‘పెగసస్‌’పై ఇజ్రాయెల్‌లో దర్యాప్తు ప్రారంభం

31 Jul, 2021 06:30 IST|Sakshi

జెరూసలేం: పెగసస్‌ స్నూపింగ్‌ స్కామ్‌లో ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంస్థ పెగసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ స్పైవేర్‌ను ప్రత్యర్థులు, జర్నలిస్టులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో ప్రస్తుతం ఇదే వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు తాజాగా ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ వెల్లడించింది. తనిఖీల్లో ఏం తేలిందనే విషయాన్ని ఇప్పుడే బయటపెట్టలేమని స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్‌ రక్షణశాఖతోపాటు జాతీయ భద్రతా మండలి అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. రక్షణ శాఖ ఎక్స్‌పోర్ట్‌ కంట్రోల్‌ డివిజన్‌ ఇచ్చిన అనుమతుల ప్రకారమే ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ పనిచేస్తోందా? లేక నిబంధనలను ఉల్లంఘిస్తోందా? అనే విషయాన్ని తేల్చడానికి తనిఖీలు చేసినట్లు పేర్కొంది. తమ కార్యాలయానికి రక్షణ శాఖ అధికారులు వచ్చిన మాట నిజమేనని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పూర్తి పారదర్శకతతో పని చేస్తున్నామని తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు