Israel-Hamas War: ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం.. అల్లాడిపోతున్న గాజా

29 Oct, 2023 04:33 IST|Sakshi
ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజా్రస్టిప్‌లోని ఓ ప్రాంతంలో కమ్ముకున్న మంటలు, పొగ

7,700 దాటిన మృతులు

కనీస అవసరాలకూ కటకట

కీలక దశకు యుద్ధం: ఇజ్రాయెల్‌

జెరూసలేం: హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ తీవ్రతరం చేస్తోంది. దానిపై భూతల దాడుల తీవ్రతను శనివారం మరింత పెంచింది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజాకేసి దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్‌ దాడులు కొనసాగుతున్నాయి. హమా స్‌ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది.

వాటి తీవ్రత యుద్ధం మొదలైన ఈ మూడు వారాల్లో కనీవినీ ఎరగనంత ఎక్కువగా ఉందంటూ గాజావాసులు ఆక్రోశిస్తు న్నారు. వాటి దెబ్బకు గాజాలో ఇప్పటిదాకా మిగిలి ఉన్న అరకొర సమాచార వ్యవస్థలన్నీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో గాజాలోని 23 లక్షల మందికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టేనని భావిస్తున్నారు.

దాడుల ఫొటోల విడుదల
గాజాలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్న యుద్ధ ట్యాంకుల వరుసలు తదితరాల ఫొటోలను ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసింది. భారీ సంఖ్యలో సైన్యం, ట్యాంకులు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. ‘‘మా సైన్యాలు గాజాను కమ్ముకుంటున్నాయి. యుద్ధం కొనసాగుతోంది’’ అని సైన్యం అధికార ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగరీ ప్రకటించారు. మరోవైపు, యుద్ధం కీలక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ ప్రకటించారు.

‘‘గత రాత్రి గాజాలో భూకంపం పుట్టించాం. నేలమీద, భూగర్భంలో ఉన్న హమాస్‌ స్థావరాలపై భారీగా దాడులకు దిగాం’’ అని వివరించారు. గాజాపై ఇప్పటిదాకా రాత్రిపూట దాడులకే సైన్యం పరిమితమవుతూ వచి్చంది. కానీ ఇక ఆ ప్రాంతమంతటినీ ఆక్రమించడమే ఇప్పుడు ఇజ్రాయెల్‌ లక్ష్యమని చెబుతున్నారు. అయితే హమాస్‌ విస్తృత భూగర్భ నెట్‌వర్క్‌ తదితరాలను నాశనం చేసేందుకు చాలా సమయం పడుతుందన్న సైన్యం వ్యాఖ్యల నేపథ్యంలో పోరుకు ఇప్పట్లో తెర పడే సూచనలు కని్పంచడం లేదు...!

ఆస్పత్రే హమాస్‌ కేంద్రం!
గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అయిన షిఫా నిజానికి హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ ప్రధాన కార్యాలయమని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఆస్పత్రి కిందే దాని ప్రధాన స్థావరం దాగుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా రూపొందించిన ఓ సిమ్యులేటెడ్‌ వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది. వందలాది మంది హమాస్‌ మిలిటెంట్లు ఆస్పత్రి కింద తలదాచుకున్నారని పేర్కొంది. ‘‘ఆస్పత్రి కింద లెక్కలేనన్ని భూగర్భ కాంప్లెక్సులున్నాయి.

ఉగ్రవాదులు వాటిని యథేచ్ఛగా వాడుకుంటున్నారు’’ అని ఆరోపించింది. ఆస్పత్రి కింద ఉన్న నెట్‌వర్క్‌ మొత్తాన్నీ బట్టబయలు చేసి తుడిచి పెట్టి తీరుతామని ప్రకటించింది. షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌పై భారీ దాడికి సైన్యం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తుండటం తెలిసిందే. హమాస్‌ దురాగతాలు ఐసిస్‌ను మించిపోయాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ దుయ్యబట్టారు. ఆస్పత్రులనే ప్రధాన స్థావరాలుగా మార్చుకునే నైచ్యానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను హమాస్‌ ఖండించింది.

గాజాకు స్టార్‌లింక్‌ కనెక్టివిటీ
గాజాలో పాలస్తీనియన్లకు కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రయతి్నస్తున్న అంతర్జాతీయ సంస్థలకు స్టార్‌లింక్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ తదితర కనెక్టివిటీ సౌకర్యం కలి్పస్తామని టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ శనివారం ప్రకటించారు. గాజాలో అన్ని సమాచార సదుపాయాలనూ ధ్వంసం చేయడం దారుణమంటూ అమెరికా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కొరెట్జ్‌ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మస్క్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. స్టార్‌ లింక్‌ మస్క్‌ తాలూకు అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఉపగ్రహ నెట్‌వర్క్‌ వ్యవస్థ.  

7,700 దాటిన మృతులు
► అక్టోబర్‌ 7న మొదలైన ఇజ్రాయెల్‌–హమాస్‌ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది.
► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది.
► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం.
► గతంలో ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా!
► అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది.

సర్వం స్తంభించింది...
ఇజ్రాయెల్‌ దాడుల ధాటికి గాజాలో సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాంతో వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్‌ అల్‌ఖిద్రా తెలిపారు.
► అంబులెన్స్‌లకు సమాచారమివ్వడం అసాధ్యంగా మారిపోయింది.
► అవసరమైన చోట్లకు ఎమర్జెన్సీ బృందాలను పంపడం నిలిచిపోయింది.
► ఇజ్రాయెల్‌ సైనిక వాహనాల హోరు, బాంబుల మోతల మధ్యే వైద్య బృందాలతో కూడి న వాహనాలు క్షతగాత్రుల కోసం చెదురుమదురుగా వెదుకులాడుతున్నాయి.
► చాలాచోట్ల గాయపడ్డవారిని పౌరులే తమ వాహనాలపై ఆస్పత్రులకు చేరుస్తున్నారు.
► బాంబు దాడుల ధాటికి నేలమట్టమవుతున్న ఒక వీధిలో నుంచి పాలస్తీనియన్లు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండటం స్థానిక మీడియా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. గాయాలతో కుప్పకూలి అల్లాడుతున్న ఒక వ్యక్తి అంబులెన్స్‌ అని అరుస్తుండటం అందులో కనిపిస్తోంది.
► తాము కేవలం హమాస్‌ మిలిటెంట్‌లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. కానీ వారు పౌరులను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు.

బందీల బంధువుల నిరసన
అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు చెరపట్టిన 200 మంది పై చిలుకు ఇజ్రాయెలీల బంధువులు టెల్‌ అవీవ్‌ నగరంలో నిరసనకు దిగారు. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ వచ్చి తమ గోడు వినాలంటూ నినాదాలు చేశారు. బందీలను విడిపించి వెనక్కు తీసుకొచ్చే ఆలోచన ఎవరూ చేయడం లేదంటూ మండిపడ్డారు.
► హమాస్‌ చెరలో 229 మంది ఉన్నట్టు సైనిక అధికార ప్రతినిధి హగరీ నిర్ధారించారు. అయితే వారిని విడుదల చేస్తే కాల్పులు విరమిస్తామని ప్రతిపాదించినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.
► ఖతర్, ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వం ఫలితంగా నలుగురు బందీలను హమాస్‌ ఇటీవల విడుదల చేయడం తెలిసిందే.

మరిన్ని వార్తలు