కాల్పుల విరమణపై తీర్మానం అమెరికా వీటో!

10 Dec, 2023 05:22 IST|Sakshi

హమాస్‌ పుంజుకుంటుందని ఆందోళన

ఓటింగ్‌కు దూరంగా ఉన్న బ్రిటన్‌

విచారం వ్యక్తం చేసిన యూఏఈ

న్యూయార్క్‌: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలడ్డింది యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్‌ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి.

ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్యదేశం బ్రిటన్‌ ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం, అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరస్‌ పిలుపునిచ్చారు.

యూఎన్‌ ఛార్టర్‌లోని ఆర్టికల్‌ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశ పరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యూఏఈ తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్‌ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఆ దేశ ప్రతినిధి రాబర్ట్‌ వుడ్‌ మండలిలో మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే, అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్‌ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా అంటోంది. మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై యూఏఈ రాయబారి మహ్మద్‌ అబుషాహబ్‌ విచారం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు