విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ 

9 Dec, 2023 06:31 IST|Sakshi
హెల్త్‌ రైజ్, ఏసీఎన్‌ ఇన్ఫోటెక్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌   

పెట్టుబడులకు ముందుకొచ్చి న హెల్త్‌ రైజ్‌ సంస్థ 

5 వేల మందికి ఉపాధి 

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 

మంత్రితో సమావేశమైన సంస్థ ప్రతినిధులు 

విశాఖలో ఐటీ అభివృద్ధిని  వివరించిన మంత్రి 

సాక్షి, విశాఖపట్నం : ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్‌రైజ్‌ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చి ంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఈ విషయాన్ని శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఎపిటా, ఏసీఎన్‌ ఇన్‌ఫోటెక్‌ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక్కడ 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు.

రుషికొండ ఐటీ హిల్స్‌లో మంత్రి అమర్‌నాద్‌తో హెల్త్‌రైజ్‌ సంస్థ సీఈవో డేవిడ్‌ ఫార్బ్‌మెన్, ఏసీఎన్‌ ఇన్ఫోటెక్‌ ఎండీ చమన్‌బైద్, ఎపిటా సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఐటీ సలహాదారు శేషిరెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. సంస్థ అందించే సేవలు, కల్పించే ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్‌ చేయడంతో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి అమర్‌నాథ్‌ చెప్పారు. బీచ్‌ ఐటీ కారిడార్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ఏపీలో 300 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని, ఏటా 1,20,000 మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అమెరికాలోని వివిధ టెక్‌ కంపెనీలలో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని అమెరికా సంస్థ బృందానికి వివరించారు. స్టార్టప్స్‌లోనూ తెలుగు విద్యార్థులు బాగా రాణిస్తున్నారన్నారు.

విశాఖలో మెడ్‌ టెక్‌ జోన్‌ మెడికల్‌ రీసెర్చ్‌కు, వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. హెల్త్‌రైజ్‌ సంస్థ సీఈవో డేవిడ్‌ మాట్లాడుతూ తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేందుకు హెల్త్‌ కేర్‌ ఆర్గనైజేషన్స్‌కు సహకారం అందిస్తుందన్నారు. రెవెన్యూ సైకిల్‌ మేనేజ్‌మెంట్, హెల్త్‌ కోడింగ్, వైద్య సంస్థలకు ఐటీ సర్విసులు సైతం అందించేలా విశాఖ నుంచి సంస్థ పనిచేస్తుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు