హమాస్‌ టన్నెల్‌లో మృతదేహాలు.. బయటకు తీసిన ఐడీఎఫ్‌

25 Dec, 2023 09:00 IST|Sakshi

హమాస్‌ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం. ఆదివారం హమాస్‌ చేతిలో బంధించబడి చంపబడిన ఐదు ఇజ్రాయెల్‌ బంధీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) పేర్కొంది. హమాస్‌ ఏర్పాటు చేసుకున్న సొరంగాల నుంచి ఇజ్రాయెల్‌ బంధీల మృతదేహాలను ఐడీఎఫ్‌ సేనలు వెలికి తీశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ ఎక్స్‌( ట్వీటర్‌)లో పోస్ట్‌ చేసింది. 

‘ఇంటలిజెన్స్‌ సాయంతో ఐడీఎఫ్‌ బలగాలు ఆక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లిన ఐదుగురు ఇజ్రాయెల్‌ పౌరుల మృతదేహాలను హమాస్‌ సొరంగం నుంచి బయటకు తీశామని’ అని ఐడీఎఫ్‌ వెల్లడించింది. బయటకు తీసిన మృతదేహాలు.. జివ్ దాడో, ఎస్‌జీటీ రాన్ షెర్మాన్,  సీపీఎల్‌ నిక్ బీజర్,ఈడెన్ జకారియా, ఎలియా తోలెడానోగా ఇజ్రాయెల్‌ సైన్యం గుర్తించింది. జివ్‌ దాదో(36) ఇజ్రాయెల్‌ సైనికుడని, ఈడెన్‌ జకారియా(27) సౌత్‌ ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు హాజరైన ప్రేక్షుడని తెలిపారు.

శుక్రవారం, శనివారం హమాస్‌ మిలిటెంట్ల ఎదురుదాడిలో 14 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు మృతిచెందిన ఇజ్రాయెల్‌ సైనికుల సంఖ్య 153కు చేరింది.

>
మరిన్ని వార్తలు