల్జీరియా, ఖతార్‌లో ఈ ఆంక్షలు అమలవుతాయని వెల్లడించింది.

ఈ ఆంక్షల వల్ల విదేశాల నుంచి హమాస్‌కు నిధులు అందకుండా కట్టడి చేసినట్లు అవుతుందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జానెట్‌ చెప్పారు. ఇరాన్‌ ప్రభుత్వం హమాస్‌ మిలిటెంట్లకు అండగా నిలుస్తూ, భారీ ఎత్తున ఆర్థిక సాయం అందిస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇకపై నిధులు ఇవ్వడం సులభం కాదు. వివిధ దేశాల్లో హమాస్‌ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయా ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.  

ఆ పేలుడుకు కారణం ఇజ్రాయెల్‌ కాదు: బైడెన్‌   
గాజా హాస్పిటల్‌లో భీకర పేలుడుకు ఇజ్రాయెల్‌ ఎంతమాత్రం కారణం కాదని, ‘మరో బృందం’ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. ఆయన బుధవారం ఇజ్రాయెల్‌లో టెల్‌ అవీవ్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో బైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం, తాజా పరిణామాలు, గాజా ప్రజలకు అందించాల్సిన మానవతా సాయంపై చర్చించుకున్నారు. అల్‌–అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఉదంతం ప్రస్తావనకు వచి్చంది.

ఇస్లామిక్‌ జిహాద్‌ సభ్యులు ప్రయోగించిన రాకెట్‌ మిస్‌ఫైర్‌ కావడం వల్లే ఈ పేలుడు జరిగిందన్న ఇజ్రాయెల్‌ వాదనతో బైడెన్‌ ఏకీభవించారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ప్రజల ధైర్యసాహసా లు, అంకితభావం, శౌర్యాన్ని గౌరవిస్తూ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తుండడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానంటూ బైడెన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రజల దుఃఖాన్ని అమెరికన్లు సైతం పంచుకున్నారని చెప్పారు. ఇజ్రాయెల్‌–హమస్‌ ఘర్షణ మరింత విస్తరించకూడదన్నదే తన ఉద్దేశమని తెలిపారు. ఈజిప్టు నుంచి మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని వివరించారు.  

గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్‌ డాలర్ల సాయం: బైడెన్‌
టెల్‌ అవీవ్‌:  గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్‌ డాలర్ల (రూ.832.87 కోట్లు) మానవతా సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ప్రకటన బుధవారం ప్రకటించారు. గాజా ప్రజలకు ఇప్పుడు ఆహారం, నీరు, ఔషధాలు, వసతి చాలా అవసరమని అన్నారు. గాజాకు ఇతర దేశాల నుంచి మానవతా సాయం చేరడానికి అంగీకరించాలని ఇజ్రాయెల్‌ కేబినెట్‌ను కోరానని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. తాము అందించే 100 మిలియన్‌ డాలర్ల సాయం హమాస్‌కు, ఉగ్రవాద సంస్థలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, బాధిత పాలస్తీనియన్లకు మాత్రమే అందేలా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని బైడెన్‌ పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు