Israel-Hamas war: హమాస్‌ స్థావరాలే లక్ష్యం

30 Oct, 2023 04:58 IST|Sakshi
దాడులతో గాజా్రస్టిప్‌లో చెలరేగిన మంటలు. ఇజ్రాయెల్‌లోని సమీప సెడెరాట్‌ నగరం నుంచి కనిపించిన దృశ్యమిది

గాజాలో భూతల, వైమానిక దాడులు ఉధృతం 

24 గంటల వ్యవధిలో 450 స్థావరాలపై నిప్పుల వర్షం 

మిలిటెంట్లపై రెండో దశ యుద్ధం కొనసాగుతోందన్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ 

గాజాలో 8,000 దాటిన మృతుల సంఖ్య  

గాజాస్ట్రిప్‌/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ స్థావరాలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఇజ్రాయెల్‌ పదాతి దళం మన్ముందుకు చొచ్చుకెళ్తోంది. మరోవైపు వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 450 హమాస్‌ స్థావరాలపై దాడుల చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం ప్రకటించింది.

మిలిటెంట్ల కమాండ్‌ సెంటర్లు, అబ్జర్వేషన్‌ పోస్టులు, యాంటీ–ట్యాంక్‌ మిస్సైల్‌ లాంచింగ్‌ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలియజేసింది. గాజాలోకి మరిన్ని పదాతి దళాలు అడుగుపెట్టబోతున్నాయని పేర్కొంది. ఖాన్‌ యూనిస్‌ సిటీలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. వీరిలో 10 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. హమాస్‌ కమాండ్‌ పోస్టు ఉందని భావిస్తున్న షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు దాడి చేశాయి.

గాజా సిటీలో ఇదే అతిపెద్ద ఆసుపత్రి. ఇక్కడ వందలాది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఎంతమంది బలయ్యారన్నది తెలియరాలేదు. హమాస్‌పై రెండో దశ యుద్ధం కొనసాగుతోందని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో శత్రువులపై భీకర పోరు తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు హమాస్‌ మిలిటెంట్లు సైతం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పైకి అప్పుడప్పుడు రాకెట్లు ప్రయోగిస్తున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో తరచుగా సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది.  
 
మూడు వారాలు దాటిన ఘర్షణ   

ఇజ్రాయెల్‌ దాడుల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 8,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీరిలో 3,300 మంది మైనర్లు, 2,000 మందికిపైగా మహిళలు ఉన్నారని ప్రకటించింది. శిథిలాల కింద మరో 1,700 మంది చిక్కుకుపోయినట్లు అంచనా. వారు ఎంతమంది బతికి ఉన్నారో చెప్పలేని పరిస్థితి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.  ఇజ్రాయెల్‌దాడులు తీవ్రతరం కావడం పాలస్తీనియన్లలో గుబు లు పుట్టిస్తోంది. ఇలాంటి భీకర దాడులను తామెప్పుడూ చూడలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఆర్మీకి నెతన్యాహూ క్షమాపణ  
ఇజ్రాయెల్‌ భద్రతా దళాలకు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ క్షమాపణ చెప్పారు. ఈ నెల 7న జరిగిన హమాస్‌ దాడిని ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైందంటూ ఆయ న తొలుత ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దాడికి సంబంధించి భద్రతా దళాల అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని తప్పుపట్టారు. నెతన్యాహు పోస్టుపై ఆయన సహచర మంత్రులు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భద్రతా సిబ్బంది ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెట్టడం ఏమిటని పలువురు మండిపడ్డారు. దీంతో బెంజమిన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. భద్రతా బలగా లకు క్షమాపణ చెప్పారు. వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.  

పశి్చమాసియాలో శాంతి నెలకొనాలి: మోదీ  
ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం కారణంగా పశి్చమాసియాలో ఉద్రిక్తత పెరిగిపోతుండడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సిసీతో ఫోన్‌లో మాట్లాడారు. పశి్చమాసియా పరిణామాలపై చర్చించారు. గాజాలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సాధారణ ప్రజలు మరణిస్తుండడం తీవ్ర విచాకరమని మోదీ పేర్కొన్నారు. పశి్చమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని, ఇందుకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు మోదీ ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. గాజాకు మానవతా సాయం అందిస్తామన్నారు.  
  
గోదాములు లూటీ  

మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల 23 లక్షల మంది గాజా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చల్లారని ఆకలి మంటలు వారిని లూటీలకు పురికొల్పుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సంస్థ గోదాముల్లో భద్రపరుస్తోంది. ప్రజలకు పంపిణీ చేస్తోంది.

అయితే, ఆకలికి తాళలేని జనం గోదాములను లూటీ చేస్తున్నారని, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాలు, పరిశుభ్రతకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్నారని వెల్లడించింది. గాజాలో ‘సివిల్‌ ఆర్డర్‌’ గతి తప్పుతోందని పేర్కొంది. పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారతోందని, ఆవేశంలో ఉన్న ప్రజలను నియంత్రించలేకపోతున్నామని తెలియజేసింది. రణభూమిగా మారిన గాజాలో ఉండలేక, ఇతర దేశాలకు వలస వెళ్లే మార్గం కనిపించక జనం నిరాశలో మునిగిపోతున్నారని, అంతిమంగా వారిలో హింసాత్మక ధోరణి పెరిగిపోతోందని స్పష్టం చేసింది. 

‘ద్విదేశ’ విధానమే పరిష్కారం: బైడెన్‌  
ఇజ్రాయెల్‌–పాలస్తీనా వివాదానికి తెరపడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆకాంక్షించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం ముగిసిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, అరబ్‌ దేశాల నాయకత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సూచించారు. ద్విదేశ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ఒప్పందానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్తీనా అనే రెండు దేశాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూకు తెలియజేశానని అన్నారు.    

వెస్ట్‌బ్యాంక్‌లో మరో దారుణం  
ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్‌ దాడులు మొదలైన తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లోని నబ్లూస్‌లో ఓ యూదు సెటిలర్‌ జరిపిన కాల్పుల్లో బిలాల్‌ సాలెహ్‌ అనే పాలస్తీనియన్‌ రైతు మరణించాడు. ఈ రైతు ఆలివ్‌ తోటలు సాగుచేస్తుంటాడు. వెస్ట్‌బ్యాంక్‌లో గత 23 రోజుల్లో యూదు సెటిలర్ల దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇక ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో ఇక్కడ 110 మందికిపైగా జనం ప్రాణాలు  కోల్పోయారు.

మరిన్ని వార్తలు